అంతా.. ఆమె చేసుకున్నదే
- NVS PRASAD

- 1 day ago
- 4 min read
మహిళలకు పథకాలిచ్చినా ఓట్లు రావని తేలింది
ముస్లిం ఓటేస్తే చాలన్న భావన తప్ప్పు
పార్టీని నిలబెట్టడమే మమత ముందున్న సవాలు
‘ SIR ’ మీద పోరాటంతో టైం వేస్ట్ చేసుకున్న టీఎంసీ
ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని పార్టీ


175 చోట్లా తానే అభ్యర్థినని ఓటర్లు గుర్తించాలని గడిచిన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి తన సిద్ధం సభల్లో చెప్ప్పుకొచ్చారు. ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కారణం.. స్థానికంగా ఉన్న వైకాపా నేతల మీద ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలే. పశ్చిమబెంగాల్‌లో కూడా 294 సీట్లలో తానే అభ్యర్థినంటూ మమత చేసుకున్న ప్రచారం ఇలాగే బెడిసికొట్టింది. ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు నడిపితే ఏదో ఒకరోజు తారుమారవుతాయనడానికి నిదర్శనం ఇదే.
రైటర్స్ బిల్డింగ్స్‌ను (పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్) ముట్టడించి, బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడిన పదిహేనేళ్ల తర్వాత, మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. గడిచిన ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ ఓట్ల శాతం 45.84 శాతానికి పెరిగింది. మరోవైపు, తృణమూల్ ఓట్ల శాతం 48 శాతం నుంచి 40.8 శాతానికి పడిపోయింది. ఇది ఏడు శాతం భారీ తగ్గుదల. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఐదు శాతం ఓట్ల తేడా గత 25 ఏళ్లలో బెంగాల్‌లో నమోదైన అత్యంత స్వల్ప వ్యత్యాసం కావడం గమనార్హం.
ఈ గణాంకాలు ఒకేసారి రెండు కథనాలను చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. 40.8 ఓట్ల శాతం అనేది ఇప్పటికీ గణనీయమైన రాజకీయ పునాదిని సూచిస్తుంది. కానీ, బీజేపీ తన స్వల్ప ఓట్ల ఆధిక్యాన్ని సీట్ల పరంగా రెండున్నర రెట్లు ఎక్కువగా మార్చుకోగలిగింది. ఇది మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలకడమే కాకుండా, ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్, ఒకప్పుడు ఆమె రాజకీయ ఎదుగుదలకు కారణమైన సింగూర్ భూపోరాట ప్రాంతాన్ని కూడా కోల్పోయేలా చేసింది. ప్రస్తుత ప్రశ్న తృణమూల్ మళ్లీ బెంగాల్‌ను పాలించగలదా అనేది కాదు. ఇంతటి భారీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ తన పార్టీని కాపాడుకోగలరా అనేదే అసలు ప్రశ్న.
ఈ ఓటమి ఇంత తీవ్రంగా ఉండటానికి కారణాలేంటి?
ఏళ్ల తరబడి, మమతా బెనర్జీ ఎన్నికల సందేశం చాలా సరళంగా ఉండేది. తృణమూల్ అభ్యర్థులు ఎవరైనా సరే, వారు మమతా ప్రతిరూపాలే. 2021లో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. బలపడుతున్న బీజేపీని ఎదుర్కోవడానికి, ఆమె ఆ ఎన్నికలను బెంగాల్ ‘దీదీ’కి, ఢిల్లీ ‘బీజేపీ’కి మధ్య జరుగుతున్న పోరాటంగా మార్చారు. అప్పట్లో ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరు ఆమెకు మద్దతు ఇచ్చారు.
కానీ 2026లో ఆమె అదే సందేశాన్ని మళ్లీ ఇచ్చారు. అయితే ఈసారి ఓటర్లు కేవలం మమతను మాత్రమే కాకుండా, తాము నిత్యం చూస్తున్న పార్టీ యంత్రాంగాన్ని కూడా బేరీజు వేశారు. అధ్వాన్నమైన రోడ్లు, మూతపడిన, సరిగ్గా పనిచేయని పాఠశాలలు, ‘కట్-మనీ’ ఆరోపణలు, క్షేత్రస్థాయిలో తృణమూల్ ముఖచిత్రంగా మారిన పార్టీ గూండాల పట్ల ప్రజల్లో ఉన్న అసహనం ఈ ఎన్నికల్లో బయటపడింది.
ముఖ్యంగా పాఠశాల నియామకాల కుంభకోణం ఈ వ్యవస్థీకృత అవినీతికి ఒక చిహ్నంగా మారింది. అధికారంలో ఉన్నవారే ఉపాధి అవకాశాలను తస్కరిస్తున్నారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. స్థానిక స్థాయిలో ‘తోలాబాజీ’ (వసూళ్లు), ‘కట్ మనీ’ ఆరోపణలు తృణమూల్ కేడర్ సామాన్యుల దైనందిన జీవితంలో అడ్డంకిగా మారిందనే అభిప్రాయాన్ని బలపరిచాయి. పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. మధ్యతరగతి ప్రజలు వనరుల క్షీణతను గమనించారు. యువతకు భవిష్యత్తుపై నమ్మకం పోయింది.
సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘లక్ష్మీర్ భండార’, మమతకు మహిళల్లో బలమైన మద్దతును అందించాయి. ఎన్నికలకు ముందు, ఆమె ‘యువ సాథి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు (ఉద్యోగం కోసం వెతుకుతున్న 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల 10వ తరగతి ఉత్తీర్ణుల కోసం నెలవారీ భృతి). అలాగే లక్ష్మీర్ భండార్ నిధులను కూడా పెంచారు. బెంగాల్ ఓటర్లలో 10 శాతం కంటే ఎక్కువ మంది.. సుమారు 81 లక్షల మందికి పైగా యువ సాథి పథకం కోసం క్యూ కట్టారు. కానీ ఈ ఆర్థిక భృతి, భత్యాలు నిరుద్యోగ సమస్యకు సమాధానం కాలేకపోయాయి. ఉపాధి వేటలో ఇప్పటికీ బెంగాలీ యువత కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్తూనే ఉన్నారు. వారి దృష్టిలో, కేవలం స్టైఫండ్ ఇవ్వడం అనేది ఉద్యోగ అవకాశాలకు, పెట్టుబడులకు లేదా పరిపాలనా దక్షతకు ప్రత్యామ్నాయం కాదు. కేంద్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను బెంగాల్‌లో తీసుకువచ్చినప్ప్పుడు, దాన్ని వ్యతిరేకించడం ద్వారా మమత తన టైమ్ వేస్ట్ చేసుకున్నారు. అలా కాకుండా దాన్ని స్వాగతిస్తునే జాబితా నుంచి తమ ఓటర్లు తొలగించబడకుండా ఆధారాలు చూపించడానికి ప్రయత్నించివుంటే సరిపోయివుండేది. సర్ అమలైన దగ్గర్నుంచి మమత టైమ్ వీధిపోరాటాలకు, కోర్టులో వాదనలకు సరిపోయింది. ఈలోగా సర్ తన పని తాను చేసుకుపోయింది. అలాగే సామాజిక సమీకరణాలు కూడా ఈసారి దెబ్బతిన్నాయి. ముస్లిం ఓట్లు చీలిపోగా, మెజారిటీ హిందూ ఓట్లలో ఎక్కువ భాగం బీజేపీ వైపు కేంద్రీకృతమయ్యాయి. ఎనిమిది జిల్లాల్లో బీజేపీ తృణమూల్‌ను పూర్తిగా తుడిచిపెట్టేసింది. కూచ్ బెహార్‌లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఎన్నికల రెండు దశల్లోనూ బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది.
తృణమూల్ కాంగ్రెస్ ముందున్న తక్షణ, అతిపెద్ద సవాలు.. పార్టీ వ్యవస్థలో వచ్చే స్తబ్దత, గందరగోళం. గతంలో వామపక్షాలు అధికారాన్ని కోల్పోయినప్పుడు, ఆ పార్టీ కేడర్‌లోని చాలామంది తృణమూల్‌లోకి వలస వచ్చారు. ఇప్పుడు అదే స్థానిక నాయకులను, కార్యకర్తలను బీజేపీ వైపు నెట్టే అవకాశం ఉంది. 40.8 ఓట్ల శాతం ఉన్న పార్టీ ఎన్నికల పరంగా మళ్లీ పుంజుకోగలదు. కానీ, అధికారం అండతో మాత్రమే నడిచే స్థానిక వ్యవస్థ కలిగిన పార్టీ, ఆ అధికారం పోగానే చాలా త్వరగా బలహీనపడిపోతుంది. కాబట్టి, మమతా బెనర్జీ ముందున్న మొదటి పని పార్టీని వ్యవస్థాగతంగా చక్కదిద్దడం. తృణమూల్‌లో కొనసాగితే భవిష్యత్తు ఉంటుందని ఆమె కార్యకర్తలకు నమ్మకం కలిగించాలి. కానీ ఇది అంత సులభం కాదు. బెంగాల్ గతంలోనూ ఇలాంటి పరిస్థితులను చూసింది. 2011 తర్వాత వామపక్షాల పతనం కేవలం సిద్ధాంతాల వల్లనో, ఎన్నికల వల్లనో జరగలేదు. పార్టీ చేతిలో అధికారం పోగానే కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లడం వల్ల. అప్పట్లో ఆ పరిణామాల వల్ల లాభపడ్డ తృణమూల్, ఇప్పుడు తన పార్టీ విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మమతా బెనర్జీ ఇప్పటికీ జనాన్ని ఆకర్షించగలరు. బీజేపీపై విరుచుకుపడగలరు. వీధి పోరాటాలు చేయగలరు. అయితే, పార్టీని ఏకతాటిపై ఉంచే అధికార ప్రయోజనాలు బలహీనపడిన వేళ, ఆమె ఆ పార్టీ యంత్రాంగాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకోగలరా అనేదే అసలైన ప్రశ్న.
మమత మొదటగా సరిదిద్దాల్సిన అంశాలు:
తీర్పును అర్థం చేసుకున్నామని చెప్పడం. ఈ ఫలితాలు కేవలం బీజేపీ దూకుడు వల్లనో లేదంటే ఓటరు జాబితాల వివాదం వల్లనో వచ్చాయని తృణమూల్ భావించకూడదు. ఓటర్లు తమకు ఎందుకు దూరమయ్యారో లోతైన కారణాలను పార్టీ విశ్లేషించుకోవాలి.
మైనారిటీల మద్దతుపై పునరాలోచించాలి. ముస్లిం ఓటర్లు తృణమూల్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే కేవలం అస్తిత్వ రాజకీయాలు విద్య, అభివృద్ధి, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలకు ప్రత్యామ్నాయం కాలేవు. మహిళా సంక్షేమ పథకాలకు మించి ఆలోచించగలగాలి. ‘లక్ష్మీర్ భండార’ అనేక కుటుంబాలకు ఆసరాగా నిలిచి ఉండవచ్చు. కానీ మహిళలు కూడా ద్రవ్యోల్బణం, అభద్రత, కుటుంబంలో నిరుద్యోగం, స్థానిక పాలనా వైఫల్యాలు, పార్టీ కార్యకర్తల ప్రవర్తన వల్ల ప్రభావితమవుతారని గుర్తించాలి.
మమతకు, ఆమె పార్టీ యంత్రాంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలి. మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రతిష్టకు, క్షేత్రస్థాయిలో తృణమూల్ నెట్‌వర్క్ ప్రవర్తనకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఇకపై కొనసాగించలేరు. అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని మేనేజ్ చేయగలిగారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారవచ్చు.
ప్రతిపక్ష పాత్ర ఆమెకు ఎందుకు కలిసిరావచ్చు?
చరిత్రను గమనిస్తే, చాలా మంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు ఉండే సౌకర్యం కంటే, మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ స్వేచ్ఛగా, చురుగ్గా ఉంటారని అర్థమవుతుంది. ఆమె రాజకీయ ప్రస్థానమంతా పోరాటాల మీదనే నిర్మితమైంది. వామపక్షాలకు వ్యతిరేకంగా, వీధుల్లో పోరాడుతూ, సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల ద్వారా నిరంతరం ఆందోళనలు చేసే రాజకీయ శైలితో ఆమె ఎదిగారు.
మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత, బెంగాల్ రాజకీయాల్లో తనను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టిన పాత పాత్రలోకి ఆమె మళ్లీ ప్రవేశించవచ్చు. అదే ప్రతిపక్ష నాయకురాలు. ఇది ఆమె తిరిగి పుంజుకోవడానికి ఒక మార్గాన్ని ఇస్తుంది. అయితే, కేవలం ఆందోళనలకే పరిమితమైతే ఫలితం ఉండదు. నిరసనలు కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపుతాయి, బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి, కార్యకర్తలు చురుగ్గా ఉండటానికి కారణం అవుతాయి. కానీ, అహంకారం, అవినీతి, క్షేత్రస్థాయికి దూరం కావడం వల్ల దెబ్బతిన్న పార్టీ వ్యవస్థను, ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని కేవలం పోరాటాల ద్వారానే తిరిగి సంపాదించలేరు.






Comments