వికీలీక్స్ వ్యవస్థాపకుడిని అమెరికా రప్పిచుకోవాలని తహతహ
తమ మిలిటరీ గుట్టు రట్టు చేసాడని ఆగ్రహం
మాతృదేశానికి చేరుకున్న అసాంజె
(దుప్పల రవికుమార్)

అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తూనే ఉంది. ఆ దేశం చేసిన తప్పులు కుప్పలుగా మారినా దానికి భయం లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే సిగ్గు లేదు. అలా ఉంటేనే ప్రపంచాన్ని పూర్తి కంట్రోల్‌లో పెట్టగలం. ఎవరైనా ఏదైనా అంటారని చిటుక్కున ఫీలయిపోతే మన పెద్దరికం పోతుంది. ఒకసారి పెద్దరికం పోతే, ఇన్నాళ్లూ పెద్దరికం పేరుతో చేసిన అఘాయిత్యాలు, అకృత్యాల చిట్టా బయటపడిపోతుంది. పెద్ద ఎత్తున వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయి. వ్యాపారంలో లాభం కోసం ఏమి చెయ్యడానికైనా తెగబడితేనే లాభాలు కళ్లజూసేది. లాభాలు జమ చేస్తేనే వ్యాపారులు ప్రభుత్వాలకు డబ్బులిచ్చేది. ఈ చక్రం ఎక్కడా ఆగకుండా సాఫీగా తిరగడానికి అమెరికా అధ్యక్షులు ఎవరొచ్చినా కృషి చేయాల్సిందే. కాని, ఇప్పుడు ఆ దేశంలో ఆర్థిక మాంద్యం మొదలైంది. అది ద్రవ్యోల్బణం అంటే ఇన్‌ఫ్లేషన్ నుంచి అతిద్రవ్యోల్బణానికి అంటే స్టాగ్‌ఫ్లేషన్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. తమకు దేవుడే దిక్కు అంటూ అమెరికన్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా పరువు తీయడానికి సిద్ధపడిన ఒక ఆస్ట్రేలియన్ పౌరుడిని ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తోంది. అతడు జూలియన్ అసాంజె.
అసాంజె గత వారమే తన మాతృదేశమైన ఆస్ట్రేలియా సురక్షితంగా చేరుకున్నాడు. అతడి మీద అమెరికా పెట్టిన పదిహేడు కేసులు వీగిపోయినా, అమెరికా మిలటరీ రహస్యాలు తస్కరించాడనే ఒక్క కేసులో మాత్రం శిక్ష పడిరది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అమెరికన్ ఫెడరల్ కోర్టు విధించింది. అయితే అసాంజె అప్పటికే సుమారు ఒకటిన్నర దశాబ్దం జైలులాంటి జీవితమే గడుపుతున్నాడు కాబట్టి, మరి శిక్ష అవసరం లేదని కోర్టు అభిప్రాయపడిరది. అసలు విషయం ఏమిటంటే, కోర్టు ట్రయల్ జరుగుతుండగానే అమెరికన్ ప్రభుత్వం ఒక లోపాయికారీ ఒప్పందాన్ని అసాంజెకు ప్రతిపాదించింది. రెండేళ్లు దాని గురించి తీవ్రంగా ఆలోచించిన అసాంజె అందుకు సమ్మతించడంతో అమెరికా చల్లబడిరదని, అతడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి వీలయింది. అసాంజె గత పద్నాలుగు సంవత్సరాలుగా వివిధ దేశాలలో తల దాచుకుంటూ దాదాపు జైలు జీవితం గడపడానికి కారణం ` అతడు ఒక వెబ్‌సైట్ నిర్వహించడమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఆ వెబ్‌సైట్ పేరు వికీలీక్స్. అందులో అతను ఏం చేసాడంటే సమాచారాన్ని సార్వజనీనం చేసాడు. జ్ఞానాన్ని ప్రజాస్వామికం చేసాడు. ఇప్పటికీ వికీపీడియా మొత్తంగా సమాచార విప్లవంలో పెను విస్ఫోటనంగా నిలిచింది.
అమెరికా యుద్ధనేరాల జాబితా
వికీపీడియాలో ఎవరైనా దేనికి సంబంధించిన సమాచారమైనా రాయవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్న సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు. ప్రపంచంలోని ఏ భాషలోనైనా నిరభ్యంతరంగా సమాచారం పోగు చేసుకోవచ్చు. అందులో భాగంగా వికీలీక్స్ పేరిట ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌లో ప్రపంచంలోని చాలా దేశాల అధికారిక సమాచారాన్ని, ఆయా దేశాలు రహస్యంగా దాచిన లేదా తొక్కిపెట్టిన విషయాలను తమ వెబ్‌సైట్‌లో ఒక్కొటొక్కటిగా చేర్చడం మొదలుపెట్టాడు. రహస్య సమాచారం అంటే దేశాధినేతలు, ఇతర ముఖ్యులు చేసిన రాసలీలల గురించేనని సగటు తెలుగు టీవీ వార్తల ప్రేక్షకుడిలాగా భావించకండి. ఇందులో ఉన్నదంతా ఎక్కువ భాగం వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాలు, యుద్ధ నేరాలు, గూఢచర్యం, పెద్ద స్థాయిలో అవినీతి, విదేశాంగ విధానాల గురించే. అందులో అన్ని దేశాల కంటే ఎక్కువగా పాపాల పుట్టలు బద్దలయింది అమెరికా గురించే. దాంతో అమెరికాకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అందులో 2010లో అప్లోడ్ చేసిన ఒక వీడియో అమెరికా రక్షణశాఖ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచింది. అందులో ఇరాక్ రాజధాని బాగ్ధాద్‌లో అమెరికన్ మిలటరీ యుద్ధ విమానం విచక్షణారహితంగా కాల్పులు జరిపి సాధారణ పౌరులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపడం వివరంగా రికార్డయింది.
ఆ దృశ్యాలను చూసి ప్రపంచంలోనే కాదు అమెరికాలోని ప్రజలు కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఐక్యరాజ్యసమితి నుంచి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దాకా పౌరహక్కుల హననం గురించి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అమెరికా తల దించుకుంది. ప్రపంచంలో పట్టపగలే తమ పరువును నిలువునా తీసినా అసాంజె మీద పగ పెంచుకుంది. చేసిన తప్పును నిస్సిగ్గుగా పక్కన పెట్టి, తమ దేశపు మిలటరీ రహస్యాలను దొంగలించాడని తిరిగి అతని మీద కేసులు పెట్టింది. తమ దేశం రప్పించి, కఠినమైన శిక్షలు విధించాలని తీవ్రంగా ప్రయత్నించింది. అనంతరం తమ వికీలీక్స్ వెబ్‌సైట్‌లో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఛెల్సియా మానింగ్ సహకారంతో కొన్ని వేల రహస్య డాక్యుమెంట్లను అసాంజె పొందుపరిచారు. ఆ డాక్యుమెంట్లలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కొన్ని వందల మంది సాధారణ పౌరులను ఎలా హత్య చేసిందీ వివరంగా పొందుపరిచారు. వివిధ దేశాల మధ్య జరిగే చిన్న చిన్న విభేదాలతో అమెరికా జోక్యం చేసుకుంటుంది. తన పెద్దరికంతో ఆ స్వల్ప విభేదాలను సమసిపోయేలా చేయవచ్చు. కాని దానికి భిన్నంగా తన పెద్దరికపు ముసుగు ప్రమేయంతో ఆ స్వల్ప విభేదాలకు ఆజ్యం పోసి అంతకు మరింత చేసి రెండు దేశాల మధ్య శత్రు వైషమ్యాలను పెంచి, అక్కడితో ఊరుకోకుండా ఇరు దేశాలూ కయ్యానికి కాలు దువ్వేట్టు చేయడంలో అమెరికాది అందెవేసిన చేయి అని ఈ డాక్యుమెంట్ల ద్వారా ప్రపంచానికి తెలిసింది.
అసలైన యుద్ధ పిపాసి అమెరికా
తమ దేశంలో తయారైన యుద్ధ సామగ్రి ఇరు దేశాలకూ అమ్మడం అనే నీచమైన వ్యాపారం అమెరికా చేస్తోందని వికీలీక్స్ మన ప్రపంచానికి బట్టబయలు చేసింది. తాము కొత్తగా కనిపెడుతున్న రకరకాల యుద్ధ విమానాలను, క్షిపణులను, రాకెట్ లాంఛర్ల వంటి యుద్ధ సామగ్రిని పని చేస్తున్నాయో లేదో పరిశీలించే ప్రయోగశాలలుగా ఆ దేశాలను వాడుకోవడం అమెరికా రాక్షష మనస్తత్వానికి గుర్తుగా నిలిచింది. అమెరికా దమననీతి ససేమిరా నచ్చని చాలామంది అమెరికన్లు తమ దేశ వ్యాపార దృక్పథంలో మానవత్వం మంటగలిసిపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. తమ ఆగ్రహాన్ని ప్రభుత్వాలు మార్చడం ద్వారా ప్రదర్శించారు. కాని, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే మానవత్వం ముసుగు పక్కన పడేసి, వ్యాపారం చేయడమే తమ లక్ష్యంగా పనిచేయడం అగ్రదేశంలో రివాజయింది. ఒకవైపు ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర యాప్‌ల ద్వారా ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించి వివిధ వ్యాపార సంస్థలకు నగదుకు అమ్ముకునే జుకర్‌బర్గర్‌ను గొప్పగా కీర్తించే అమెరికా దేశం, మరోవైపు ప్రజలకు కీడు చేసి రహస్యంగా దాయబడిన సమాచారాన్ని ప్రజలకు ఉచితంగా అందజేసే అసాంజేను నేరస్తుడిగా చూడడం దాని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. అసాంజెను ఎలాగైనా అమెరికాకు రప్పించాలని అతడిపై పద్దెనిమిది కేసులు పెట్టింది. ప్రపంచంలోని అత్యున్నత న్యాయస్థానాలలో పద్నాలుగేళ్ల పాటు అగ్రదేశపు దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడుతునే ఉన్నాడు.
ఇతనికి ఆశ్రయమిచ్చి ఆమెరికా నుంచి కాపాడిన దేశంగా ఇంగ్లండును చెప్పుకోవచ్చు. ముందునుంచీ అసాంజే చేస్తున్న కృషిని అభినందించి, ఎథికల్ హ్యాకింగ్ నేరం కాదని భావించిన ఇంగ్లండ్ అమెరికా ప్రయత్నాలను వమ్ము చేసింది. పిల్లి పిల్లలను తిప్పినట్లు, ఇంగ్లండులోని రకరకాల ప్రదేశాలలో అసాంజెను దాచి ఉంచింది. 2012లో ఈక్వెడేరియన్ రాయబార కార్యాలయంలో దాచినపుడు అతని ఫోటోలు బయటకు రావడం సంచలనం సృష్టించింది. అతడు ఎక్కడున్నా సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండేది. లేడీ గాగా, పమేలా ఆండర్సన్‌లు రెగ్యులర్‌గా అతడిని కలవడంతో అతడి మీద లైంగిక అభియోగ పుకార్లు అమెరికా సృష్టించింది. తర్వాత కొన్నాళ్లు బ్రిటన్ జైలులో, 2019లో స్వీడిష్ రాయబార కార్యాలయంలో ఉంచారు. ఈ దాగుడుమూతల జీవితంలో అసాంజె ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అతడి భార్య స్టెల్లా అసాంజె ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనియా ఆల్బనీస్‌కు చేసిన ప్రత్యేక వినతి మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆయన స్వయంగా ఈ విషయమై అభ్యర్ధించేసరికి బైడెన్ శాంతించాడు.
యుఎస్ మిలటరీ రహస్యాల కేసులో తన నేరాన్ని స్వయంగా అసాంజె అంగీకరించడంతో అమెరికా ఆత్మ శాంతించింది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే అప్పటికే పదిహేనేళ్లుగా ప్రవాస జైలు జీవితం గడుపుతున్నందున, మరి శిక్ష అవసరం లేదని అమెరికా భావించింది. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున చేసిన విన్నపాలు కూడా ఇందుకు దారితీశాయి. దాంతో అసాంజె తన మాతృదేశానికి వెళ్లడానికి వీలు చిక్కింది. ఇప్పుడు అసాంజె ఏం చేస్తాడో చూడాలి. జర్నలిజం అసలు అర్థం ప్రపంచంలోని చాలా దేశాలకు అసాంజె చాటిచెప్పాడు. సాంకేతికతను వినియోగించి ప్రజాస్వామికతను ఎలా కాపాడుకోవచ్చో ఈ కాలపు నవీన తరానికి తెలియజేశాడు. ఇప్పుడు తన జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments