top of page

అంతా మేమే.. అన్నీ మాకే.. అంటే భంగపాటే!

Writer: DV RAMANADV RAMANA
  • పార్టీకే చేటు చేసేలా ఉన్న టీడీపీ అసంతృప్తుల తీరు

  • ధర్మానపై పోటీకి తాము తప్ప ప్రత్యామ్నాయం లేదన్నట్లు ప్రచారం

  • అదే నిజమైతే ఆయన చేతిలో మూడుసార్లు ఎందుకు ఓడినట్లు

  • కళా, కలమటల రాజకీయం కూడా అదే బాటలో

  • రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలన్న నీతిని విస్మరిస్తున్న సీనియర్లు

(రచ్చబండ)

డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి



స్టీఫెన్‌ ఆర్‌ కొవే తాను రచించిన ‘అత్యంత ప్రభావశీలుర ఏడు అలవాట్లు’ అనే పుస్తకంలో నాలుగు రకాల మనుషుల కోసం చెబుతాడు. అందులో మొదటి రకం ‘విన్‌ బై లూజ్‌’.. అంటే తాను గెలవడం కోసం ఎదుటివాడిని ఓడిరచడం. ఇది ఇప్పుడున్న రాజకీయ, పోటీ వాతావరణంలో ప్రమాదకారి కాదు. ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు గెలిచేది. రెండోది ‘లూజ్‌ బై విన్‌’.. దీన్నే మానసిక శాస్త్రంలో జెంటిల్‌మెన్‌ సిండ్రోమ్‌ అంటారు. ఎదుటివాడ్ని గెలిపించడం కోసం మనం ఓడిపోతుంటాం. దాదాపు తెలుగు సినిమాలన్నీ ఇటువంటి కథల చుట్టే నడుస్తుంటాయి. ఇక మూడోది ఇప్పుడు మనం స్పష్టంగా ప్రస్తావించుకోవాల్సింది ‘లూజ్‌ బై లూజ్‌’.. తాను ఓడిపోతూ, ఎదుటివాడ్ని కూడా ఓడిరచడం. మానసిక శాస్త్రం ప్రకారం ఇదో రుగ్మత. రాష్ట్రంలో అనేకమంది కరడుగట్టిన టీడీపీ నాయకులకు ఈసారి పొత్తుల్లో భాగంగానో, లేదంటే సర్వేలు అనుకూలించకో టికెట్‌ రాకపోయినా పార్టీ గెలవడమే ముఖ్యమనుకొని వారు పని చేస్తుంటే, మన జిల్లాలో మాత్రం ‘లూజ్‌ బై లూజ్‌’ రుగ్మతతో టీడీపీని ఓడిరచడానికి ఆ పార్టీ నాయకులు సిద్ధపడుతున్నారు.

తమ వెనుక లేకపోవడమే క్రమశిక్షణ తప్పడమా?

విచిత్రమేమిటంటే.. గుండ అప్పలసూర్యనారాయణ, కళా వెంకట్రావు లాంటి తలపండిన రాజకీయ అనుభవశాలురు సైతం ‘లూజ్‌ బై లూజ్‌’ బారిన పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రీకాకుళంలో గొండు శంకర్‌కు టికెట్‌ ప్రకటించిన దగ్గర్నుంచి తమకు టికెట్‌ ఇవ్వకపోయినా ఫర్వాలేదు గానీ.. గొండు శంకర్‌కు మాత్రం ఇవ్వొద్దంటూ గుండ వర్గం నడుపుతున్న క్యాంప్‌ రాజకీయాలు దీనికి ఉదాహరణ. రెండేళ్లుగా శంకర్‌ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, అందుకే ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దంటున్నామని అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి చెబుతున్నారు. శంకర్‌ కంటే తాము బలమైన నాయకులమని, తమకే టికెటివ్వాలని బలంగా కోరితే బాగుండేదోమో? అలా కాకుండా శంకర్‌కు ఇవ్వొద్దనే ఏకైక నినాదంతో శిబిరాలు నడపడం వారి రాజకీయ అనుభవానికే పెద్ద మచ్చ. ఇంతకీ శంకర్‌ క్రమశిక్షణ తప్పింది ఎక్కడ? రెండున్నరేళ్లుగా గుండ కుటుంబాన్ని కాదని వైకాపా కోసం పని చేశారా? లేకుంటే చంద్రబాబునాయుడును, టీడీపీని డ్యామేజ్‌ చేసేలా ప్రచారం చేశారా?.. లేదే! శంకర్‌ చేసిందేంటంటే.. తనకు టికెట్‌ రావాలని కోరుకోవడమే. మర్రిచెట్టు నీడలో ఉంటే మరో మొక్క ఎదగలేనట్లే.. తానూ ఎదగలేనని భావించి ఆ నీడ నుంచి బయటపడ్డారు. అదే సమయంలో పార్టీ భావజాలాన్ని అదే పార్టీ మనుషులతో బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. పార్టీ కోణంలో చూస్తే ఇక్కడ క్రమశిక్షణ ఉల్లంఘన ఎక్కడుందో అర్థం కావడంలేదు. నిజంగా శంకర్‌ టీడీపీలో ఉంటూ వైకాపా కోసం పనిచేసి ఉంటే కచ్చితంగా ఆ పార్టీ ఎప్పుడో ఆయన్ను సస్పెండ్‌ చేసుండేది. కానీ సిట్టింగ్‌ ఇన్‌ఛార్జి కంటే ఎక్కువ ఖర్చుపెట్టి పార్టీకి అనుకూలంగా రాజకీయాలు నడపడం క్రమశిక్షణ ఉల్లంఘన ఎలా అవుతుందో అప్పలసూర్యనారాయణ వర్గం చెప్పి ఉంటే బాగుండేది. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం కోసం పని చేసిన రెడ్డి సామాజికవర్గం నేత. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో ఉండే ఓ బీజేపీ నేతకు పొత్తు పేరుతో టికెటిచ్చారు. జగన్మోహన్‌రెడ్డి వేవ్‌లో కూడా నల్లమిల్లి వైకాపాలోకి వెళ్లలేదు. ఇలా రాష్ట్రంలో అనేక మంది టీడీపీ సీనియర్లు ఉన్నారు.

అదే జరిగితే.. మీ ప్రచారం ఎదురుతన్నదా!

గుండ లక్ష్మీదేవి గత ఆదివారం తన అనుచరవర్గంతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలరని జోనల్‌ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తనను అడిగారని.. ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని చెప్పామని అంటూ అంతకంటే ఎక్కువ ఎవరిచ్చారో తెలీదు కానీ టికెట్‌ వేరే వాళ్లకు వెళ్లిపోయిందంటూ’ సమావేశంలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టికెట్‌ రాలేదన్న ఆవేదన, ఆవేశంలో లక్ష్మీదేవి అన్న ఆ మాటలను అర్థం చేసుకోవచ్చు. కానీ సామాజిక మాధ్యమాలు ప్రధాన మీడియా స్రవంతి కంటే వేగంగా కథనాలు రికార్డు చేస్తున్న ఈ కాలంలో ఆమె వ్యాఖ్యలు చరిత్రపుటల్లో ఉండిపోతాయి. అదే శ్రీనివాసరెడ్డి పార్టీ తరఫున మాట్లాడటానికి బుధవారం సాయంత్రం గుండ లక్ష్మీదేవి ఇంటికి వెళ్లారు. నిజంగా చంద్రబాబు మనసు మార్చుకొని లక్ష్మీదేవికి టికెట్‌ ప్రకటిస్తే అంతకుముందు బహిరంగ సభలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె కట్టుబడాల్సి ఉంటుంది. మళ్లీ లక్ష్మీదేవి డబ్బులిచ్చి తన టికెట్‌ తెచ్చుకున్నారన్న ప్రచారం మొదలైతే గుండ కుటుంబానికి ఉన్న ఇమేజ్‌ ఏమవ్వాలి? ఎన్నికల నిబంధనల తెలియని కుటుంబం కాదది. ఒక బహిరంగ వేదిక నుంచి ఎన్నికల్లో ఐదు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం నేరమన్న విషయం మర్చిపోయినంత భావోద్వేగానికి లోనైతే రాజకీయాల్లో రాణించడం కష్టం. సంయమనం పాటించని రాజకీయ నాయకులకు చరిత్రలో గర్వభంగమే మిగిలింది.

అంత బలమే ఉంటే ఎందుకు ఓడినట్లు

తాను పోటీ చేయనంటూ ఒకటికి పదిమార్లు బహిరంగ వేదికలపై చెప్పుకున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు తన గెలుపు నల్లేరు మీద బండినడకని క్యాడర్‌కు చెబుతుండటానికి కారణం శంకర్‌ ప్రత్యర్థి అయితే గెలిచేస్తానని కాదు.. శంకర్‌ కోసం గుండ కుటుంబం పని చేయదన్న ధీమా. ఆ మాటకొస్తే ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టే అభ్యర్థులు గుండ కుటుంబంలోనే ఉన్నారంటూ ఆయన వర్గీయులు ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. అసలు ఢీకొట్టింది ఎక్కడ? ఎప్పుడు? 1999లో నరసన్నపేట ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావు గెలిచిన తర్వాత శ్రీకాకుళం వచ్చింది బట్టలతోనే కానీ, అక్కడున్న ఓటర్లతో కాదు. 2004లో ఆయన అప్పలసూర్యనారాయణపై గెలిచారంటే దానికి కారణం అప్పటికే తెలుగుదేశం క్యాడర్‌లో ఉన్న అసహనాన్ని ఆయన క్యాచ్‌ చేయగలగడమే. ధర్మాన ప్రసాదరావు ఇక్కడకు వచ్చిన తర్వాత 2019 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు ధర్మానే గెలిచినప్పుడు గుండ కుటుంబమే ధర్మానను ఎదుర్కోగలదన్న ప్రచారం దేనికి? ఒకసారి టిక్కెట్‌ ప్రకటించిన తర్వాత మార్చితే గొండు శంకర్‌ వర్గం లక్ష్మీదేవికి ఎలా పని చేస్తుందన్న ఆలోచన ఆ పార్టీ అధిష్టానంలో ఉండకుండాపోదు.

తనకు కాకపోతే.. వారిక్కూడా వద్దు!

ఇక ఇదే సిండ్రోమ్‌తో కళా వెంకట్రావు ఈ జిల్లాను వదిలి విజయనగరంలో రాజకీయాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. రాజాంలో కోండ్రు మురళీమోహన్‌, అంతకు ముందు ప్రతిభాభారతి, పాలకొండలో పడాల భూదేవి, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు వీరెవ్వరికీ సీట్లు రాకూడదని కోరుకున్న ఈ సీనియర్‌ నేత ఇప్పుడు ఎచ్చెర్లలో తన అనుపానులను వదిలేసి చీపురుపల్లిలో పోటీ చేయక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. స్టీఫెన్‌ ఆర్‌ కొవే చెప్పిన నాలుగో రకం ‘విన్‌ అండ్‌ విన్‌’ పద్ధతిలో ఉంటే ఆయనా గెలిచుండేవారు, తన మనుషులనూ గెలిపించుకుని ఉండేవారు. జిల్లాలో కాపు నియోజకవర్గాలను శాసించే పాతతరం నాయకులు గొర్లె శ్రీరాములునాయుడు, ఎం.బాబూ పరాంకుశం నాయుడుల కుటుంబ వారసత్వాలు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన కలమట మోహనరావు తనయుడు కలమట రమణకు కూడా పాతపట్నం నుంచి తనకు కాకపోతే మామిడి గోవిందరావు కాకుండా ఎవరికి టికెటిచ్చినా తనకు సంతోషమేమని ప్రకటించలేదు. తనకు టికెటివ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ డెడ్‌లైన్‌ పెట్టారు. రాజకీయాల్లో ఇవి సాధారణం. తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పుడు మొదటి వరుసలో ఉన్న నాయకులు ఆ తర్వాత కాలంలో ఏమయ్యారు? ఎక్కడున్నారో కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు. పార్టీకి విధేయులుగా ఉండటం, లేదా పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం.. ఈ రెండు మాత్రమే ఇప్పటి రాజకీయ ఒరవడి. పార్టీలో ఉంటూనే తాము వ్యతిరేకించే వ్యక్తికి టికెటివ్వకూడదని చెప్పడం స్థితప్రజ్ఞత లేని రాజకీయమే.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page