top of page

అంతా ఆయనే చేస్తున్నారు!

Writer: NVS PRASADNVS PRASAD
  • రోజుకు లక్షకు పైనే ఆమ్యామ్యా

  • డిపోలో చక్రం తిప్పుతున్న డీపీవో

  • మద్యం సరఫరాలో అస్మదీయులకు పెద్దపీట

  • వాటాలు అడుగుతారని సీనియర్లకు ఉద్వాసన

  • ఎచ్చెర్ల బాట్లింగ్‌ గొడౌన్‌లో అవినీతి కంపు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వ్యాపారం చేయనక్కర్లేదు.. కంపెనీలు పెట్టక్కర్లేదు.. అన్నింటికీ మించి జీతాల కోసం అస్సలు ఎదురుచూడక్కర్లేదు.. జిల్లాలో ఏ మూలో మూడోకంటికి తెలియకుండా మనం తాగుతున్నందున జిల్లాలో మద్యం సరఫరా చేసే బాట్లింగ్‌ యూనిట్‌లో ఉన్న ఒక ఉద్యోగికి రోజుకు అక్షరాలా రూ.1.13 లక్షలు అప్పనంగా వస్తుందంటే నమ్ముతారా? మామూలుగా ఏకవాక్యంలో చెబితే ఎవరూ నమ్మరు. కానీ ఇందుకు సహేతుకమైన ఉదాహరణలు చెబితే నమ్మితీరాల్సిందే. జిల్లాలో (రాజాం, పాలకొండ కలుపుకొని) 189 మద్యం షాపులను ఇటీవల ప్రైవేటు వ్యాపారులు దక్కించుకున్నారు. ఇందులో కొత్త జిల్లాలో 158, రాజాం, పాలకొండల్లో 31 షాపులు ఉన్నాయి. వీటన్నింటికీ ఎచ్చెర్లలో ఉన్న ఏపీబీసీఎల్‌ నుంచే మద్యం బాటిళ్లు సరఫరా చేయాలి. సరిగ్గా ప్రైవేటు వ్యాపారాలనగానే సొమ్ములు దండుకోవడమెలాగో తెలిసిన ఎక్సైజ్‌ సిబ్బంది నొప్పి తెలియకుండా సొమ్ములు గుంజేస్తున్నారు. జిల్లాలో అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు రాజాం వరకు షాపులకు అవసరమైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేయడానికి ఇండెంట్‌ పెడితే, ఒక్కో షాపునకు ఒక్కో ఇండెంట్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే ఒక షాపునకు అవసరమైన బాటిళ్లను బయటకు పంపేముందు దాని క్యూఆర్‌ నెంబర్‌ను స్కాన్‌ చేసి బిల్‌ చేస్తారు. ఈ స్కానింగ్‌ దగ్గర రూ.100 తీసుకుంటున్నారు. అలాగే ఒక కేస్‌ బాటిళ్లను లిఫ్ట్‌ చేయడానికి గతంలో 6.50 రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు దాన్ని 8 రూపాయలకు పెంచారు. షాపునకు కావాల్సిన సరుకును ఇండెంట్‌ పెట్టిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ మీద సంతకం చేయడానికి ఒక లోడ్‌కు రూ.100 చెల్లించాల్సి వస్తుంది. ఇది కాకుండా గేట్‌మామూళ్లంటూ రూ.100, విరిగిపోయిన బాటిళ్లు ఉన్నాయా, లేవా అని చూడటానికి రూ.100 చొప్పున ప్రతీచోట ఎచ్చెర్ల ఏపీబీసీఎల్‌ వద్ద దోచేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత తమ బ్రాండ్‌లు ప్రమోట్‌ చేసుకోవడం కోసం ఎన్ని లిక్కర్‌ బ్రాండ్‌లు ఉన్నాయో, అన్ని కంపెనీల రిప్రజంటేటివ్‌లు కమీషన్‌ కింద డిపోకు రూ.5వేలు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయానికి రూ.5వేలు చొప్పున చెల్లించారని వినికిడి.

డీఎం లేకపోవడంతో డీపీవో దోచేస్తున్నారు

ఎచ్చెర్ల ఏపీబీసీఎల్‌కు ప్రస్తుతం డిపో మేనేజర్‌ లేరు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జయసింహ చౌదరి అనే అధికారిని నియమించినా, ఆ తర్వాత ఆయన్ను వెనక్కు పంపించేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది డీఎంలు మాత్రమే ఉండాలి. కానీ రెండుచోట్ల ఆ స్థాయి అధికారి లేకపోవడంతో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లను డిపో మేనేజర్లుగా నియమించారు. కానీ ఆ తర్వాత కొత్తవారిని తేవడంతో జయసింహ చౌదరిని వెనక్కు పంపించారు. కానీ ఇప్పటికీ ఇక్కడ డిపో మేనేజర్‌ను వేయలేదు. దీంతో ఎక్సైజ్‌ సూపరింటెండెంటే డిపో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్‌ పాలసీ ప్రైవేటీకరణ జరగడం వల్ల ఈఎస్‌ ఆఫీసులోనే తిరుపతినాయుడుకు సమయం సరిపోవడంలేదు. దీంతో డిపోను పూర్తిగా డీపీవో వెంకటేశ్వరరావుకు అప్పగించేశారు. వాస్తవానికి డిపో మేనేజర్‌ లేనప్పుడు అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉండాలి. కానీ ఇక్కడ ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీంతో డీపీవోనే మొత్తం ఈ సొమ్ములన్నింటినీ వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. ఆమధ్య కొత్త మద్యం షాపులు ప్రారంభించినప్పుడు ఫస్ట్‌ ఇండెంట్‌కు రూ.500 చొప్పున తీసుకున్నారు. మద్యం వ్యాపారం చేస్తున్నాం, కోట్లలో సంపాదించేస్తామన్న భావనతో అన్ని షాపులు ఆ మేరకు సమర్పించుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న 20 శాతం మార్జిన్‌ కంటే తక్కువ వస్తుందని తేలడంతో డిపోలో ప్రతీచోట సొమ్ములు చెల్లించడానికి షాపు యజమానులు సతమతమవుతున్నారు. డీపీవో వచ్చే ఏడాది మార్చిలో రిటైరవుతారని, అంతవరకు ఇక్కడకు ఏఎం, డీఎంలను వేయకుండా జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలతో చెప్పించుకున్నారని ప్రచారం జరుగుతుంది. అందుకు ప్రతిగా తెలుగుదేశం కీలక నేతల బినామీల చేతిలో ఉన్న మద్యం షాపులకు ఫేవర్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం రూ.99కే క్వార్టర్‌ బాటిల్‌ అందిస్తుంది. దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అయితే అన్ని షాపులకు సరిపడినంత సప్లై మాత్రం లేదు. అలాగే గత ప్రభుత్వం ఎంసీ విస్కీ, 8 పీఎం వంటి బ్రాండ్లను తొక్కేసింది. దానికి జిల్లా వ్యాప్తంగా విపరీతంగా అభిమానులు ఉన్నారు. అయితే గత ఐదేళ్లుగా ఇక్కడికి ఈ బ్రాండ్‌లు సరఫరా లేకపోవడంతో కంపెనీల్లో ఉత్పత్తి కూడా తగ్గించేశారు. ఇప్పుడు సడెన్‌గా వీటిని తగినంత అందించలేకపోవడంతో వస్తున్న కొద్దిపాటి సరుకును తనకు ఫేవర్‌ చేస్తున్న పొలిటికల్‌ లీడర్ల షాపులకు డీపీవో పంపిస్తున్నారట. ఇక డిపోకు మంత్లీలు ఎంత అనేది తేలిన తర్వాత మాత్రమే పూర్తిస్థాయి సరుకు ఇస్తామని తెగేసి చెబుతున్నట్టు భోగట్టా. అయితే రోజుకు రూ.1.13 లక్షలు పైచిలుకు నొక్కేస్తున్న వైనం అక్కడున్న సీనియర్‌ ఉద్యోగులకు తెలిసిపోయిందని భావించిన డీపీవో వీరిని ఇంటికి పంపించే ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ సాకుతో సీనియర్లకు మంగళం పాడనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ 11 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు అటూఇటుగా ఇదే సంఖ్యలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులు లేరు కాబట్టి తమకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో పనుందని చాలాచోట్ల డీఎంలు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇక్కడ మాత్రం సీనియర్లను పంపించేసి, తనకు అనుకూలంగా ఉండే జూనియర్లను ఉంచుకోడానికి డీపీవో రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page