
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటం వల్ల విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా నిధులు వచ్చేస్తాయని, పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలై పోతాయని కూటమి పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతున్నాయి. కానీ వాస్తవంగా జరుగుతున్నది వేరేగా ఉంది. కేంద్రంలోని మోదీ సర్కార్ మాటలు తప్ప మూటలు విదల్చడంలేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి భారీ నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించగానే ఆహా.. ఓహో.. మేం సాధించేశాం.. అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. కానీ తీరా చూస్తే కేంద్రం ప్రకటించింది గ్రాంట్ కాదని.. అప్పేనని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తేలిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మొయిత్రా లోక్‌సభలో ఈ విషయం లేవనెత్తి కేంద్రం ప్రకటనలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు సైతం దీనిపై స్పందిస్తూ అప్పేగానీ.. దాన్ని మంజూరు చేయడమే గొప్ప అన్నట్లు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో అదొక్కటే తప్ప కీలకమైన పోలవరం, రైల్వేజోన్, ఉత్తరాంధ్ర`రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ లకు నిధులిస్తామని శుష్క వాగ్దానం చేశారే తప్ప నిధుల కేటాయింపుల్లేవు. ఇక ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచడంతో పాటు అదనపు నిధులు మంజూరు చేయించామని జనసేన చెప్పుకొంటోంది. కానీ అన్ని రాష్ట్రాలతో పాటు ఆ నిధులు, పనిదినాలు ఇచ్చారే తప్ప ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేకించి ఇవ్వలేదన్నది చేదునిజం. ఇక శుక్రవారం పార్లమెంటులో రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ దేశంలో ఎనిమిది కొత్త రైల్వేలైన్లు మంజూరు చేశా మని వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రాజెక్టు ఉందని వెల్లడిరచారు. సుమారు 173 కి.మీ. నిడివిన పాండురంగ పురం(భద్రాచలం)`మల్కన్‌గిరి మధ్య నిర్మించే ఈ కొత్త లైను ఒడిశా, ఆంధ్ర, తెలంగాణల మీదుగా సాగు తుందని ప్రకటించారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఈ లైను ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్తుందే తప్ప దీనివల్ల రాష్ట్రానికి ఒనగూడే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి విశాఖ, గోదావరి జిల్లాలోని రెండు మూడు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా తెలంగాణకు చెందిన భద్రాద్రి జిల్లా భద్రాచలాన్ని కలుపుతుంది. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందన్నది వాస్తవమే అయినా మన రాష్ట్రంలోని ప్రయాణికుల అవసరాలు, సరుకు రవాణా రద్దీ తగ్గించడానికి పెద్దగా ఉపయోగపడే అవ కాశం లేదంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కేంద్రం తాజాగా ప్రకటించిన ఎనిమిది కొత్త రైల్వే లైన్లలో మల్కన్‌గిరి`పాండురంగపురంతో పాటు మొత్తం ఐదు లైన్లు ఒడిశాకు ప్రయోజనం కలిగించేవే. గుణుపూర్` థేరుబలి లైను ఒడిశాలోని రాయగఢ జిల్లాను కవర్ చేస్తుంది. జునాగఢ్`నవరంగపూర్ లైన్ ఆ రాష్ట్రంలోని కలాహండి, నవరంగపూర్ జిల్లాలను, బాదాంపహార్`కేందురaర్ లైన్ కేందురaర్, మయూర్‌భంజ్ జిల్లాలను, బంగ్రిపోసి`గోరుమా హిసానీ మయూర్‌భంజ్ జిల్లాను.. బురామర`చాకులియా లైన్ జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లోని ఈస్ట్ సింగ్‌భూమ్, రaార్‌గ్రామ్, మయూర్‌భంజ్ జిల్లాలను కవర్ చేస్తాయి. మిగతా రెండు లైన్లు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు చెందినవని రైల్వేమంత్రి చేసిన ప్రకటన, రైల్వేశాఖ విడుదల చేసిన వివరాలను బట్టి స్పష్టమవుతోంది. కానీ మన ప్రధాన స్రవంతి పత్రికలు ఈ అంశాలను పట్టించుకోకుండా రాష్ట్రానికి పెద్దగా ఉపయోగపడని మల్కన్‌గిరి`పాండురంగపురం లైనునే మహాభాగ్యమన్న భావించి.. ఆబ్బో కొత్త లైను వచ్చేసిందని వార్తలు అచ్చేశాయి. దీని బదులు ఇప్పటికే ప్రతిపాదనల్లో, నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్లు, విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వేజోన్ గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఇక కేంద్ర బడ్జెట్‌లో నిర్మలమ్మ చేసిన మరో ప్రకటనను అసలు తెలుగు మీడియా పట్టించుకోనేలేదు. వికసిత భారత్‌లో భాగంగా బడ్జెట్‌లో పూర్వో దయ స్కీంను కొత్తగా తెచ్చారు. పూర్వోదయ అంటే అర్థం తూర్పు వికాసం లేదా తూర్పు వెలుగు. పేరుకు తగ్గట్లే దేశంలోని తూర్పు రాష్ట్రాల అభివృద్ధిపై పూర్వోదయ పథకం ద్వారా దృష్టి సారిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తూర్పు రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేర్చేయడం విస్మయం కలిగిస్తోంది. మనదేశాన్ని నైసర్గికంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలుగా వర్గీకరించారు. ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత రాష్ట్రం. ఇప్పటివరకు ప్రభుత్వాలు, ప్రజలు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా తూర్పు రాష్ట్రాలంటే బీహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలే. కానీ పూర్వోదయ పథకం ద్వారా లబ్ధిపొందే రాష్ట్రాల గురించి నిర్మలమ్మ చెబుతూ ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేర్చేశారు. ఈ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని ప్రకటించారు. దీనిపై ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్‌పట్నాయక్ ఘాటుగానే స్పందించారు. కేంద్రం తన స్వప్రయోజనాల కోసం భౌగోళిక సరిహద్దులను మార్చేస్తోందా? అని నిలదీశారు. తూర్పు రాష్ట్రాల అభివృద్ధి పేరుతో ప్రతిపాదించి పూర్వో దయ పథకం కింద దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రకు ఒక్క రూపాయి ఇచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. వీటన్నింటిని నిశితంగా పరిశీలిస్తే మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్ విషయంలో మాటల మాయాజాలం చేస్తున్నట్లు అనిపించడం లేదూ!
Comments