అప్పుడు ఎర్రన్నాయుడు, ఇప్పుడు అప్పలనాయుడు
సునామీ బాధితులను ఆదుకోడానికి ఒకరు
సభ్యత్వాల సునామీ సృషించడానికి ఇంకొకరు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆ ద్వీపంలో (ఐలండ్‌లో) మొత్తం జనాభాలో మూడో వంతు మనోళ్లే. బెంగాళీ మాట్లాడేవారు 32.6 శాతం ఉంటే, హిందీ మాట్లాడేవారు 25.95 శాతం ఉన్నారు. ఇక తమిళ్ మాట్లాడేవారు 17.84, తెలుగు మాట్లాడేవారు 12.81 శాతం మంది ఉన్నారు. మొత్తం జనాభాలో దాదాపు 1.50 లక్షల మంది తెలుగువారే. 2014 లెక్కల ప్రకారమే 80 వేల మంది తెలుగువారుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 1.50 లక్షలకు చేరిందని తెలుస్తుంది. ఇంతమంది తెలుగువారున్న ఆ ప్రాంతం మరేదో కాదు.. అండమాన్. ఇటువంటి తెలుగు ప్రాబల్యం ఉన్న చోటకు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్లింది అప్పటి ఎంపీగా కింజరాపు ఎర్రన్నాయుడు కాగా, మళ్లీ ఇన్నాళ్లకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగు ప్రజలతో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అండమాన్‌లో శనివారం దిగారు. 2004లో సునామీ వచ్చినప్పుడు అండమాన్‌లో తెలుగు ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయని తెలుసుకున్న ఎర్రన్నాయుడు అప్పుడు పోర్టుబ్లెయిర్‌లో తెలుగు ప్రజలు నివసిస్తున్న ప్రతీ ప్రాంతానికి వెళ్లి ఓదార్చి సహాయ సహకారాలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున అప్పటి రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా నరసన్నపేట మాజీ సర్పంచ్ టంకాల బాబ్జీని పట్టుకొని అండమాన్ వెళ్లారు. అది వేరే విషయం. కానీ పార్టీ తరఫున వెళ్లింది ఎర్రన్నాయుడు ఒక్కరే. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగుదేశం సభ్యత్వ నమోదును ఆన్‌లైన్‌లో చేపట్టడం కోసం కలిశెట్టి అప్పలనాయుడు వెళ్లారు. ఆయనకు అక్కడి తెలుగుదేశం నాయకులు సాదర స్వాగతం పలికారు. అసలు అండమాన్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ మున్సిపల్ కౌన్సిల్‌ను చేజిక్కించుకుందన్న విషయం చాలామందికి తెలియదు. దానికి బీజం వేసింది ఎర్రన్నాయుడే. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువమంది తెలుగువారు అండమాన్‌లో స్థిరపడ్డారు. కేంద్రమంత్రిగా ఎర్రన్నాయుడు పని చేసిన రోజుల్లో వీరి రవాణా కోసం ఎర్రన్నాయుడు అనేక ఏర్పాట్లు చేసేవారు. అందుకే 2010లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డులుంటే కేవలం ఒక్కచోటే టీడీపీ గెలుపొందింది. ఆ తర్వాత 2015లో 18 చోట్ల పోటీ చేసి 12 శాతం ఓట్‌షేర్‌తో రెండు స్థానాలు గెలుచుకుంది. మరో మూడు చోట్ల రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ముగ్గురూ తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీకి చెందినవారే. సహజంగానే అండమాన్‌లో తమిళుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఒకచోట కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే 2022లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ మద్దతుతో పోర్టుబ్లెయిర్ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఎస్ సెల్వి ఇక్కడ చైర్మన్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం ఇప్పుడు జాతీయ పార్టీ కావడం వల్ల తెలంగాణతో పాటు తెలుగువారు నివసించే అనేక ప్రాంతాల్లో తమ సభ్యత్వాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా అండమాన్‌లో కూడా తెలుగువారికి ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వమిచ్చే పనికి అప్పలనాయుడును పంపింది. గత కొన్నేళ్లుగా 70 లక్షల మంది తమ పార్టీ సభ్యులుగా ఉండాలని టీడీపీ భావిస్తున్నప్పటికీ అత్యధికంగా 64 లక్షల సభ్యత్వాలు మాత్రమే చేయగలిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 70 లక్షల టార్గెట్‌ను చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. సరిగ్గా సభ్యత్వ నమోదుకు ఒక్కరోజు ముందే అండమాన్‌లో తెలుగుదేశం పార్టీ నక్క మాణిక్యరావు అనే వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా నియమించింది. అండమాన్‌లో ఎప్పట్నుంచో బీజేపీ తన పట్టు సాధిస్తూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ కూటమిలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావడంతో పెద్దఎత్తున సభ్యత్వాలు నమోదవుతాయని అండమాన్ నుంచి ఎంపీ అప్పలనాయుడు ఫోన్ చేసి ‘సత్యం’కు తెలిపారు. శనివారం ఉదయమే వర్చువల్ విధానంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండమాన్‌లో ఉన్న అప్పలనాయుడుతో పాటు ఇద్దరు కౌన్సిలర్లు, అక్కడి పార్టీ అధ్యక్షుడితో మాట్లాడారు. సాయంత్రం అండమాన్‌లో ఉన్న ఆంధ్రాభవన్‌లో 2వేల మంది తెలుగుదేశం నేతలతో సమావేశమై సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టిస్తామని అప్పలనాయుడు చంద్రబాబుకు చెప్పారు. సునామీ బీభత్సం తర్వాత పర్యటించిన ఎర్రన్నాయుడు శ్రీకాకుళం వచ్చాక చాలా రోజుల పాటు వైరల్ ఫీవర్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయన అండమాన్‌లో ఉన్నప్పుడే జ్వరం వచ్చినా పట్టించుకోపోవడం వల్ల శ్రీకాకుళం చేరేనాటికి అది ఎక్కువైపోయింది.
Comments