top of page

అసంపూర్ణ ‘డేటా’.. అనుమానాల వేట!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 23
  • 4 min read
  • విశాఖ డేటా సెంటర్‌పై రకరకాల ప్రచారాలు

  • ఒప్పంద వివరాలు వెల్లడిరచకపోవడమే కారణం

  • విద్యుత్‌, నీటి వినియోగంపై లోపించిన స్పష్టత

  • కొత్త ఉద్యోగాల కల్పనపైనా విభిన్న వాదనలు

  • నివృత్తి చేస్తేనే ప్రభుత్వానికి ఆదరణ

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఇండియానాపోలిస్‌.. అమెరికాలోని అతిపెద్ద డేటా సెంటర్‌ హబ్‌లలో ఒకటి. అక్కడి ఫ్రాంక్లిన్‌ టౌన్‌షిప్‌లో గూగుల్‌ సంస్థ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్‌ పెట్టాలని భావించింది. కానీ సెప్టెంబర్‌ 22న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనికి కారణం ఆ డేటా సెంటర్‌కు ఆ నగర కౌంటీ కౌన్సిల్‌తోపాటు ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకతే. ఇది జరిగిన మూడు వారాలకే అక్టోబర్‌ 14న ఇండియాలో సాగరతీర నగరమైన విశాఖపట్నంలో సుమారు 15 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల(సుమారు రూ.87,500 కోట్లు) పెట్టుబడితో ఒక గిగావాట్‌ సామర్థ్యం కలిగిన ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదే గూగుల్‌ సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. డేటా సెంటర్ల కెపాసిటీని విద్యుత్‌ మాదిరిగా కొలుస్తారు. ఆ లెక్కన ఒక గిగావాట్‌ అంటే వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్‌ విశాఖలో గూగుల్‌ తన అనుబంధ సంస్థ అయిన రైడన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా పేరుతో నెలకొల్పుతుందన్నమాట. ఈ డేటా సెంటర్‌ విషయంలో రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు, మరికొన్న అపోహలు ఉన్నాయి. దీనికి కారణం.. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోవడమే. డేటా సెంటర్‌ వల్ల విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏఐ, ఇతర సాంకేతిక విప్లవం పొంగిపొర్లుతుందని, లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ఆ ప్రాంత స్వరూప స్వభావాలే మారిపోతాయని ఘనంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వవర్గాలు.. కొన్ని వాస్తవాలను మాత్రం దాచిపెట్టి గుంభనంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లోని వివరాలను ప్రభుత్వాలు బహిరంగంగా ప్రకటిస్తుంటాయి. కానీ గూగుల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను ప్రభుత్వం పూర్తిగా బహిర్గతం చేయకపోవడం వల్ల ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. ప్రచారాలు చేస్తున్నారు.

మూడోచోట్ల భూములు

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రూ.87,500 కోట్లతో ఏర్పాటు చేసే డేటా సెంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి అంగీకరించింది. వీటి ప్రకారం డేటా సెంటర్లను మూడుచోట్ల ఏర్పాటు చేస్తారు. వీటికోసం భీమిలి మండలం తర్లువాడలో 200 ఎకరాలు, చినగదిలి మండలం అడవివరం`ముడసర్లోవ మధ్యలో 120 ఎకరాలు, రాంబిల్లి మండలంలో 160 ఎకరాలు కేటాయిస్తారు. వీటికి మార్కెట్‌ ధరలో 25 శాతం రాయితీ కల్పిస్తారు. ఈ భూముల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీపై వంద శాతం రాయితీ అంటే ఉచితంగా చేస్తారు. పెట్టుబడి ఖర్చుల్లో పది శాతం రాయితీతోపాటు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన జీఎస్టీ(ఎస్‌జీఎస్టీ) చెల్లింపు నుంచి పూర్తిగా మినహాయిస్తారు. ఈ మొత్తం రూ.2245 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఈ రాయితీలను పదేళ్లపాటు లేదా సంస్థ సామర్థ్యం పూర్తిస్థాయికి చేరుకునేవరకు కల్పిస్తారు. ఇక డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ను యూనిట్‌ రేటుపై రూపాయి తగ్గింపు ఇస్తారు. ఈ రాయితీ మొత్తం విలువ రూ.4,800గా అంచనా వేశారు. మొదట ఈ రాయితీని పదేళ్లు కల్పిస్తారు. అనంతరం అవసరాన్ని బట్టి మరో ఐదేళ్లు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఉద్యోగాలు ఎన్ని వస్తాయి?

గూగుల్‌పై ఇంత భారీగా రాయితీల వర్షం కురిపించడం రాష్ట్రంలోనే కాకుండా ఈ డేటా సెంటర్‌ కోసం పోటీ పడిన కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక ప్రైవేట్‌ సంస్థ కోసం ఈ స్థాయిలో రాయితీలు ఇవ్వడమంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఫణంగా పెట్టడమేనని, తాము అంత సాహసం చేయలేమని కర్ణాటక పరిశ్రమల మంత్రి ప్రియాంక్‌ ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఇంత భారీ పెట్టుబడి వస్తున్నా.. దానిపై రాయితీల వర్షం కురిపించినా దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది ప్రభుత్వం ఇంతవరకు స్పష్టంగా వెల్లడిరచలేదు. అసలు ఒప్పందంలోనే ఆ అంశం లేదని విశ్వసనీయంగా తెలిసింది. డేటా సెంటర్‌ వల్ల సిగ్నిఫికెంట్‌ సైజ్‌లో అంటే గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారే తప్ప ఎక్కడా కచ్చితమైన సంఖ్య ప్రస్తావించలేదు. ప్రభుత్వ అనుకూల వర్గాలు లక్షకుపైగా ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తుంటే.. వ్యతిరేక వర్గాలు రెండు మూడు వందలకు మించి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించబోవని వాదిస్తున్నారు. తటస్థులు, ఐటీ పరిశ్రమ నిపుణులు ఈ రెండు వాదనల్లో పాక్షిక వాస్తవం మాత్రమే ఉందని స్పష్టం చేస్తున్నారు. అటువంటివారి విశ్లేషణ ప్రకారం.. డేటా సెంటర్‌ అనేది కాల్‌ సెంటర్‌ కాదని కేవలం స్టోరేజీ కేంద్రమేనని అందులో సెక్యూరిటీ, నిర్వహణ సిబ్బంది తప్ప ఇంకెవరూ ఉండరని అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే డేటా సెంటర్‌ ద్వారా గరిష్టంగా 300 ఉద్యోగాలకు మించి ప్రత్యక్షంగా లభించే అవకాశం లేదంటున్నారు. అయితే డేటా సెంటర్‌ ఏర్పాటైతే దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. జనావాసాలు పెరుగుతాయి. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిటైల్‌ మార్కెట్‌, రవాణా వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి. వాటి వల్ల వేలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ విధంగా చూస్తే డేటా సెంటర్‌ వల్ల లక్షకుపైగా పరోక్ష ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయనడం వాస్తవమేనని అంటున్నారు. అయితే గూగుల్‌ పెట్టే కేవలం డేటా సెంటర్‌ మాత్రమే కాదని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రంగా కూడా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలు ఏర్పాటవుతాయని, దీనివల్ల పెద్దసంఖ్యలోనే కొత్త ఉద్యోగాలు రావడం ఖాయమని చెబుతున్నాయి.

విద్యుత్‌, నీరు ఎక్కడి నుంచి తెస్తారు?

డేటా సెంటర్లు ప్రధానంగా మానవ మెదడు, గుండెలా పని చేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల, ఇంటర్నెట్‌ వినియోగదారుల సమస్త సమాచారాన్ని స్టోర్‌ చేయడం, వినియోగదారులు కోరిన క్షణాల్లో తిరిగి అందజేయడం వీటి ప్రధాన విధి. ఇందుకోసం భారీ పరిమాణంలో ఇంటర్‌ కనెక్టడ్‌ సర్వర్లు, రౌటర్లు, స్విచ్‌లు సమూహమే డేటా సెంటర్‌. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారాలతో మరియు ఇవి నిరంతరాయంగా పనిచేస్తూ ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని నడిపిస్తుంటాయి. భారీ సర్వర్లు, ఇతర కంప్యూటర్‌ పరికరాలను నడిపించేందుకు భారీగా విద్యుత్‌ అవసరమవుతుంది. అమెరికాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్‌, ఎనర్జీ స్టడీ సెంటర్‌ అధ్యయనం ప్రకారం అమెరికాలో 5426 డేటా సెంటర్‌లు ఉండగా.. 2022లో వాటికి 17 గిగావాట్ల విద్యుత్‌ వినియోగించారు. ఒక గిగావాట్‌ (వెయ్యి మెగావాట్లు) విద్యుత్‌తో లక్ష జనావాసాల విద్యుత్‌ అవసరాలు తీర్చవచ్చు. మరి విశాఖలో ఏర్పాటయ్యే ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌కు ఇప్పుడున్న వనరులతో విద్యుత్‌ సౌకర్యం కల్పించగలరా? అన్నది ప్రశ్న. ఒకవేళ అలా చేస్తే.. అది విద్యుత్‌ గ్రిడ్‌కు పెనుభారంగా మారి సంక్షోభానికి దారి తీయవచ్చు. గూగుల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో విద్యుత్‌ రాయితీ గురించి ప్రస్తావించారే తప్ప అదనపు విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు విషయాన్ని పేర్కొనలేదు. తమ సంస్థ అవసరాలకు గూగుల్‌ గ్రీన్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటుంని సూచనప్రాయంగా పేర్కొన్నా.. అవి ఎప్పుడు చేపడతారు.. ఎప్పుడు ప్రారంభిస్తారని వివరాలు లేవు. అలాగే డేటా సెంటర్లు భారీ ఎత్తున వేడిని విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని చల్లబర్చేందుకు నిరంతరం కూలింగ్‌ (శీతలీకరణ) ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిరోజూ లక్షలాది లీటర్ల నీరు అవసరమవుతుంది. అంత పెద్దస్థాయిలో నీటి వనరుల లభ్యత విశాఖలో లేవు. మరి ఎక్కడినుంచి తెచ్చిస్తారన్న వివరాలు కూడా ఒప్పందంలో లేవు. అయితే గూగుల్‌ తన సెంటర్‌లకు గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. 2030 నాటికి కార్బన్‌ ఫ్రీ ఎనర్జీపై మాత్రమే పని చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ ప్రమాదాలు

డేటా సెంటర్లలోని కూలింగ్‌ వ్యవస్థల్లో ఉపయోగించే రసాయనాలు, విద్యుత్‌ ఉత్పత్తి వల్ల వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. భారీ డేటా సెంటర్లకు ఉపయోగించే సర్వర్లు, హార్డ్‌వేర్‌ గరిష్టంగా ఐదేళ్లలో మెరుగైన మోడళ్లకు మారిపోతుంటాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ వేస్ట్‌) భారీగా వెలువడుతుంది. వీటికి టాక్సిక్‌ పదార్థాలు (లెడ్‌, మెర్క్యురీ, కాడ్మియమ్‌) వంటి రసాయన వ్యర్థాలు తోడై విపరిణామాలకు కారణమవుతాయి. గార్డియన్‌ అవలొకేషన్‌ కథనం ప్రకారం.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి కంపెనీల డేటా సెంటర్‌ కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాలు అధికారులు ప్రకటించే వాటికంటే సుమారు 662 శాతం (సుమారు 7.62 రెట్లు) ఎక్కువగా ఉండవచ్చు. ఇక గూగుల్‌ నివేదికల ప్రకారం చూస్తే.. గూగుల్‌ సెంటర్లు వెలువరించే స్కోప్‌ 2 కర్బన ఉద్గారాలు గత ఏడాది 37 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే.. ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగిపోయి.. ఆదరణ పెరుగుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page