top of page

అందుకే ఆయన చంద్రబాబు!

Writer: ADMINADMIN
  • స్కిల్‌ కేసులో ఈడీ నోట్‌ను క్యాష్‌ చేసుకోలేదు

  • బీజేపీ వాషింగ్‌ మిషిన్‌ నుంచి శుద్ధంగా వస్తాననే నమ్మకం

  • అయినా బాబు పాత్ర నిరూపించడం అంత ఈజీ కాదు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఓ సింపుల్‌ స్టేట్‌మెంట్‌ పార్టీ మీటింగ్‌లో ఇచ్చి చంద్రబాబు తప్పుకున్నారు. ఆ తర్వాత సనాతనవాదం, మనుధర్మం అంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దాన్ని తన నెత్తినేసుకున్నారు. అయోధ్యకు వెళ్లిన తిరుపతి లడ్డూల్లో కూడా ఇదే కొవ్వు కలిసిందన్న స్టేట్‌మెంట్‌ ఇచ్చి, ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ కోర్టు నోటీసులు అందుకున్నారు. మరోవైపు అభ్యుదయవాదం నుంచి సనాతనవాదానికి మారిన పవన్‌కల్యాణ్‌ సమాజంలో ఈ కేసు ద్వారా ఓ వర్గానికి మాత్రమే పరిమితమైపోయారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు విజయవాడ వరదల్లో రాత్రీపగలు తేడా లేకుండా వయసు, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు మీద పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్‌ ఇచ్చిందని అనేక మీడియాలు, టీడీపీ నాయకులు ప్రకటించారు. కానీ ఎక్కడా చంద్రబాబు మాత్రం ఈ అంశాన్ని క్యాష్‌ చేసుకోలేదు. ఎందుకంటే.. రాజకీయాలకు మారుపేరు చంద్రబాబు. శాశ్వత పొత్తులు, శాశ్వత ప్రభుత్వాలు ఉండవని ఆయనకు తెలుసు. అందుకే ఈడీ ఈ కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించకపోయినా, ఆయన మాత్రం తనకు క్లీన్‌చిట్‌ వచ్చిందని ఎక్కడా చెప్పుకోలేదు.

సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ కుంభకోణంలో చంద్రబాబు అనుకూల మీడియలో క్లీన్‌చిట్‌ గురించి జబర్దస్త్‌ ప్రచారం జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం నాయకత్వం మాత్రం చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. ఎలాంటి హడావిడి చేయకుండా, ఈ విషయంపై మిన్నకుండిపోయింది. పబ్లిసిటీని ఎలా వాడుకోవాలో తెలిసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు విజయవాడను ముంచెత్తిన వరదల్లో మీడియాలో నిరంతరం కనిపించడానికి చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు ఈడీ క్లీన్‌చిట్‌ వ్యవహారంలో మాత్రం గుంభనంగా ఉండడం విశేషం. ఈ విషయంలో ఎలాంటి లేనిపోని హడావిడి, హంగామా చేసినా ‘తిరుపతి లడ్డు’ కథలాగా మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు భావించారు. పైగా ఈ కేసు ఏరోజు ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఈడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలా తిప్పుతుందో కూడా తెలియని పరిస్థితిలో మౌనం పాటించడమే మేలనుకున్నారు.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటిలను ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి ఈ సంస్థలను ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఆదర్శ సహకార గృహ సొసైటీ కుంభకోణంలో నిందితుడు. ఆయన బిజెపిలో చేరగానే ఆ కేసు మూలపడిపోయింది. ఎన్సీపీకి చెందిన మహారాష్ట్ర డెప్యుటీ సిఎం అజిత్‌ పవార్‌ కోట్ల రూపాయల సహకార బ్యాంకు కుంభకోణంలో నిందితుడు. ఆయన బిజెపిలో చేరగానే ఆ కేసు అతీగతీ లేకుండా పోయింది. మన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సిఎం రమేష్‌, సుజనా చౌదరిలపై ఒక్క ఈడీ మాత్రమే కాక, సిబిఐ, ఐటి సంస్థలు కూడా వెంటపడ్డాయి. వీరి మీద బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీలో ఫిర్యాదు చేసారు. వీరిని ఆంధ్రా మాల్యాలుగా పిలిచారు. కాని, వీరిద్దరూ బిజెపీలో చేరగానే వారి కేసుల విచారణ ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు చక్రం తిప్పడం గాని, చాణక్య వ్యూహాలు పన్నడం గాని చేయలేరు.

ఈడీ ప్రెస్‌నోట్‌లో ఏముంది?

అక్టోబర్‌ 15న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌, డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులకు చెందిన 23.54 కోట్ల రూపాయల ఆస్తులను హైదరాబాద్‌లో అటాచ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎస్‌ఎస్‌డిసి) కుంభకోణం కేసులో భాగంగా ఇది జరిగింది. ఇదే కేసులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2023లో 53 రోజుల పాటు జైలులో ఉండవలసి వచ్చింది. (2019 ఎన్నికలలో ఓడిపోయాక ఆయన అప్పటికి ప్రతిపక్షనేతగా ఉన్నారు). 371 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని విచారణ జరుగుతున్న కేసులో ఈడీ, ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని గాని, లేదని గానీ ఏమీ చెప్పలేదు. అసలు చంద్రబాబును ఉద్దేశించి ఏమీ అనలేదు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం దీనిని పాజిటివ్‌గా వార్తలు సృష్టించడానికి ప్రయత్నించాయి. విచారణ సంస్థ చంద్రబాబును నిర్దోషిగా తేల్చినట్టు ప్రకటించేసాయి. జరుగుతున్న విచారణలో భాగంగా ఈడీ ఆస్తులు జప్తు చేసింది గాని, చంద్రబాబు గురించి వ్యాఖ్యానించలేదు. ఈ కేసు విచారణ ముగిసినట్టేనని ఎక్కడా ప్రస్తావించలేదు. కేసులో ఈ కీలక పరిణామం ఒక్క చంద్రబాబు నాయుడికే అర్థమైంది. భారతీయ జనతా పార్టీతో విభేదాలు ఏర్పడితే స్కిల్‌స్కామ్‌ కేసు ఏ మలుపు తిరగబోతుందో ఆయన అర్థం చేసుకున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page