top of page

ఆమదాలవలసకు ‘దారి’ దొరికింది!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఫలించిన కూన మంత్రం

  • రేపటి నుంచి ప్రారంభం కానున్న బీటీ పనులు

  • ప్రయాణీకులకు తప్పనున్న ఇబ్బందులు

  • శ్రీకాకుళం నుంచి రాగోలు మార్గంలో కొంత జాప్యం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా తయారైంది శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వైపు వెళ్లే రోడ్డు విస్తరణ పనులు. గత పాలకులు దీన్ని పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రోడ్డు విస్తరణ పూర్తి చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వెళ్లే మార్గానికి మోక్షం కల్పించడం కోసం రోడ్డుకు ఒక వైపు ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌, మరో కొనవైపు ఉన్న శాసనసభ్యుడు గొండు శంకర్‌లతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు పడరాని పాట్లు పడుతున్నా దీనికి పరిష్కారం దొరకడంలేదు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి పార్ట్‌ పేమెంట్‌ కింద తాను పెట్టుకున్న రూ.14.50 కోట్లు బిల్లు చెల్లిస్తే గానీ మిగతా పనులు పూర్తి చేయడానికి తన దగ్గర పైసా లేదని కాంట్రాక్టర్‌ చేతులెత్తేయడంతో ఈ బిల్లు క్లియర్‌ చేసే పనిని, సంబంధిత ఫైళ్లు స్వయంగా ఎమ్మెల్యే కూన రవికుమారే చంకలో పెట్టుకొని విజయవాడలో 15 రోజులు మకాం వేసి ప్రతీ టేబుల్‌ దగ్గర క్లియరెన్స్‌ తెచ్చి ట్రెజరీలో బిల్లు చెల్లింపునకు టోకెన్‌ తెస్తే.. చివరి నిమిషంలో ఆ పేమెంట్‌ నిలిచిపోయింది. ఆమదాలవలస రోడ్డు పనుల కంటే ముందు చేపట్టి పూర్తి చేసిన పనులకు గత ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదని, ఇప్పుడు టీడీపీ నాయకులు తమ సొంత పనుల కోసం నిధులు విడుదల చేయించుకుంటున్నారంటూ న్యాయస్థానానికి ఒకరు వెళ్లడంతో చివరి నిమిషంలో ట్రెజరీ వద్ద పేమెంట్‌ ఆగిపోయింది. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. దీనికి తోడు ఇటీవల వర్షాలు కురవడంతో గతం కంటే దారుణంగా ఈ రోడ్డు పరిస్థితి తయారైంది. దీంతో జిల్లా టీడీపీ నాయకులకు ఇది తీరని తలనొప్పిగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు ఆనవాలే లేకుండాపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు కూడా ఎదురయ్యాయి. గోతుల్లో వాహనాలు దిగబడిపోవడం, భారీ వాహనాలకు కట్టర్లు విరగడంతో రోడ్డు మీదే వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనివల్ల ప్రతీరోజు జనం నుంచి టీడీపీ నాయకులకు శాపనార్థాలు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూన రవి ఏ మంత్రం వేశారో తెలియదుగానీ ఆదివారం నుంచి ఆమదాలవలస నుంచి చింతాడ వైపు వచ్చే రహదారికి తారు వేసే పనికి శ్రీకారం చుడుతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ విస్తరణ పనులు ఎన్నికలకు ముందే పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్లాక్‌టాప్‌ వేస్తే ఆ ప్రాంతానికి రెండు వరుసల రోడ్డు అందుబాటులోకి వచ్చినట్టే. ఆదివారం ప్రారంభించి ఐదు రోజుల్లో ఈ పని ముగించనున్నారు. ఇక మిగిలింది శ్రీకాకుళం నుంచి రాగోలు వెళ్లే మార్గమే. మొత్తం ఈ రోడ్డులో అత్యంత సంక్లిష్టంగా మారిన ప్రాంతం కూడా ఇదే. దీనికి మోక్షం కల్పించడానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు మంజూరు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో ఇక్కడ బ్లాక్‌ టాప్‌ వేయడానికి ఎంత తారు పడుతుందని ఆమధ్య కాంట్రాక్టర్‌తో ఆరా తీశారు. అయితే ఇక్కడ కేవలం బీటీ వేసినంత మాత్రాన రోడ్డు పూర్తయినట్టు కాదని, విస్తరణ కూడా కొంతమేరకు మిగిలిపోయిందని చెప్పడంతో పార్ట్‌బిల్‌ పేమెంట్‌ కోసం ఆయన ప్రయత్నించారు. కేవలం తారు, కంకర అయితే పని అయిపోతుందనుకుంటే దాన్ని తన సొంత నిధులు వెచ్చించి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ నగరం నుంచి వెళ్లే ఈ మార్గానికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి కొత్త రోడ్డు వరకు ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. ఇందులో బలగలో రోడ్డు విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం సెటిల్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వంలో ఇళ్లు కోల్పోయినవారికి డబ్బులివ్వలేమని టీడీఆర్‌ బాండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందుకు ప్రజలు ఏమేరకు అంగీకరించారనేది తెలియలేదు. అందుకే ఇప్పటికిప్పుడు నగర పరిధిలో విస్తరణ అంశాన్ని పక్కన పెట్టి కొత్త రోడ్డు నుంచి రాగోలు మీదుగా వెళ్లే రోడ్డును పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. ఆమదాలవలసలో కూన రవి వేసిన మంత్రాన్నే శ్రీకాకుళంలో గొండు శంకర్‌ కూడా వేసినట్లు తెలుస్తుంది. ముందుగా విస్తరణ పూర్తయిన ప్రాంతంలో బ్లాక్‌ టాప్‌ వేశాక రాగోలు ప్రాంతంలో ఉన్న గుంతలు పూడ్చి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అయితే దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 10 కిలోమీటర్ల రోడ్డు మొత్తం నరకప్రాయం కాకుండా కనీసం చింతాడ నుంచైనా రోడ్డు బాగుంటే కొంతమేర తిట్లు తగ్గుతాయని నాయకులు భావిస్తున్నారు. కానీ కొత్త రోడ్డు దాటిన తర్వాత చర్చి వద్ద ఉన్న గెడ్డ కల్వర్టు విస్తరణ పూర్తి కానంత వరకు ఈ రోడ్డు పనులు సంపూర్ణం కానట్టే. ప్రస్తుతం ఉన్న సమస్యంతా రాగోలు, గూడెం జంక్షన్‌ ఏరియాలోనే. ఇక్కడ కూడా పనులు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

పెరుగుతున్న జనాభాకు, వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ చేయాలని దశాబ్ధకాలంగా డిమాండ్‌ వినిపిస్తున్నా అందుకు అనుగుణంగా పనులు ప్రారంభం కాలేదు. ఆమదాలవలస` శ్రీకాకుళం రహదారి శిథిలావస్థకు చేరి ఆరేళ్లలో సుమారు 32మంది మృత్యువాత పడ్డారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్తరోడ్డు బైపాస్‌ నుంచి దూసి జంక్షన్‌ వరకు రోడ్డు మోకాలి లోతు గోతులయ్యాయి. దీంతో వారం రోజులుగా ఈ రోడ్డు మీదుగా ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. రోడ్డు మధ్యలో భారీ వాహనాలు దిగిపోవడంతో వాటి తొలగించడానికి భారీ క్రేన్‌లు వచ్చేవరకు వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ప్రజా రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇసుకలారీలతో పాటు స్కూల్‌, ప్రజారవాణా బస్సులు, ఎఫ్‌సీఐ నుంచి బియ్యం, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నిత్యావసరాలు తరలించే వాహనాలు, ఆమదాలవలస రోడ్డు రైల్వేస్టేషన్‌కు వచ్చే సిమెంట్‌, ఎరువులు లారీలతో రద్దీగా మారిపోయింది. అంతర్రాష్ట కనెక్టెవిటీ ఉన్న రహదారి కావడంతో భారీ వాహనాలు ఈ రోడ్డు మీదగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డుపై మోకాలి లోతు గుంతలు ఏర్పడడంతో వారం రోజులుగా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి సుమారు ఆరుగంటలు సమయం పడుతుంది. నగరానికి ఉద్యోగ రీత్యా వచ్చినవారు, నగరం నుంచి ఉద్యోగ విధులకు వెళ్లేవారు, కాలేజీ, పాఠశాలలకు నగరానికి బస్సుల్లో వస్తున్న విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహన చోదకులు సమస్యల వర్ణనాతీతం. అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో రోడ్డుపై పడిన గుంతల్లో రాళ్లు వేసి కప్పే ప్రయత్నాలను ఆర్‌ Ê బీ అధికారులు శుక్రవారం నుంచి ప్రారంభించారు.

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు

మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు వచ్చిన రోజున అచ్చెన్నాయుడు రోడ్డు విస్థరణ అంశాన్ని ప్రస్తావించి వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని సదరు కాంట్రాక్ట్‌ర్‌తో మాట్లాడినట్టు నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో అభినందన సభలో ప్రకటించారు. అందుకు అణుగుణంగా ముందడుగు వేసినా రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల నిలిచిపోయిన పనులను మొదలుపెట్టేందుకు కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదని గుర్తించి జిల్లాలో గోతులమయమైపోయిన రోడ్లలో ఫ్లైయాష్‌తో నింపి రోడ్లను చదును చేయాలని ఆర్‌ Ê బీ అధికారులకు సూచించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్తరణకు కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పనులు చేపట్టనున్నట్టు జూలై 5న అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయంలో సుడా, నగర కార్పొరేషన్‌, ఆర్‌ Ê బీ అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్‌ సమీక్ష నిర్వహించారు. భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాన్యంతో రెండు గంటల పాటు చర్చించారు. జూలై 23న అసెంబ్లీలో ఎమ్మెల్యే తన మొదటి ప్రసంగంలో శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు పరిస్థితిని సభ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు శిథిలావస్థకు చేరడం వల్ల తరచూ ప్రమాదాలు జరగడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. అయినా ఇప్పటికీ రోడ్డు పనులపై ఎటువంటి ముందడుగు పడలేదు. రాగోలు గ్రామం వద్ద ఎమ్మెల్యే శంకర్‌ చొరవ తీసుకోవడంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చే చర్యల్లో భాగంగా రోడ్డును తొలగించి మెటల్‌ వేసి కొంతమేర ఎత్తు చేసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు చేశారు.

ఇప్పటికీ పురోగతి లేదు..

అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేయడం మినహా సమస్యకు పరిష్కారం చూపించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 10.4 కిలోమీటర్లు మేర శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనులు ఆరేళ్లుగా ప్రకటనలకే పరిమితమైపోయాయి. నిత్యం 10వేల వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిని గాలికొదిలేసి ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ కాలం గడిపేస్తున్నారని విమర్శలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్లలో చేయని పనిని ఆరు నెలల్లో చేసి చూపిస్తామని 2024 ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఇచ్చిన హమీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాన అజెండాగా రోడ్డు సమస్యపై ప్రచారం చేసిన ఎన్డీయే అభ్యర్ధులు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తికావచ్చినా పనుల్లో పురోగతి లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page