top of page

ఆధార్‌ ఒకటే.. 50 కనెక్షన్లట!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 19
  • 2 min read
  • విద్యుత్‌శాఖ అధికారుల మాయాజాలం

  • ఇతరుల సర్వీసులు ఒకే పేరుతో అనుసంధానం

  • అధికారుల తప్పిదానికి బలైన ఆటోడ్రైవర్‌ కుటుంబం

  • తల్లి వందనానికి అనర్హులంటూ వారి పిల్లలపై వేటు

ree

(సత్యం న్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల మండలం కొత్తపేట పంచాయతీ గాడుపేటకు చెందిన ఆటోడ్రైవర్‌ బుగత గోవిందరావుకు ఇద్దరు పిల్లలు యశ్వంత్‌, విమల. కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వీరిలో ఒకరికి వైకాపా హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకం కింద ఆర్ధిక సాయం అందింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన తల్లికి వందనం పథకానికి మాత్రం గోవిందరావు కుటుంబంపై అనర్హత వేటు పడిరది. తమను ఎందుకు అనర్హులుగా పరిగణించారని సచివాలయంలో ఆరా తీస్తే.. 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్నందున తల్లికి వందనం అందలేని సిబ్బంది సెలవిచ్చారు. గోవిందరావు కుటుంబం ఏ నెలా 140 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించడం లేదు. నెలనెలా వచ్చే విద్యుత్‌ బిల్లులు తీసుకుని సచివాలయానికి వెళ్లి ఇదే విషయాన్ని ఆయన మొరపెట్టుకున్నా.. తాము ఏమీ చేయలేమని సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో గోవిందరావు పూర్తి సమాచారం కోసం విద్యుత్‌ శాఖ కార్యాలయంలో సంప్రదించగా అక్కడి సిబ్బంది గోవిందరావుకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. అదేంటంటే.. బుగత గోవిందరావు ఆధార్‌ నెంబర్‌తో ఏకంగా 50 విద్యుత్‌ మీటర్లు తీసుకున్నట్టు రికార్డుల్లో ఉందన్న సమాచారాన్ని అతని చేతిలో పెట్టారు. దీంతో ఆయన లబోదిబోమంటూ విద్యుత్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేయగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి 299 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించలేదంటూ ఒక ధ్రువీకరణ పత్రం చేతిలో పెట్టి బాధితుడిని పంపేశారు. తప్పు ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అన్నది తేల్చకుండా తమ శాఖ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

పేరు ఒకటే.. నెంబర్లు వేరు

ఇంకో విశేషం ఏమిటంటే.. బుగత గోవిందరావు ఎచ్చెర్ల మండల వాసి కాగా, ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, రణస్థలం, జి.సిగడాం మండలాలకు చెందిన పలు గృహ విద్యుత్‌ సర్వీస్‌ నెంబర్లను గోవిందరావుకు చెందిన ఆధార్‌కు లింక్‌ చేసేశారు. అదీ ఒకటీ రెండు కాదు.. పొందూరులో 31, రణస్థలంలో 6, లావేరులో 6, ఎచ్చెర్లలో 4 సర్వీసులకు గోవిందరావు ఆధార్‌తో అనుసంధానం చేసేసి ఆ 50 విద్యుత్‌ కనెక్షన్లు గోవిందరావు అనే వ్యక్తి పేరుతో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. పేరు కామన్‌గా ఒక్కటే ఉన్నా ఇంటి పేరు, సర్వీసు సంఖ్య మారాయి. దీన్ని సరిచేయాల్సిన అధికారులు బాధితుడిని సర్దిచెప్పి పంపించేశారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆటో నడుపుకుని జీవిస్తున్న గోవిందరావు ఇద్దరు పిల్లులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా తల్లికి వందనానికి అనర్హులుగా మిగిలిపోయారు. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు తప్పును సరిదిద్ది తమ ఇద్దరు పిల్లలు తల్లికి వందనానికి అర్హులయ్యేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు.

ఇలాంటి బాధితులెందరో!

గోవిందరావు లాంటి బాధితులు జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరంతా విద్యుత్‌ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నెలకు 300 యూనిట్లకు మించి వినియోగించారని తల్లికి వందనం పథకానికి అనర్హులంటూ సచివాలయాల్లో అనర్హుల జాబితాలో తమ పిల్లల పేర్లు నమోదు కావడాన్ని చూసి వారి తల్లిదండ్రులు తమకు వచ్చిన విద్యుత్‌ బిల్లులు పట్టుకొని విద్యుత్‌ శాఖ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. దీనికితోడు గతంలో సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డును అర్హత ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు దానితోపాటు మరికొన్ని అర్హత ప్రమాణాలను కూడా నిర్దేశించింది. అందులో 300లోపు యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఒక ప్రామాణికం. నెలకు 299 యూనిట్ల కంటే ఒక్క యూనిట్‌ అధికంగా వాడినా ఇప్పటివరకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్మొహమాటంగా కట్‌ చేసేస్తోంది. అది కూడా పౌరులకు చెందిన ప్రతి అంశాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల లబ్ధిదారుల ఆధార్‌ నెంబర్‌ కొడితే చాలు.. వారి లెక్కలన్నీ బయటకొచ్చేస్తున్నాయి. అయితే ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో జరుగుతున్న తప్పిదాలు అర్హులైన పేదలను బలి తీసుకుంటున్నాయి. సంక్షేమ పథకాలకు అనర్హులను చేసేస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page