`ఫీజు బకాయి ఉన్నారంటూ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరణ
`ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్‌కు అవసరమని బతిమాలినా తిరస్కరణ
`చివరికి వారి తరఫున బకాయిలు చెల్లించిన దయాశీలురు
`తొలి నుంచీ యాజమాన్యానిది అడ్డగోలు వైఖరేనని ఆరోపణలు
విద్యార్థుల ప్రతిభను తమ ఘనతగా చాటుకుంటారు. పెద్ద పెద్ద హోర్డింగులు, బ్యానర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫీజుల్లేకుండా ఉచితంగా చదువు చెబుతామని కూడా నమ్మబలుకుతారు. తద్వారా కొత్త అడ్మిషన్లు దండుకుంటారు. అవన్నీ నమ్మి చేరిన వారికి అసలు సినిమా చివరిలో చూపిస్తారు. ఫీజులు ఏమాత్రం పెండిరగ్ ఉన్నా పీడిరచుకుతింటారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా మానసికంగా హింసిస్తారు. ముక్కుపిండి మరీ చివరి పైసా వసూలయ్యేవరకు వదిలిపెట్టరు. విద్యను ఫక్తు వ్యాపారంగా మార్చేసిన కార్పొరేట్ కళాశాల నిర్వాకాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల వారి అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ అరాచకాలకు పరాకాష్టగా చెప్పుకోదగ్గ ఉదంతం నగరంలోని కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది. ఫీజులు బకాయి ఉన్నారన్న నెపంతో ఈ కళాశాలలో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకుండా ఐఐటీ, ఎన్‌ఐటీ ర్యాంకులు సాధించిన ఇద్దరు విద్యార్థినులకు ఫీజులు బకాయి ఉన్నారన్న కారణంతో వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం మొండికేసింది. తల్లిదండ్రులు, వారి తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మరికొందరు కలిసి వెళ్లి ఎంత బతిమాలినా కళాశాల యాజమాన్యం ఏమాత్రం ఖాతరు చేయలేదు. చివరికి విద్యార్థులిద్దరి తరఫున వారంతా డబ్బులు సమకూర్చి ఫీజు బకాయిలు చెల్లించాల్సి వచ్చింది.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
నగరంలోని కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుకున్న ఇద్దరు విద్యార్థినులు చదువులో టాప్‌లో నిలిచినా, ఐఐటీ, జేఈఈ మెయిన్స్(ఎన్‌ఐటీ)లో మంచి ర్యాంకులు సాధించి సీట్లు ఖరారు చేసుకున్నా.. తమ కళాశాలలో చదువుకుని విజయం సాధించిన ఆ విద్యార్థులను అక్కున చేర్చుకుని, తమ ఘనతను చాటుకోవాల్సిన కళాశాల యాజమాన్యం మాత్రం ఫీజులు బకాయి ఉన్నారంటూ పరాభవానికి గురిచేసింది. సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించింది. నగరంలోని కంపోస్ట్ కాలనీకి చెందిన చింతగడ సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్న చిరుద్యోగి. అతని కుమార్తె దివ్య తేజశ్రీ చదవుల్లో తొలి నుంచీ రాణిస్తోంది. టెన్త్‌లో మంచి మార్కులు సాధించింది. ఇంటర్‌లో కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో చేరింది. ఇంటర్‌లో రెండేళ్లు అత్యధిక మార్కులు సాధించింది. ఈమెకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సుతో కలిపి రూ.50 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో విడతల వారీగా రూ.10 వేలు ఒకసారి, రూ.17 వేలు మరోసారి చెల్లించారు. మిగతా ఫీజు బకాయిపడ్డారు. అలాగే పుణ్యపు వీధికి చెందిన వాచ్ మెకానిక్ దేవు వెంకటేశ్వరరావు కుమార్తె గాయత్రిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. చదువుల తల్లిగా రాణిస్తున్న ఆమె కుటుంబం కూడా పేదవర్గానికి చెందినదే. ఈమె కూడా టెన్త్‌లో మంచి మార్కులు సాధించి ఇంటర్ చేసేందుకు కాకినాడ ఆదిత్యలో చేరింది. ఈమెకు జేఈఈ మెయిన్స్ కోచింగ్‌తో కలిపి రూ.38 వేల ఫీజుతో పాటు పుస్తకాలకు రూ.7 వేలు.. మొత్తం రూ.45 వేలుగా కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. వీరు కూడా కొంత మొత్తం దశలవారీగా కట్టి మరికొంత బకాయిపడ్డారు. దివ్య, గాయత్రి ఇద్దరూ మంచి గ్రేడ్ మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులయ్యారు. దివ్య ఐఐటీ, గాయత్రీ ఎన్‌ఐటీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇద్దరికీ ఆయా కోర్సుల్లో ర్యాంకులు గ్యారెంటీ అని కుటుంబీకులు ఆనందిస్తున్న తరుణంలో కళాశాల యాజమాన్యం రూపంలో అవాంతరాలు ఎదురయ్యాయి.
ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు
విద్యార్థులు ఇద్దరూ మంచి ర్యాంకులు సాధించి ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కౌన్సెలింగ్ సమయంలో సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. ఆ మేరకు తమ సర్టిఫికెట్ల కోసం చదువుకున్న కాకినాడ ఆదిత్య కళాశాలకు వెళ్లిన వారికి యాజమాన్యం నుంచి తిరస్కారం ఎదురైంది. ఫీజులు బకాయి ఉన్నారంటూ.. వాటిని చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల నిర్వాహకులు నిర్మొహమాటంగా చెప్పేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లి ఫీజులో కొద్దిగా కన్సెషన్ ఇవ్వమని, మిగతా మొత్తానికి ప్రామిసరీ నోట్ రాసిచ్చి, తర్వాత కడతామని కౌన్సెలింగ్ గడువు సమీపిస్తున్నందున సర్టిఫికెట్లు ముందు ఇవ్వాలని కాళ్లావేళ్లాపడి బతిమాలినా యాజమాన్యం ఏమాత్రం కనికరించలేదు. మీరు ఎన్‌ఐటీలో చేరుతారో, ఐఐటీలో చేరుతారో మాకు అనవసరం.. బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తేల్చేశారు. ఇటువంటి విద్యార్థుల చదువుకు మొదటి నుంచి ఆర్థికంగా అండగా నిలుస్తున్న గ్లోబల్ ఎంపవర్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన సద్గుణ బాబు, మరికొందరు విద్యార్థుల తరఫున కళాశాలకు వెళ్లి పలు రకాలుగా నచ్చజెప్పినా యాజమాన్యం లొంగలేదు.
విరాళాలతో బకాయిల చెల్లింపు
దాంతో చేసేదిలేక గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులతోపాటు మరికొందరు ఉదారవాదులు స్పందించి దివ్య, గాయత్రిల పేరిట ఉన్న బకాయిలకు సంబంధించి రూ.40 వేలకుపైగా సమీకరించి కళాశాలలో చెల్లించారు. కాగా కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాల తీరు మొదటినుంచీ ఇదేవిధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి విద్యాసంస్థల్లో ఐదు శాతం సీట్లు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. కళాశాల యాజమాన్యం కూడా మెరిటోరియస్ విద్యార్థులను ఉచితంగా చదువు చెబుతామంటూ అడ్మిషన్ల సమయంలో డప్పు కొట్టుకుని అడ్మిషన్లు పెంచుకుంటున్నా తీరా చదువు పూర్తి అయిన విద్యార్థులను మాత్రం ఫీజల పేరుతో వేధింపులకు గురి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను తమ ప్రచారానికి వాడుకుంటున్న యాజమాన్యం ఫీజుల విషయంలో మాత్రం అరాచకం చేస్తోందంటున్నారు. ఫీజులు బకాయి ఉండటం వాస్తవమే అనుకున్నా వాటితో విద్యార్థుల సర్టిఫికెట్లకు ముడిపెట్టడం ద్వారా ఉన్నత కోర్సుల్లో చేరకుండా అడ్డుకోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటేమనని తల్లిదండ్రులు, బాధితులు మండిపడుతున్నారు. ముక్కుపిండి మరీ వసూలుచేస్తున్న ఫీజులతో విద్యార్థులకు కనీస వసతులైనా సమకూరుస్తున్నారా..? అంటే అదీ లేదు. అసలు ఈ కాలేజీ నడుస్తున్నదే ఒక అనధికారిక భవనంలో. అందులోనూ పార్కింగ్ కోసం విడిచిపెట్టిన సెల్లార్‌లో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఇక వాష్‌రూమ్‌లు, బాత్రూమ్‌ల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుంటే అవి కాలేజీ ఖాతాలోకి వెళతాయి. పరీక్ష తప్పితే, అది పిల్లల తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారు. పుస్తకాలు, యూనిఫామ్‌లు మొత్తం అన్నీ కార్పొరేట్ కాలేజీలే విక్రయించి, చివరకు అదే అలవాటులో చదువును కూడా అమ్మేసుకుంటున్నారు. నిజంగా చదువుల తల్లుల ఫొటోలు పెట్టి కొత్త అడ్మిషన్ల కోసం పబ్లిసిటీ చేసిన యాజమాన్యం వీరికే తిరిగి సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆదిత్య సంస్థల యాజమాన్యం దృష్టికి ఇటువంటి అంశాలు తీసుకువెళ్తే నల్లమిల్లి శేషారెడ్డి లాంటి విద్యావేత్త మానవత్వం చాటుకునే మనిషే. కానీ స్థానికంగా పనిచేసే సిబ్బంది ఇలా కఠినంగా వ్యవహరించి ప్రమోషన్లు కొట్టేయాలన్న తాపత్రయంలో బీదాబిక్కీ అనే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీలైతే ఫీజు బకాయిలుంటే కనీసం హాల్‌టిక్కెట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే తాము బెటరని ఈ యాజమాన్యం చెప్పుకోవడం కొసమెరుపు.
Komentarze