(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేదని తాము భావిస్తున్నామని, డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని, ఆయన్ను వెంటనే తప్పించాలని జిల్లా కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని ఇరుకున పెట్టే విధంగా ఆయన వ్యవహారం ఉందని, గత ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారంటూ మీడియా ముఖంగా చెప్పిన అంబటి తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. తామెవరం ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్లు అమ్ముకునే అవసరం కూడా లేదని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బి`ఫారంపై సంతకం చేసి స్వయంగా ఆమె చేతుల మీదుగానే టిక్కెట్లు ఇచ్చిన షర్మిలపై పరోక్షంగా ఆయన విమర్శలకు దిగడం తగదన్నారు. ఇందిర విజ్ఞాన్‌భవన్‌లో షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగితే రెండు రోజుల తర్వాత ఫిర్యాదుచేసి కాంగ్రెస్ నాయకులు తగులబెట్టారని పోలీసులకు చెప్పడం, ఆ తర్వాత మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మానసికంగా ఆయన ఆరోగ్యంగా లేరని అర్థమవుతుందన్నారు. గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళంలో పైడి నాగభూషణంకు టిక్కెటిచ్చి చివరి నిమిషంలో తనకు టిక్కెట్ తెచ్చుకోవడం కోసం చేతులు తడపకతప్పలేదని స్వయంగా అంబటి కృష్ణే ప్రచారం చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏఐసీసీ సభ్యులు రాకేష్‌రెడ్డి పర్యటనలో స్వయంగా పాల్గొన్న అంబటి తనకు తెలియకుండానే రాకేష్ రెడ్డి జిల్లాలో పర్యటించడం ఏమిటని ప్రకటించడం ఆయన మానసిక స్థితికి అద్దంపడుతుం దన్నారు. ప్రకటన విడుదల చేసినవారిలో పేడాడ పరమేశ్వరరావు, సనపల అన్నాజీరావు, ఎం. చక్రవర్తిరెడ్డి, కె.వెంకటరావు, మంత్రి నర్సింహమూర్తి, కరిమజ్జి మల్లేశ్వరరావులు ఉన్నారు.

Comments