top of page

ఆడిరచేది.. దాడులు చేసేది వారే!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • పేకాట దాడుల్లో పోలీసుల ద్విపాత్రాభినయం

  • గెస్ట్‌హౌస్‌పై రెయిడ్‌లో కొత్త కోణాలు

  • మంత్లీలు నిలిచిపోవడమే తాజా దాడికి కారణం

  • ఎస్పీ ప్లాన్‌నే లీక్‌ చేసిన కొందరు పోలీసులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో అనేక పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పేకాడిరచేది, రైడ్‌ చేసేది పోలీసులే. ఎప్పట్నుంచో పోలీసులకు తెలిసే జిల్లాలో పేకాట దందా నడుస్తోంది. అయితే మంత్లీలు ఉండటంతో ఇంతవరకు ఎన్ని పత్రికల్లో కథనాలు వచ్చినా, ఎన్నిసార్లు పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు సమాచారమిచ్చినా స్పందించని సిబ్బంది ఇప్పుడు వరుస రైడ్‌ల వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో, మరీ ముఖ్యంగా చివరి రెండున్నరేళ్ల కాలంలో నేరుగా పోలీసు ఉన్నతాధికారులకే సొమ్ములిచ్చి పేకాట శిబిరాలు నిర్వహించుకునేవారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్లకు అంతో ఇంతో మామూళ్లు ఇచ్చి నిరాటంకంగా పని కానిచ్చేసేవారు. అయితే ఇప్పుడు అటు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇక్కడ జిల్లాలో కూడా పోలీస్‌ బాస్‌ మారారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టేషన్ల నుంచి సమాచారం అందిన చోట రైడ్‌ చేయాల్సి వస్తోంది. గత పోలీస్‌బాస్‌ వరకు స్టేషన్‌ ఫార్మాలిటీలు చూసిన పేకాట శిబిరాల నిర్వాహకులు ఇప్పుడు పెద్ద ఎత్తున బదిలీలు జరగడంతో ఎలా కలవాలి, ఎవరి ద్వారా కలవాలి అనేది తెలుసుకోలేక దొరికిపోయారు. అప్పటికీ స్టేషన్లలో కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారి ఆధ్వర్యంలో రైడ్‌ జరుగుతుందని తెలుసుకున్న వెంటనే శిబిరాల నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి జరిగిన రైడ్‌లో కూడా లీకులు ఉన్నా తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో వీరు పోలీసులకు దొరికిపోయారు. వాస్తవానికి అక్కడ పేకాడుతున్న విషయాన్ని ఎస్పీకి లీక్‌ చేసింది పోలీసులే. అదే సమయంలో రైడ్‌ చేయడానికి సీఐ వస్తున్నారని నిర్వాహకులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చింది కూడా పోలీసులేనన్న అనుమానాలున్నాయి. పేకాడుతూ పట్టుబడిన విషయాన్ని పెద్దది చేస్తే పెద్ద ఎత్తున స్టేషన్‌ మామూళ్లు ఫిక్స్‌ చేయొచ్చనేది జిల్లాలో తలపండిపోయిన కొందరు రైటర్ల ఆలోచన. అందులో భాగంగానే రైడ్లు, లీకులు జరిగాయని తెలుస్తుంది.

ముఖ్యంగా గతంలో జిల్లా ఎస్పీగా ఒకరు బాధ్యతలు చేపట్టిన తర్వాత పేకాట శిబిరాల నిర్వాహకులతో అంటకాగుతూ మంత్లీలు దండుకున్నట్టు పోలీసు వర్గాల్లోనే చర్చ జరిగింది. జిల్లాలోని అన్ని సర్కిల్స్‌ పరిధిలో పేకాట నిర్వాహకుల నుంచి మంత్లీలు వసూలు చేసి ప్రతి నెలా నేర సమీక్ష సమావేశానికి ముందు రోజు తెచ్చి సమర్పించేవారని భోగట్టా. ఆ పోలీస్‌బాస్‌ బదిలీపై వెళ్లిపోయిన తర్వాత మంత్లీల వాటాల్లో తేడాలు వచ్చాయని, దాని ఫలితంగా ఎచ్చెర్ల పరిధిలో మంగళవారం రాత్రి ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి చేసి కొందరు ప్రముఖులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని చర్చ జరుగుతోంది.

పోలీసులకు తెలిసే ఎప్పటినుంచో..

జిల్లాలో అనేక గెస్ట్‌హౌస్‌లలో ప్రముఖులు చతుర్ముఖ పారాయణం నిర్వహించడం కొత్తకాదు. ఎప్పటినుంచో జరుగుతున్న ఈ దందా గురించి పోలీసులకు తెలిసినా ప్రతినెలా మామూళ్లు దండుకుంటూ వారి జోలికి వెళ్లకుండా మౌనం వహిస్తూ వచ్చారు. ఈ పేకాట డెన్‌ వెనుక పోలీసు పెద్దల హస్తం ఉందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. పేకాట కోసమే విదేశాలకు వెళ్లే ప్రముఖులుగా గుర్తింపు ఉన్న ఆర్‌.కే.నాయుడు, విజయగనరంలో ఒక బట్టలదుకాణం అధినేత, విజయనగరానికే చెందిన ఒక మాజీ ఎమ్మెల్సీ తదితరులు ఈ గెస్ట్‌హౌస్‌లో జరిగే పేకాటలో పాల్గొంటుంటారు. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి టాస్క్‌ఫోర్స్‌ ద్వారా రైడ్‌ చేయించి పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. అయితే ఎస్పీ దాడి ప్రణాళికను పోలీసులే లీక్‌ చేసి పేకాట ఆడుతున్నవారికి ఉప్పు అందించినట్లు తెలిసింది. గెస్ట్‌హౌస్‌ యజమానికే రైడ్‌ జరగనున్న సమాచారాన్ని ముందుగా పోలీసులు చేరవేశారట. ఇదంతా పోలీసులు మామూళ్ల కోసం నిత్యం చేసే పనేనని ఆయన పట్టించుకోపోవడంతో ఆ తర్వాత పేకాట నిర్వహిస్తున్న అంధవరపు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని తెలిసింది. దాంతో ఒక ప్రముఖ లాయర్‌కు ఫోన్‌ చేయగా ఆయన కూడా ఏమీ కాదులే.. అని చెప్పి ఫోన్‌ పెట్టేసినట్లు తెలిసింది. అనంతరం మరో ఇద్దరు ప్రముఖులకు ఫోన్‌ కాల్స్‌ వెళ్లగా వారు టాయిలెట్‌ పేరుతో అక్కడ నుంచి జారుకున్నారని అంటున్నారు.

మంత్లీలు అందకపోవడమే కారణమా?

దాడి సమాచారాన్ని లీక్‌ చేసినవారు, దాడికి కారకులు కూడా పోలీసులే కావడం ఈ కేసులో విశేషం. దీనివెనుక పెద్ద తతంగమే ఉంది. గతంలో ఒక ఎస్పీ ఉన్నప్పుడు కూడా అనేక మంది పెద్దలకు చెందిన గెస్ట్‌హౌస్‌ల్లో తరచూ పేకాట ఆడిరచేవారు. అందుకుగాను ప్రతినెలా రూ.10 లక్షలు మంత్లీల రూపంలో సమర్పించేవారు. దీంతో పాటు ఎచ్చెర్ల పోలీసులకు మంత్లీలు ముట్టజెప్పేవారు. మంగళవారం రాత్రి జరిపిన రైడ్‌లో పేకాడుతున్నవారి కార్లను వదిలేసి రూ.8లక్షలకు పైగా నగదు, సెల్‌ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారని భోగట్టా. అయితే రూ.3.25 లక్షలు మాత్రమే అక్కడ దొరికినట్టు చూపించారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలీసులకు పేకాట శిబిరాల నిర్వాహకులు, గెస్ట్‌హౌస్‌ యజమానులు, జిల్లాలో కొందరు పెద్దలు కేవలం పేకాట కోసమే సొమ్ములు ఇవ్వడం ఇక్కడ ఎప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారం. ఆరేళ్ల ముందు ఈ ఫార్మాలిటీలు ఉండేవికావు. కానీ ఇక్కడ ఎస్పీగా పని చేసిన ఒక రెడ్డి పేకాట, బెట్టింగ్‌ నిర్వాహకులను పిలిచి అండర్‌వేర్‌తో కూర్చోబెట్టి మరీ మంత్లీలు వసూలుచేసి ఇచ్చే బాధ్యతను అప్పగించారు. అప్పట్నుంచి జిల్లాలో పేకాడటానికి అనువైన వాతావరణం ఏర్పడిరది. పోలీస్‌ బాస్‌లు ఎంతమంది మారినా పేకాట శిబిరాలు తగ్గలేదు కదా.. మరింత పెరిగాయి. జిల్లాలో ఉన్న ప్రతీ రిసార్టు, గెస్ట్‌హౌస్‌ పేకాట కేంద్రాలే. ఇవన్నీ పోలీసుల కనుసన్నల్లోనే నడుస్తుంటాయి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page