కొన్ని నెలలుగా కార్డుదారులకు ప్రభుత్వం మొండిచెయ్యి
బియ్యం తప్ప ఇతర సరుకులు అందకు ఇబ్బందులు
రాయితీ భారం పెరగడం వల్లే సరఫరా ఆపేశారని ఆరోపణలు
టెండర్ల ప్రక్రియలో జాప్యమే కారణమని అంటున్న అధికారులు
పౌరసరఫరాల్లో అక్రమాలు సరిచేస్తామంటూ నిలిపేశారని మరో వాదన

పేద కుటుంబాలకు అక్కరకు వచ్చే రేషన్ సరుకుల పంపిణీలో విఫలమవుతోందన్న విమర్శలు ఎదుర్కొంటుంది. అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 30వేల మందికి సబ్సిడీతో రూ.5కే ఆహారం అందిస్తున్నారు. కానీ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం మినహా మిగతా నిత్యావసరాల పంపిణీ నిలిపేశారు. మరోవైపు కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.180కి చేరిన వెంటనే హడావుడి చేసిన ప్రభుత్వం హోల్‌సేల్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి కిలో రూ.160కి విక్రయించేలా రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే వారం రోజుల్లోనే వీటిని మూత వేసేశారు. అలాగని కందిపప్పు ధర తగ్గిందా..? అంటే అదీ లేదు. గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కందిపప్పును కిలో రూ.67కే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించింది. బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, రాగిపిండి, గోధుమ పిండిని పంపిణీ చేసింది. రాగిపిండిపై లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో దాంతోపాటు కందిపప్పు పంపిణీని గత వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం మినహా మిగతా సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఈ నెల నుంచి కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని నిర్ణయించినా టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా అమలుకు నోచుకోలేదు. వచ్చే నెలలోనూ కార్డుదారులకు బియ్యం ఒక్కటే పంపిణీ చేయాలని పౌర సరఫరాల సంస్థ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో 1603 చౌకధరల దుకాణాల పరిధిలో 6,71,803 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి 422 ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా రేషన్ సరుకులు అందిస్తున్నారు. బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి వంటివి సరఫరా చేయాల్సి ఉన్నా గత కొన్ని నెలలుగా బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కాగా రాగులు కావాలనుకున్నవారికి వారికి ఇచ్చే బియ్యంలో మూడు కేజీలు తగ్గించి రాగులు ఇవ్వాలని నిర్ణయించినా పట్టణ ప్రాంతాల్లో అమలుకాలేదు. మాస్ ఏరియాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే దీన్ని అమలుచేశారు. కార్డుదారులకు కందిపప్పు, పంచదార ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినా అది వచ్చే నెలలోనూ అమలయ్యే అవకాశం లేదు. వీటి సేకరణకు జూలైలోనే టెండర్లు పిలిచినా వాటి ఖరారులో జాప్యం జరగడమే దీనికి కారణం. దీంతో సెప్టెంబరు కోటాలోనూ బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నారు. అధికారుల వైఖరి కారణంగానే పేదలకు పంచదార, కందిపప్పు పంపిణీ చేయలేకపోతున్నట్టు కూటమి నాయకులు వెతుకుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఇవ్వలేకపోయిన కందిపప్పు, పంచదార, ఇతర సరుకులను కూటమి ప్రభుత్వం ఇస్తుందన్న ఆశతో పేదలంతా ఎదురుచూస్తున్నారని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తూ పేదలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాయితీ భారం తగ్గించుకునేందుకే..
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు గతంలో చాలా రకాల సరుకులు అందించేవారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 12 రకాల సరుకులను అందించేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వాటిలో కోత పెట్టి మూడు సరుకులకే పరిమితం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేందుకు ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టి ఆపరేటర్ల ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు అందిస్తూ వచ్చింది. 2022 నుంచి బియ్యంతోపాటు రాగిపిండి, గోధుమ పిండి కూడా పంపిణీ చేసింది. కొన్నాళ్ల తర్వాత బియ్యం, పంచదార, గోధుమపిండి మాత్రమే పంపిణీ చేయడం ప్రారంభించింది. ఎన్నికలకు ముందు అవి కూడా ఆపేసి కేవలం బియ్యం పంపిణీకే పరిమితమైంది. 2017లో కందిపప్పు కిలో ధర రూ.60 నుంచి రూ.110కి పెరిగితే రాయితీపై రూ.90కు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లలో విక్రయించడం ద్వారా కందిపప్పు ధరకు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసేశారు. దీంతో కందిపప్పు ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గినా ధర మాత్రం ప్రభుత్వం ఫిక్స్ చేసిన రూ.90 నుంచి కిందికి దిగలేదు. 2019 నాటికి ధర రూ.110కి చేరింది. దీంతో ప్రభుత్వం రాయితీపై కార్డుదారులకు కిలో రూ.67కు పంపిణీ చేసింది. ఆ తర్వాత కూడా బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరగడంతో ఆ మేరకు రాయితీ భారం పెరగడం వల్ల ప్రభుత్వం కందిపప్పు పంపిణీని నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.140గా ఉండేది. క్రమంగా ఏ`గ్రేడ్ పప్పు ధర రూ.160కి, ఆ తర్వాత రూ.180 దాటింది. అదేవిధంగా పంచదార కిలో రూ.50కి చేరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కిలో కందిపప్పు రూ.67కి, పంచదార అరకిలో రూ.17కే అందిస్తుందని తెల్లకార్డుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పంచదారపై గతంలో కేంద్రం సబ్సిడీ ఇచ్చేది. కానీ ఐదేళ్ల క్రితమే దాన్ని పూర్తిగా నిలిపేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం రాయితీ భరించాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మార్కెట్‌లో పంచదార నాణ్యతను బట్టి కిలో రూ. 40`45 మధ్య లభించగా, ప్రస్తుతం రూ.50`56కు చేరింది. దీంతో గతంలో మాదిరిగా రాయితీపై కందిపప్పు రూ.67కు, పంచదార అరకిలో రూ.17కు ఇచ్చే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీ తగ్గించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అక్టోబర్ వరకు పంపిణీకి అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.
సరఫరా నిలిచిపోవడంపై భిన్న వాదనలు
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సరిపోయేలా మొత్తం 22,500 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 17,538 మెట్రిక్ టన్నుల పంచదార సేకరణకు పౌరసరఫరాల సంస్థ జూలైలో ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులు, ఐసీడీఎస్ లబ్ధిదారులకు ప్యాకెట్ల రూపంలో కందిపప్పు సేకరణకు రూ.394 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే టెండరు విలువ రూ.100 కోట్లు దాటితే చట్టప్రకారం న్యాయ సమీక్ష(జుడీషియల్ రివ్యూ)కు పంపాల్సి ఉంటుంది. ఆ మేరకు పౌరసరఫరాల శాఖ ఈ టెండరు వివరాలను జ్యుడీషియల్ రివ్యూకు పంపించింది. దీనిపై న్యాయమూర్తి పలు వివరణలు కోరగా, వాటికి కార్పొరేషన్ అధికారులు సమాధానాలు పంపించేసరికే నెల రోజులు గడిచిపోయాయి. దాంతో కందిపప్పు సేకరణ జరగక ఆగస్టులో కార్డుదారులకు సరఫరా నిలిచిపోయింది. అయితే తర్వాత జుడీషియల్ అనుమతులు లభించినా టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు పంచదార టెండర్లను జోన్ల వారీగా ఆహ్వానించడంతో జ్యుడీషియల్ రివ్యూకు పంపాల్సిన అవసరం రాలేదు. అయితే చక్కెర సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్ చేశారనే కారణంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. రెండోసారి టెండర్లు ఆహ్వానించినా ఆ ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు. దీంతో వచ్చేనెలలో కందిపప్పు, పంచదార పంపిణీ చేయడం లేదని తేలిపోయింది. అయితే డిసెంబర్‌లో ఇస్తామంటున్న క్రిస్మస్ కానుక, జనవరిలో సంక్రాంతి కానుకకు మాత్రం ఇప్పటి నుంచే నిధులు సమకూర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వాదన కూడా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో నాదెండ్ల మనోహర్ రేషన్ షాపుల్లో, ఎండీయూ వాహనాల తనిఖీల పేరుతో హడావుడి చేశారు. తూకాల్లో తేడాలతో మోసాలు జరుగుతున్నాయంటూ అప్పట్లో వీటి సరఫరాను నిలిపివేశారని, వ్యవస్థను ప్రక్షాళన చేసిన తర్వాత కందిపప్పు, పంచదార సరఫరాను కార్డుదారులకు పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా రేషన్ సరఫరాను కూడా పునరుద్ధరించలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Comentarios