top of page

ఆపగలిగితే ఆపండి..!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • పోలీసులకు సవాల్‌ విసురుతున్న పేకాట సిండికేట్‌

  • సంపాదిస్తున్నదే డిపార్ట్‌మెంట్‌ను మేపడానికేనంటున్న తులసి

  • జూదరులకు పోలీసులతో భరోసా ఇప్పిస్తున్న గోపి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘‘జిల్లా నుంచి పేకాటకు వెళ్తున్నవారిపై పోలీసుల కన్నుంది. ప్రస్తుతానికి మేం రాలేం. కొన్నాళ్లు ఆగితే మంచిదని భావిస్తున్నాం.’’ అని వెనక్కు తగ్గుతున్న జూదరులకు పేకాట నిర్వాహకులు ఎక్కడలేని భరోసా ఇస్తున్నారట. వారిలో ధైర్యం నింపడం కోసం ఏకంగా తాము సంపాదిస్తున్న దానిలో వాటాలు ఎలా అన్నది కూడా ఏకరువు పెడుతున్నారు కూడా. అందులో భాగంగానే ‘‘పోలీసులకు రోజుకు రూ.50వేలు ఇస్తున్నాం. మమ్మల్ని ఎందుకు ఆపుతారు? మమ్మల్ని ఆపితే పోలీసులకు రావాల్సిన రూ.50వేలు ఆదాయం పోతుంది కదా.. అందుకే దర్జాగా వస్తున్నాం, వెళుతున్నాం’’ అంటూ తులసి డిపార్ట్‌మెంట్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని బయటపెడుతున్నారట.

‘‘ఒడిశా పోలీసులతో పోల్చుకుంటే జిల్లా పోలీసులకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. రోజుకు రూ.50వేలతో అన్ని స్థాయిల్లో అధికారులను మేనేజ్‌ చేస్తున్నాం. ఎవరికీ భయపడనవసరం లేదు. నేరుగా మేము ఏర్పాటు చేసే వాహనాల్లో పాతపట్నం, లేదంటే టెక్కలి నుంచి మెళియాపుట్టి మీదుగా రావచ్చు. పేకాట నిర్వహణ ప్రాంతానికి తీసుకువెళ్లే బాధ్యత మేమే చూసుకుంటాం’’ అని చెబుతున్నట్లు తెలుస్తుంది.

తోటాడకు చెందిన బెండి తులసీ పేకాట ఆడుతున్నవారికి గతంలో మద్యం, సిగరెట్‌, నీరు అందిస్తూ, గత 20 ఏళ్లుగా పేకాట శిబిరాల నిర్వహణ స్వయం ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆర్మీలో సిపాయినంటూ పెద్ద బిల్డప్‌ ఇచ్చి ఉద్యోగ విరమణ తర్వాత తాండ్ర తేజేశ్వరరావును బెండి తులసి పేకాట శిబిరాల నిర్వహణలో భాగస్వామ్యం చేసుకున్నాడు. వీరికి అక్కివరంకు చెందిన సీపాన శ్రీను జత కలిసిన తర్వాత ఈ వ్యాపారం సిండికేట్‌ అయి మూడు ముక్కలు ఆరు కాయిన్‌లుగా వృద్ధి చెందుతోంది.

వైకాపా హయాంలో నెలకు రూ.3 లక్షలు కప్పం కట్టి పేకాట శిబిరాలను నగర పరిధిలోనే నిర్వహించేవారు. వీరి శిబిరాలకు పోటీగా నడిపిన వారిని స్టేషన్‌లో పెట్టించి పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతుండేవాడు. ప్రభుత్వం మారిన తర్వాత, జిల్లాకు కొత్త పోలీస్‌బాస్‌ వచ్చిన తర్వాత శిబిరాల నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ పోలీసు బదిలీలన్నీ పూర్తయిన తర్వాత గతంలో తమకు సహకరించిన సిబ్బంది ద్వారా వాటాలు మాట్లాడుకొని పేకాడిస్తున్నారు. తులసితో భాగస్వాములుగా ఉన్న గోపి బ్యాచ్‌లో నగేష్‌, బండారి, చల్లా రాజు తదితరులు మైనార్టీలు కావడంతో వీరందరినీ గుప్పెట్లో పెట్టుకొని తులసి ఒక ఆట ఆడుకుంటున్నట్లు తెలుస్తుంది. రోజుకు రూ.70 లక్షలు లావాదేవీలు జరుగుతున్న ఆటలో ఎవరి పేరుతో ఎంత పక్కన పెడుతున్నారు, వాస్తవంగా వారికి ఇచ్చినదెంత అనేది మిగిలిన పార్టనర్లకు తెలుసు. కానీ ఈ సిండికేట్‌ మొత్తాన్ని తులసి పోలీసు బలంతో నడుపుతుండటం వల్ల కాదని వేరుకుంపటి పెడితే రౌడీషీటర్లతో సహా పోలీసులు ఎలా దాడులు చేస్తారో వీరికి తెలియంది కాదు. అందుకే తులసి ఇచ్చినంత, తాము పుచ్చుకున్నంత అన్న రీతిలో మిగిలిన నిర్వాహకులు అన్నీ మూసుకు కూర్చుంటున్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page