top of page

అందరికీ పదిన్నరట.. డీపీఎంవో రావడమే భాగ్యమట!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Feb 22
  • 3 min read
  • కలెక్షన్ల కోసం విధులు మొత్తం బయటే

  • అన్ని విభాగాలూ ఆయన చేతిలోనే!

  • పీహెచ్‌సీకి వెళ్తే రూ.10వేలు

  • కారు కోసం నకిలీ బిల్లులు

  • స్కానింగ్‌, ల్యాబ్‌, ఆసుపత్రిలకు సింగిల్‌ విండో

  • డీఎంహెచ్‌వో అండతో డీపీఎంవో దందా

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

దేవతల్లో ఇంద్రుడిని నేనే.. జంతువుల్లో సింహాన్ని నేనే.. పక్షుల్లో గరుత్ముంతుడ్ని నేనే అంటాడు గీతలో కృష్ణభగవానుడు. దానికి మరికొద్దిగా పొడిగిస్తే హీరోల్లో చిరంజీవిని నేనే.. తారల్లో శ్రీదేవిని నేనే.. కూరల్లో వంకాయిని నేనే.. పాటల్లో వేటూరిని నేనే.. మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్‌లో స్టూపర్‌స్టార్‌ని, షేర్స్‌లో హర్షద్‌మెహతాని నేనే అంటాడు ముళ్లపూడి వెంకటరమణ. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాసిన ఈ డైలాగు ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో మన డీపీఎంవోకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కార్యాలయంలో సూపరింటెండెంటూ ఆయనే.. అర్బన్‌ పీహెచ్‌సీలకు డీపీఎంవో ఆయనే.. రూరల్‌ పీహెచ్‌సీలకు తనిఖీ అధికారీ ఆయనే.. పెట్రోల్‌ బంక్‌లూ ఆయనవే.. స్కానింగ్‌ సెంటర్లూ ఆయనవే. ఆయనే సర్వాతంర్యామి. ఆయన చెప్పితేనే వైద్యఆరోగ్యశాఖలో పని పూర్తయ్యేది.

అందరికీ ఉదయం డ్యూటీ.. అయ్యగారి రాకకు మాత్రం వేళాపాలా లేదు. స్వయంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి అయినా ఉదయం 10.30 గంటల లోపు ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో ఒకసారి ముఖం చూపించాలి. కానీ ఇక్కడ ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవోగా పని చేస్తున్న డాక్టర్‌ బి.రవీంద్ర మాత్రం తన ముఖారవిందాన్ని ఎఫ్‌ఆర్‌ఎస్‌లో చూపించడానికి వేళాపాలా లేదు. అడిగే నాధుడు కూడా ఉండడు. ఎందుకంటే.. సాక్ష్యాత్తు డీఎంహెచ్‌వో ఈయన్ను జిల్లా మొత్తం కలెక్షన్‌ ఏజెంట్‌ కింద తిప్పుతుండటం వల్ల ప్రధాన కార్యాలయానికి 10.30 గంటల లోపు రావాలన్న నిబంధన పాటించకపోయినా అడగడంలేదు. నీకిది, నాకది పద్ధతిలో పంచుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో స్వయంగా ఆయనొక మెడికల్‌ ఆఫీసరన్న విషయం మర్చిపోయి ఆమధ్య తన లాంటి మరో మెడికల్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేస్తానని బెదిరించారట. ప్రస్తుతం జిల్లాలో ఇదే హాట్‌టాపిక్‌. ఈయన ఉద్యోగమే ఈమధ్య రెగ్యులరైజ్‌ అయితే, ఈయన మరో మెడికల్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేస్తాననడంపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒక డాక్టర్‌నే సస్పెండ్‌ చేస్తానన్న డీపీఎంవో ఇక కిందిస్థాయి ఉద్యోగులతో ఎలా ఉంటారో వేరేగా చెప్పనక్కర్లేదు. పీహెచ్‌సీల్లో అందర్నీ భయపెట్టి జిల్లా కేంద్రంలో తన ఛాంబర్‌కు రప్పించుకుంటున్న డాక్టర్‌ బి.రవీంద్ర కోసం జిల్లా నలుమూలల్లో ఉన్న పీహెచ్‌సీల నుంచి వస్తున్న సిబ్బంది ఈయన కోసం రోజంతా డీఎంహెచ్‌వో కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. ఆమధ్య కొలిగాం పీహెచ్‌సీ (ఇచ్ఛాపురం బోర్డర్‌)ని సందర్శించి అక్కడ నలుగురు ఏఎన్‌ఎంలను నాలుగు దులిపేసి జిల్లా కేంద్రంలో తన ఛాంబర్‌కు వచ్చి కలవాలని డాక్టర్‌ రవీంద్ర ఆదేశించారట. అయ్యగారు పిలిచిన వెంటనే రాకపోతే డీఎంహెచ్‌వో గారికి కోపమొస్తుంది కాబట్టి కొలిగాం నుంచి నలుగురు ఏఎన్‌ఎంలు వచ్చి రోజంతా డీపీఎంవో గది వద్ద వేచిచూసినా ఆయన మాత్రం కార్యాలయానికి రాలేదని, ఆయన ఎప్పుడొస్తే అప్పుడే దండం పెట్టుకుని వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించడంతో చేసేదిలేక ఏఎన్‌ఎంలు చేష్టలుడిగి కూర్చుండిపోయారట. నెల మొత్తంమీద డాక్టర్‌ బి.రవీంద్ర హాజరు పరిశీలిస్తే మూడు నుంచి నాలుగు సార్లకు మించి ఉదయంపూట ఆయన పంచింగ్‌ ఉండదని తెలుస్తుంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ అనే ఒక విభాగం పని చేస్తుంది. ఇందులో ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం చూసే డీపీఎంవో మాతా శిశు మరణాలు, ఆసుపత్రి ప్రసవాలు పర్యవేక్షించే డీపీహెచ్‌ఎన్‌వో, గణాంకాలు చూసే డీఎస్‌వో, ఆర్‌సీహెచ్‌ ప్రాజెక్టు చూసే డీపీవోలు ఉంటారు. అయితే, వీరందరూ కలిసి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసేందుకు పీహెచ్‌సీలకు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు వెళ్లాలి. కానీ వీరందరి తరఫున డీపీఎంవో డాక్టర్‌ రవీంద్రే అన్ని పీహెచ్‌సీలకు వెళ్లి, అన్ని ప్రాజెక్టుల లెక్కలు ఈయనే తీసుకొని, అన్నింటిలోనూ వాటాలు కొట్టేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ డీటీఎఫ్‌ కింద ఏ పీహెచ్‌సీకి వెళ్తే, ఆ పీహెచ్‌సీ నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఏ పీహెచ్‌సీకి వెళ్తున్నదీ ముందే చెప్పి తాను తినడానికి ఏ మెనూ ఉండాలో కూడా డాక్టర్‌గారు చెప్పేస్తున్నారట. జిల్లాలో ఒక పీహెచ్‌సీకి రూ.10వేలు అంటే పండగే పండగ. ఇలా పీహెచ్‌సీలకు వెళ్లడానికి వీరందరికీ కలిపి ఓ కారుంది. దీనికి నెలలో 2,500 కిలోమీటర్లు తిరిగితే రూ.35వేలు బాడుగ ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఎక్కడా 2,500 కిలోమీటర్లు తిరిగిన దాఖలాలు ఉండవు. అయితే రూ.35వేలు కావాలి కాబట్టి దొంగబిల్లులు పెట్టి, తప్పుడు రిపోర్టులు రాసి పీహెచ్‌సీలకు వెళ్లకుండానే వెళ్లినట్టు చూపించి అటు రూ.10వేలు, ఇటు రూ.35వేలు నొక్కేస్తున్నారట. ఈ విధంగా జిల్లాలో ఆరుగురు వైద్యాధికారులకు అద్దెవాహనాలు ఉన్నాయి. అన్నిచోట్లా ఇదే తంతు నడుస్తుంది. 20 రోజుల క్రితం పైడిభీమవరం ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి లిక్విడ్‌ స్టోరేజ్‌ కోసం ఓ ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది. ఇందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారే పర్మిషన్‌ ఇవ్వాలి. మల్టీ నేషనల్‌ కంపెనీ కావడంతో ఒక ట్యాంక్‌ ఏర్పాటు చేసుకోడానికి అక్షరాలా రూ.లక్ష కొట్టేసినట్టు, దాన్ని వీరిద్దరూ పంచేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆసుపత్రులు, స్కాన్‌ సెంటర్లు, మెడికల్‌ ల్యాబ్‌ల అనుమతులు, రెన్యువల్‌ కోసం వైద్య ఆరోగ్యశాఖలో ఒక విభాగం ఉంది. కానీ ఇందులో ఏ ఫైల్‌ ముట్టుకున్నా కనీసం రూ.25వేలు ఇవ్వాలి కాబట్టి దీన్ని కూడా పర్యవేక్షించే బాధ్యత డీపీఎంవోకే కొత్త డీఎంహెచ్‌వో అప్పగించారట. అటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల దగ్గర్నుంచి ఇటు పీహెచ్‌సీల వరకు, పరిశ్రమల్లో చమురు ట్యాంకు ఏర్పాటు నుంచి జిల్లాలో ఆసుపత్రుల రెన్యువల్‌ వరకు అన్నింటినీ ఒకరి చేతిలో పెట్టి కొత్త డీఎంహెచ్‌వో ఎంచక్కా ఇక్కడ హనీమూన్‌ పీరియడ్‌ను అనుభవిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page