top of page

ఆకలి భారతం..!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 22, 2024
  • 2 min read



‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది?.. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం’ అంటూ అంతిమంగా ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’ అని ప్రశ్నించాడు శ్రీశ్రీ. ఈ ప్రశ్న దశాబ్దాలు గడిచినా మనల్ని వెంటాడుతూనే ఉన్నది. సమాజం వెలుగులవైపే ప్రయాణిస్తోందా? అని సదా హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తూనే ఉన్నది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక నేపథ్యంలో మరోసారి మనలను తట్టిలేపుతున్నది. గురువారం వెల్లడిరచిన ‘యూఎన్‌డీపీ’ సూచీ ప్రపంచంలో 110 కోట్ల మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో ఉన్నారని పేర్కొన్నది. ఇందులో అత్యధికులు మన దేశంలోనే ఉన్నారని కుండబద్ధలు కొట్టింది. ప్రస్తుతం ప్రజలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా వారే తేల్చి చెపుతూ ఈ దేశ రాజకీయాలను ఎడతెరిపిలేకుండా ‘అలరిస్తున్న’ సనాతన ధర్మోపాసకుల ప్రవచనా లను కాసేపు పక్కన పెట్టి.. ఈ ఐక్యరాజ్యసమితి తాజా సూచీ వెలుగులో ప్రపంచాన్ని ఒక్కసారి తేరిపార చూస్తే.. అసలు తిండే దొరకని అన్నార్తుల ఆక్రందనలు మనలను కలవరపెడుతాయి. భయంకరమైన సంక్షోభాల ఊబిలో కూరుకుపోతున్న మానవాళి మనల్ని ఆందోళనకు గురిచేస్తుంది. మనుషులు అన్నపానీయాల కోసం అలమటించిన కాలమొకటి గతంలో ఉండేదంటే సరిపెట్టుకోవచ్చు. కానీ నేటి ఆధునిక యుగంలో సైతం ఇది కొనసాగుతుండటం సహించలేనిది. ఎందుకంటే.. ప్రపంచంలో ఇప్పటికే ఏటా కొన్ని వేల ట్రిలియన్‌ డాలర్ల సంపద ఉత్పత్తి అయి చలామణిలో ఉంటోంది. అది ప్రపంచ జనాభా మొత్తం కాలుమీద కాలేసుకుని తిన్నా కొన్ని వందల సంవత్సరాలకు సరిపోతుంది. అసలీ ఉన్న సంపదను వాడుకోకుండానే, అది ఏటా ఉత్పత్తి చేసే అదనపు సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. అయినా నేడు సగం ప్రపంచం అర్థాకలితో అలమటిస్తోంది. నూటా పదికోట్ల మంది దారుణమైన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు? సంపద పంపిణీలో అంతులేని దోపిడీ, ఫలితంగా నెలకొన్న తీవ్రమైన అసమానతలు అనాదిగా వెంటాడుతుండగా.. వాటికి తోడు యుద్ధాల ఫలితంగా తలెత్తే ఆహార సంక్షోభాలు ఈ ఆకలికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఘర్షణలు చెలరేగిన దేశాల్లో రోజుకు సుమారు 21 వేలమంది చొప్పున ఆకలికి తాళలేక ప్రాణాలు కోల్పోతు న్నారన్న ఆక్స్‌ఫామ్‌ నివేదిక ఇందుకో తిరుగులేని ఉదాహరణ. నేడు ఇజ్రాయిల్‌, పాలస్తీనా వైపు చూస్తే ఏం కనిపిస్తోంది? రావణకాష్టంలా మండుతున్న మారణహోమంలో ఆయుధాల కంటే ఆకలికి బలవుతున్నవారే ఎక్కువ. ఇందులో మూడోవంతు మంది ముక్కుపచ్చలారని పసిపిల్లలు, మహిళలే. బాంబుల మోతల్లో అట్టుడికిపోతున్న గాజాలో 5 లక్షల మందికి ఆహారం అందడం లేదు. సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా తీవ్రమైన ఆకలిచావులు సంభవించే ప్రమాదం పొంచివుందని పలు మానవతావాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ సుమారు ఏడున్నర లక్షల మంది ఆహారం కోసం అల్లాడుతున్నారు. ఇక ఉక్రెయిన్‌లో జరుగుతున్నదేమిటి? యుద్ధంలో అటూ ఇటూ మాటిమాటికీ చేతులు మారుతున్న ఆధిపత్యంలో ప్రతి ఊరూ, ప్రతి నగరం నేలమట్టమయ్యాకే వీరికైనా, వారికైనా స్వాధీనం అవుతోంది. వైరిపక్షాలు ఆహారాన్నీ, తాగునీటినీ, ఇంధనాన్నీ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఫలితంగా బాధిత ప్రజలు ఆకలికి విలవిలలాడుతున్నారు. యుద్ధభూమి నుంచి వలసబాటలో సాగుతున్న లక్షలాది ప్రజలు కూడా ఆకలిచావులకే బలవుతున్నారు. ఇది ప్రత్యక్షంగా ఆయా దేశాల ప్రజలనే కాదు.. పరోక్షంగా మొత్తం ప్రపంచ దేశాల ప్రజలనూ ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు ఆకలి విశ్వమంతటా విలయతాండవం చేస్తున్నది. ఆయుధాలు ఎంత విధ్వంసం సృష్టించగలవో, అవి ఎంత కనికరం లేనివో మనం కళ్లారా చూస్తున్నాం. అంతకుమించి వాటి బేహారులు ఎంత నీచంగా నిప్పు చల్లారకుండా ఎగదోస్తున్నారో కూడా గమనిస్తూనే ఉన్నాం. వీరి నైచ్యానికి పాఠశాలలు, వైద్యశాలలు, గ్రంథాలయాల నుంచి పచ్చటి పొలాలు, నదులు, విద్యుత్‌ కేంద్రాలు, భారీ పరిశ్రమల దాకా సర్వం నేలమట్టం అవుతున్నాయి. ఈ కారణంగా తలెత్తే ఆహార సంక్షోభం రాబోవు తరాలను సైతం ఆకలి కోరలకు బలి చేయనుంది. చివరికి ఇదెక్కడికి దారితీస్తుంది? మానవజాతి మొత్తాన్ని ఈ నేల నుంచి తుడిచి పెట్టేస్తుందా? బతకడానికే పనికిరానిదిగా ఈ భూమండలం రూపురేఖల్ని మార్చే స్తుందా? స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పినట్టు కుబేరులంతా కలిసి పచ్చటి భూమిని చెత్తకుండీగా మార్చేసి, గ్రహాంతరాలకు ఉడాయించేస్తారా? అదే జరిగితే ఈ మానవజాతి సుదీర్ఘ నాగరికతా వికాసం ఏం సాధించినట్టు? ‘గతమంతా తడిచె రక్తమున కాకుంటే కన్నీళ్లతో’ అన్నాడు శ్రీశ్రీ. కానీ వర్తమానమూ అందుకు భిన్నంగా లేకపోవడం కడు విషాదం. ఇదిలాగే కొనసాగితే.. 2030 నాటికి ఆకలన్నదే లేకుండా చేయాలన్న లక్ష్యాన్ని ఈ ప్రపంచం ఎలా సాధించగలదు?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page