ఆకర్షణా.. అంకితభావమా.. బీజేపీ డైలమా!
- DV RAMANA

- Oct 14
- 2 min read

భారతీయ జనతాపార్టీ చరిత్రలోనే తొలిసారి 2024 ఎన్నికల్లో కేరళలో ఒక ఎంపీ సీటును గెలుచుకోగలిగింది. త్రిసూర్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ సినీనటుడు సురేష్ గోపి విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో కమలం ఖాతా తెరిచారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు నరేంద్ర మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రి బెర్త్ కూడా దక్కింది. కానీ ఇప్పుడు అదే సురేష్‌గోపి బీజేపీని ధర్మసంకటంలోకి నెట్టేశారు. ఆయన వైఖరి కారణంగా సినీ ఆకర్షణా లేక అంకితభావమా.. ఈ రెండిరటిలో దేన్ని ఎంచుకోవాల్సి అగత్యాన్ని ఆ పార్టీ నాయకత్వానికి సురేష్‌గోపి కల్పించారు. మూడు ఎన్నికల్లో వరుస విజయాలతో 11 ఏళ్లుగా ఏలుతున్న కమలనాథులు ఉత్తర, తూర్పు, పశ్చిమ భారతాల్లో గణనీయ విజయాలు సాధిస్తున్నా.. ఇప్పటికీ వారికి దక్షిణ భారతం మాత్రం కొరుకుడు పడటంలేదు. ఈ రీజియన్‌లో ఒక్క కర్ణాటక మినహా ఇంకే రాష్ట్రంలోనూ ఇంతవరకు అధికారం దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఇక తమిళనాడు, కేరళల్లో అయితే ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణం. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో నటుడు సురేష్‌గోపిని త్రిసూర్ బరిలో దించగా, ఆయన అనూహ్య మెజారిటీతో గెలిచి కేరళలో బీజేపీకి తొలి ఎంపీ సీటు అందించారు. ‘త్రిసూర్‌కు ఒక కేంద్ర మంత్రి.. ఇది మోదీ హామీ’ అనే నినాదం ఆయన్ను విజయతీరాలకు చేర్చిందంటారు. అయితే దాంతో సమానంగా సినీ అభిమానం కూడా అక్కడ బీజేపీ గెలుపునకు దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఈ విజయం కేరళలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు గట్టి పునాదిలాంటిదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతవరకు కేరళలో ఉన్న ద్విముఖ పోటీ అనే రాజకీయ సంప్రదాయం కాస్త త్రిముఖ పోరుగా మారుతుందని కూడా భావించారు. కానీ సురేష్‌గోపి తీరు కేరళ బీజేపీ ఆశలకు గండి కొడుతోంది. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పదవి పట్ల ఆయన విముఖత వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవిపై పెద్దగా ఇష్టం లేదని, తన సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టడానికి వీలుగా త్వరలోనే ఈ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఆయన వెంటనే తన రాజీనామా వార్తలను ఖండిరచవలసి వచ్చింది. అయినా ఆయనలో ఇప్పటికీ అదే అసంతృప్తి కొనసాగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలనే తన కోరికను ఇదే నెలలో మరోసారి బహిరంగంగా వ్యక్తపరిచి మళ్లీ చర్చలకు తావిచ్చారు. అక్కడితో ఆగకుండా తన స్థానంలో ఒక వారసుడిని కూడా సూచించారు. తాను రాజీనామా చేయాలనుకోవడానికి ఆయన రెండు ప్రధాన కారణాలను పేర్కొన్నారు. వాటిలో మొదటిది.. నటన పట్ల ఆయనకున్న అభిరుచి. ‘సినిమా లేకపోతే నేను చనిపోతాను’ అని ఆయన స్పష్టం చేశారు. ఇక రెండోది.. ఆర్థికపరమైన కారణం. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన పదేపదే చెప్పుకొస్తున్నారు. కేంద్ర సహాయమంత్రిగా నెలకు సుమారు రూ.లక్ష జీతం మాత్రమే అందుతుంది. కానీ దక్షిణ భారత సినీరంగంలో అగ్రనటుడిగా కొనసాగుతున్న సురేష్ గోపి నట జీవితం కొనసాగిస్తే ఒక్కో సినిమాకు రూ.కోట్లలో సంపాదించే అవకాశం ఉంది. ఈ భారీ ఆర్థిక వ్యత్యాసంతోపాటు నటన పట్ల తనకున్న తపన సురేష్‌గోపిలో మంత్రి పదవిపై విముఖత పెంచాయి. ఈ ఉదంతం సెలబ్రిటీ నాయకుల ద్వైదీభావనను ప్రతిబింబిస్తుంది. వృత్తిపరమైన నిబద్ధతల మధ్య సంఘర్షణ, భారీ ఆర్థిక త్యాగం వంటివి వారు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు. అయితే తన రాజకీయ సేవను ఆర్థికాంశాలతో ముడిపెట్టి కొలమానంలా చూడటం ద్వారా సురేష్‌గోపి రాజకీయాల్లో నిస్వార్థ సేవ అనే భావనకు విఘాతం కలిగిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ సినిమా కెరీర్ ఆయనకు రాజకీయ వేదికను ఇచ్చిందో.. అదే కెరీర్ ఇప్పుడు ఆయన రాజకీయ నిబద్ధతను ప్రశ్నించేలా చేస్తోంది. ఈ విషయంలో పక్కన పెడితే.. సురేష్‌గోపి తన స్థానంలో సి.సదానందన్ మాస్టర్‌ను ప్రతిపాదించడం మరో చర్చకు తెరలేపింది. సదానందన్ మాస్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌తో గాఢమైన సంబంధాలు కలిగిన, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడు. 1994లో సీపీఎం కార్యకర్తల దాడిలో రెండు కాళ్లు కోల్పోయిన ఆయన పార్టీ కార్యకర్తల త్యాగాలకు ఒక ప్రతీక. సురేష్ గోపి ప్రజాకర్షణతో గెలిస్తే.. సదానందన్ మాస్టర్ క్యాడర్‌ను ఉత్తేజపరిచే సైద్ధాంతిక నాయకుడు. సురేష్‌గోపి నిర్ణయం, ఆయన ప్రతిపాదన బీజేపీ నాయకత్వానికి ఒక కీలక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన ఇరకాట పరిస్థితిలోకి నెట్టింది. కేరళలో పార్టీ ఎదుగుదలకు సెలబ్రిటీల ఆకర్షణ అవసరమా లేక అంకితభావంతో పనిచేసే క్యాడర్ ముఖ్యమా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టింది. ఈ వ్యవహారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ బీజేపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందనంలో సందేహం లేదు. సురేష్ గోపి ద్వైదీభావం కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. బీజేపీని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రాన్ని అందిస్తుంది. ఆయన రాజీనామా చేస్తే పార్టీ తన ఏకైక లోక్‌సభ ప్రతినిధిని కోల్పోతుంది. ఆయన స్థానంలో సదానందన్ మాస్టర్‌ను నియమిస్తే పార్టీ తన సైద్ధాంతిక పునాదిని బలోపేతం చేసుకుంటుంది. సురేష్ గోపి రాజీనామా ప్రతిపాదన కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. త్రిసూర్‌లో ఆయన విజయం ఒక చారిత్రక అవకాశం. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన సంశయాత్మక ధోరణి ఆ అవకాశాన్ని ప్రమాదంలో పడేసింది. ఈ సంధిగ్ధతను బీజేపీ ఎలా పరిష్కరిస్తుందనే దానిపైనే కేరళలో కాషాయ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
..










Comments