రుణాన్ని మూడొంతులు చూపి ఖాతాలో జమ
వెలుగుచూసిన గోవిందపురం క్లస్టర్ బాగోతం
డీఆర్‌డీఏకు తెలిసినా పట్టించుకోని వైనం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం క్లస్టర్‌లో మహిళా స్వయంశక్తి సంఘాల సీసీ చేతివాటం చూపించి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంకెల గారడీతో బురిడీ కొట్టించి క్లస్టర్ పరిధిలోని రెయ్యపాడు గ్రామంలోని కొత్తమ్మతల్లి గ్రూపులో ఉన్న 11 మంది సభ్యులకు ఉన్న రుణాన్ని మూడొంతులు చేసి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పెద్ద మొత్తంలో క్లస్టర్ సీసీ లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో సీసీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 2019 ఏప్రిల్ ఒకటి నాటికి రాష్ట్రంలోని స్వయంశక్తి సంఘాలకు ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు దశల్లో మాఫీ చేయడానికి వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకాన్ని రూపొందించింది. ఈ పధకం ద్వారా స్వయంశక్తి సంఘాల రుణాలను నాలుగు దశల్లో మాఫీ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని గోవిందపురం క్లస్టర్ పరిధిలో సీసీగా విధులు నిర్వహిస్తున్న మహిళ చేతివాటం చూపించి సుమారు రూ.3.20 లక్షలు ప్రభుత్వం నుంచి అదనంగా జమ చేయించుకున్నారు. దీంతో గోవిందపురం క్లస్టర్ పరిధిలో ఉన్న రెయ్యపాడులోని కొత్తమ్మతల్లి ఎస్‌హెచ్‌జి సభ్యులకు ఏకంగా రూ.4,33,209 ఆసరా డబ్బులు వారి ఖాతాలో జమయ్యాయి.

రికార్డులు తారుమారు
వాస్తవంగా కొత్తమ్మతల్లి ఎస్‌హెచ్‌జి సంఘంలోని 11 మంది సభ్యులకు 2019 ఏప్రిల్ 11 నాటికి జిల్లా మహిళా సమాఖ్య లెక్కల ప్రకారం రూ.1,10,807 రుణం ఉంది. వీరికి ఇంతే మొత్తం రుణమాఫీ జరగాల్సి ఉంది. ఒక్కో విడతలో రూ.2,900 చొప్పున నాలుగు విడతల్లో 11,600 రుణమాఫీ జరగాలి. సీసీ చేతి వాటం చూపించి రుణాన్ని మూడొంతులు ఎక్కువ చేసి సంఘంలోని 11 మంది సభ్యులకు రూ.4,33,209 ఉన్నట్టు రికార్డులు తారుమారు చేసి చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆసరా పథకం ద్వారా ఒక్కో విడతలో రూ.9,845 చొప్పున నాలుగు విడతల్లో రూ.39,382 జమ చేయించినట్లు తెలిసింది. ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని 11 మంది సభ్యుల నుంచి రికవరీ చేసి, వాటిని మండల, జిల్లా అధికారులకు తిరిగి ఇవ్వాలని సీసీ చెప్పినట్టు గ్రామంలో చర్చ సాగుతుంది. రుణాల లెక్కలు తారుమారు చేసి ఒక్కో సభ్యురాలికి ఆసరా నాలుగు విడతల డబ్బులు రూ.39,382 బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదుకు సిద్ధమవుతున్న బాధితులు
రెయ్యపాడు గ్రామంలో ఉన్న కొత్తమ్మతల్లి సంఘం మాదిరిగా సీసీ పరిధిలో ఉన్న మిగతా సంఘాల్లోనూ ఇదే పద్ధతిలో సభ్యుల రుణాన్ని ఎక్కువగా చూపించి వారి ఖాతాల్లో ఎక్కువ మొత్తాలను జమ చేయించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవిందపురం క్లస్టర్ సీసీ పరిధిలో ఉన్న సంఘాల్లోని సభ్యులంతా బాధితులేనన్న ఆరోపణలు ఉన్నాయి. వైకాపా హయాంలో స్థానిక నాయకుల ప్రోద్బలంతో సీసీ అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో ఏపీఎంను బాధ్యులుగా చూస్తున్నారు. తీసుకున్న రుణానికి, ఖాతాల్లో జమైన మొత్తానికి తేడా స్పష్టంగా ఉన్నా డీఆర్‌డీఏ అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక సంఘంలో 11 మంది సభ్యుల ఖాతాల్లో రూ.3.20లక్షలు జమ చేయించుకొని అవకతవకలకు పాల్పడితే ఎందుకు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గోవిందపురం క్లస్టర్ పరిధిలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని విమర్శలు ఉన్నాయి. అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ చేయించి బాధ్యుల నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఖాతాల్లో జమైన డబ్బులు వసూలుచేసి ఎవరెవరు వాటాలు వేసుకున్నారో బహిర్గతం కావాలని స్థానికులు కోరుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం క్లస్టర్ సీసీ చేతివాటంపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి రెయ్యపాడుకు చెందిన స్థానికులు సిద్ధమవుతున్నారు.
Comments