top of page

ఆక్వా వ్యర్థాలతో అనర్ధం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 16
  • 2 min read
  • హేచరీ నుంచి రసాయన వ్యర్థాల విడుదల

  • వాటి ప్రభావంతో జీడితోటలోని చెట్లన్నీ నాశనం

  • ఇదేమిటని ప్రశ్నించిన మహిళా రైతుపై దౌర్జనం

  • పొల్యూషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

  • చివరికి గ్రీవెన్స్‌ను ఆశ్రయించి జేసీకి బాధితురాలి ఫిర్యాదు

ree

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

హేచరీ పెట్టి ఆక్వా సాగుతో కాసులు పండిరచుకునే క్రమంలో దాని యజమానులు పక్కనే ఉన్న మహిళా రైతు కడుపు కొడుతున్నారు. తమ హేచరీ నుంచి వెలువడే రసాయన వ్యర్థ జలాలను దూరంగా తరలించకుండా పక్కనున్న జీడితోటలోకి మళ్లిస్తుండటం వల్ల రసాయనాల ప్రభావంతో జీడి చెట్లు నాశనమయ్యాయని బాధిత మహిళా రైతు ఆక్రందిస్తున్నారు. ఈ అన్యాయంపై పలుమార్లు కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. తిరిగి హేచరీ యజమానులతో కుమ్మక్కై వారికి అండగా నిలుస్తున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. గార మండలం కొర్లాం పంచాయతీ సీపానపేటకు చెందిన పి.గోవిందమ్మకు ఎల్‌పీఎం నెం. 2236లో 3.47 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో జీడితోట పండిరచి వచ్చే ఫలసాయంతో ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఆ భూమిని ఆనుకుని వల్లభ ఆక్వాటెక్‌ పేరుతో ఆక్వా హేచరీ ఏర్పాటైంది. అప్పటినుంచే మహిళారైతు గోవిందమ్మకు కష్టాలు మొదలయ్యాయి. హేచరీ నుంచి వచ్చే రసాయనాలతో నిండిన వ్యర్థ జలాలను జీడితోటలోకి మళ్లించసాగారు. ఇదేం అన్యాయమని గోవిందమ్మ హేచరీ యాజమాన్యాన్ని ప్రశ్నించినా స్పందించలేదు.. వ్యర్థాలను మళ్లించడమూ ఆపలేదు. దాంతో రసాయన వ్యర్థాల ప్రభావంతో భూమి సారం కోల్పోయి చెట్లు చనిపోసాగాయి. గత ఐదేళ్లుగా ఇదే తంతు సాగుతుండటంతో మొత్తం జీడితోట నాశనమైపోయింది. దాంతో ఆ భూమిలో కొత్తగా సరుగుడు, జీడిమామిడి మొక్కలు నాటారు. వాటిని సంరక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పటికీ వ్యర్థజలాల ప్రవాహం ఆగకపోవడంతో మళ్లీ హేచరీ యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతిసారీ న్యాయం చేస్తామని చెబుతున్నా.. హ్యాచరీకి వచ్చి వ్యవసాయ భూమిని కలుషిత నీటిని చూసి వెళ్లిపోతున్నారే తప్ప హేచరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోగా కనీసం హెచ్చరించిన పాపాన కూడా పోలేదని గోవిందమ్మ ఆరోపిస్తున్నారు. అధికారుల అండ చూసుకుని హేచరీ యాజమాన్యం తమపై దౌర్జన్యానికి దిగుతోందని ఆరోపించారు. సుమారు ఐదేళ్ల నుంచీ ఇదే తంతు సాగుతుండటంతో విసిగిపోయిన ఆమె చివరికి జిల్లా గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయించారు. గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ ఖాన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న తన కుటుంబానికి హేచరీ యాజమాన్యం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఫిర్యాదులో పేర్కొంది. తక్షణమే హేచరీ యాజమాన్యంపైన, వారికి అండగా ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులపైనా చర్యలు తీసుకుని.. రసాయన వ్యర్థ జలాల నుంచి తమ పొలాన్ని కాపాడాలని గోవిందమ్మ తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page