`40 శాతం దృష్టిలోపం పేరుతో ఉద్యోగం పొందిన అప్పలనరసమ్మ
`ఆమెకు మళ్లీ వైకల్య నిర్థారణ చేయించాలని విచారణాధికారి సూచన
`ఉదారంగా మూడుసార్లు పరీక్షలకు అవకాశమిచ్చిన విద్యాశాఖ అధికారులు
`30 శాతంలోపే లోపం ఉందన్నీ అన్నిసార్లూ స్పష్టం చేసిన వైద్యాధికారులు
`అయినా సదరు గురువమ్మపై చర్యలకు ఉపేక్షిస్తున్న అధికారులు

జిల్లాలో తప్పుడు వైకల్య ధ్రువపత్రాలతో అనేకమంది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతుంటే.. అవే ధ్రువపత్రాలతో పలువురు అప్పనంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొంది అర్హులైన అసలు అభ్యర్థుల అవకాశాలకు గండికొడుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ తరహా బాగోతాలు చాలానే బయటపడుతున్నాయి. చిత్రమేమింటే పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతూ అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గౌరవనీయమైన టీచర్ ఉద్యోగాల్లో కూడా తప్పుడు వైకల్య పత్రాలతో చేరిపోయి దర్జా వెలగబెడుతున్నవారు కూడా ఉన్నారు. అటువంటి ఒక ఉదంతం తాజాగా తెరపైకి వచ్చింది. కవిటి మండలంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న బండారు అప్పలనరసమ్మ తప్పుడు ధ్రువపత్రంలో వికలాంగుల కోటాలో ఉద్యోగం సంపాదించారన్న ఆరోపణలు ఇప్పటివి కాదు. దీనిపై దాదాపు రెండు దశాబ్దాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన జిల్లా విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులు ఆ పని చేయకుండా ఆమెను కాపాడుకుంటూ వస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా విచారణకు గానీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన వైకల్యాన్ని నిర్థారించుకునేందుకు గానీ ముందుకు రాకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సంక్షేమ పథకాల కోసం తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలితే బాధ్యులైన వారికి రెండేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించేలా 2023 ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సరైన పరిశీలన జరపకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా తప్పుడు ధ్రువపత్రాలు జారీ చేసే అధికారులు, వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం నోటిఫై చేసిన 21 వైకల్యాల నిర్ధారణకు మార్గదర్శకాలను కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా లేని వైకల్యం చూపించి దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు పొందడం సర్వసాధారణమైపోయింది. నకిలీ లబ్ధిదారులు, ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చినా సంబంధిత శాఖల అధికారులు వాటిని తొక్కిపెట్టేస్తున్నారు. విద్యాశాఖ కూడా దానికి మినహాయింపు కాదు. ఫిర్యాదు వచ్చిన ప్రతిసారీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పిలిపించి డబ్బులు దండుకొని ఆ వ్యవహారాన్ని విద్యాశాఖ అధికారులు మాఫీ చేసేస్తున్నారు. విద్యాశాఖలో డబ్బు చేతులు మారితే ఎంతటి అక్రమాన్నయినా సక్రమంగా మార్చేయడంలో వారికి వారే సాటి అన్న ఆరోపణలు ఉన్నాయి.
20 ఏళ్లుగా ఫిర్యాదులు
తనకు 40 శాతం దృష్టిలోపం ఉన్నట్లు చూపించే వైకల్య ధ్రువపత్రంతో బండారు అప్పలనరసమ్మ అనే అభ్యర్థి 2003 డీఎస్సీలో వికలాంగ కోటాలో ఉద్యోగం సంపాదించారు. ఆ మేరకు 2005లో కవిటి మండలం ఇద్దివానిపాలెం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా విధుల్లో చేరారు. వాస్తవానికి మనకున్న రెండు కళ్లలో ఒక కంటిచూపు పూర్తిగా కోల్పోతే 30 శాతం వైకల్యం ఉన్నట్లే ధ్రువీకరించాలి. కానీ అప్పలనరసమ్మ 40 శాతం దృష్టిలోపం ఉన్నట్లు ధ్రువపత్రం సంపాదించి, ఉద్యోగం కొట్టేశారని తెలిసింది. ఈ విషయం తెలిసిన ఇతర అభ్యర్థులు ఆమెపై అప్పటినుంచీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి వివరణ ఇవ్వాలని ఆమె ముత్యాలపేటలో పని చేసిన సమయంలో అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న తమ్మయ్యను ఉన్నతాధికారులు ఆదేశించినా ఆయన మాత్రం ఆమెనే వెనకేసుకచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ 2020లో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అప్పలనరసమ్మతోపాటు జిల్లాలోని టెక్కలి, పాతపట్నం, మెళియాపుట్టి తదితర మండలాల్లో తప్పుడు వైకల్య ధ్రువపత్రాలతో పలువురు టీచర్ ఉద్యోగాలు వెలగబెడుతున్నారంటూ జిల్లా వికలాంగుల సంఘం ప్రతినిధులు అప్పట్లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కదిలిన విద్యాశాఖ అధికారులు ముత్యాలపేట జెడ్పీ హైస్కూల్లో పని చేస్తున్న బండారు అప్పలనరసమ్మపై విచారణకు సిద్ధమయ్యారు.
విచారణాధికారి నిర్థారించినా..
ఆ మేరకు 2021 ఆగస్టు 18న జరిపిన విచారణకు ఫిర్యాదుదారులు రాలేదనే సాకు చూపించి విచారణను అక్కడితో ముగించేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు తాను నిర్దోషిని నిరూపించుకోవాల్సిన బాధ్యత విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిదే. కానీ దానికి విరుద్ధంగా ఫిర్యాదు చేసిన వారు రాలేదు కనుక విచారణే అవసరం లేదన్న ధోరణితో విద్యాశాఖ అధికారులు వ్యవహరించారు. ఏదైనా ఫిర్యాదుపై జరిపేటప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితోపాటు ఫిర్యాదుదారులకు కూడా నోటీసులు ఇచ్చి ఫలానా రోజు జరిగే విచారణలో వాస్తవాలు చెప్పడానికి రావాలని విచారణాధికారులు కోరుతుంటారు. కానీ అప్పలనరసమ్మ కేసులో అభ్యంతరాలు తెలపడానికి వచ్చిన ఫిర్యాదుదారుడిని విచారణ జరుగుతున్న కార్యాలయంలోకి అనుమతించలేదు. మరోవైపు విచారణ ఎదుర్కొంటున్న అప్పలనరసమ్మ భర్త గ్రామస్తులను కూడదీసి విచారణ జరగకుండా చేసేందుకు పాఠశాల వద్ద పెద్ద రచ్చే చేశారని ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ కమిషనరేట్ స్వయంగా విచారణకు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పలనరసమ్మ విచాంణాధికారిగా వచ్చిన డిప్యూటీ డీఈవో వాసుదేవరావు ఎదుట హాజరయ్యారు. కాగా అప్పలనరసమ్మ వికలాంగుల కోటాలో ఉద్యోగం పొందినట్లు ఆమె సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయని విషయాన్ని విచారణాధికారి గుర్తించారు. వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అలవెన్సులు కూడా తీసుకోవడం లేదని గుర్తించారు. తన వైకల్యంపై అప్పలనరసమ్మ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక ఇచ్చారు. వైకల్యాన్ని మరోసారి నిర్ధారించేందుకు ఆమెకు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొన్నారు.
వైద్యపరీక్షల పేరుతో తాత్సారం
అప్పలనరసమ్మ వైకల్యాన్ని నిర్ధారించడానికి మరోసారి వైద్య పరీక్షలు చేయించాలని డిప్యూటీ డీఈవో వాసుదేవరావు చేసిన సూచనను జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. అప్పట్లో డీఈవోగా ఉన్న పగడాలమ్మ ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పలనరసమ్మకు వైద్య పరీక్షలు చేయాలని సూచిస్తూ వైద్యఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాయకుండా సుమారు నాలుగు నెలలు జాప్యం చేశారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పగడాలమ్మ తర్వాత డీఈవోగా వచ్చిన రామలింగేశ్వర్ స్పందించి 2021 డిసెంబరు 12న, 2022 మార్చి 29న శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రి (రిమ్స్) వైద్యాధికారులకు రెండుసార్లు లేఖలు రాసినా వారు స్పందించలేదు. అలాగే తన వైకల్యాన్ని నిర్థారించుకునేందుకు అప్పలనరసమ్మ కూడా ప్రయత్నించలేదు. రిమ్స్ అధికారుల తీరుపై ఫిర్యాదులు రావడంతో ఈ కేసును విశాఖపట్నంలోని రీజనల్ కంటి ఆస్పత్రికి ఉన్నతాధికారులు రిఫర్ చేశారు. కానీ అప్పలనరసమ్మ అక్కడ వైద్యపరీక్షలకు సకాలంలో హాజరుకాకపోవడంతో ఆమెపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో 2022 నవంబరు 30న విశాఖపట్నంలోని రీజనల్ కంటి ఆస్పత్రిలో వైద్యపరీక్షలకు హాజరుకాక తప్పలేదు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యనిపుణుల బృందం 30 శాతం మాత్రమే వైకల్యం ఉందని నిర్ధారిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక సమర్పించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పలనరసమ్మ మరోసారి తనకు వైద్య పరీక్షలు చేయించాలని అర్జీ పెట్టుకోగా సానుకూలంగా స్పందించిన అధికారులు ఆమెకు మళ్లీ వైద్యపరీక్షలు చేయాలని రీజనల్ కంటి ఆస్పత్రికి మరో లేఖ రాశారు. ఆ మేరకు 2023 మార్చి ఒకటో తేదీన వైద్య పరీక్షలు చేసి అప్పలనరసమ్మకు 30 శాతమే దృష్టిలోపం ఉందని రెండోసారీ నిర్ధారించారు. అప్పటికీ అప్పలనరసమ్మ అసంతృప్తి వ్యక్తం చేయడంతో చివరిసారిగా 2023 మే ఎనిమిదో తేదీన ఆమెకు 30 శాతానికి మించి దృష్టిలోపం లేదని నిర్ధారిస్తూ రీజనల్ కంటి ఆస్పత్రి సూపరెంటెండెంట్ మరో నివేదిక ఇచ్చారు. ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు ఒక్కసారి అవకాశం ఇచ్చి మెడికల్ బోర్డుతో నిర్ధారణ పరీక్షలు చేయిస్తే సరిపోతుంది. కానీ విద్యాశాఖ అధికారులు అప్పలనరసమ్మ విషయంలో ఏకంగా మూడుసార్లు పరీక్షల పేరుతో ఏడాదిపాటు కాలయాపన చేశారు. ఈ సమయంలో ఆమె నుంచి భారీగా దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి నివేదిక వ్యతిరేకంగా వచ్చి నెలలు గడుస్తున్నా అప్పలనరసమ్మపై చర్యలకు పూనుకోలేదు. ఇదే విషయమై ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు అందడంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత తీరిగ్గా స్పందించిన జిల్లా అధికారులు నియామకం సమయంలో అప్పలనరసమ్మ సమర్పించి వికలాంగ ధ్రువపత్రం సరైనదో, కాదో నిర్థారించాలని కోరుతూ మళ్లీ విశాఖపట్నంలోని రీజనల్ కంటి ఆస్పత్రి అధికారులకు లేఖలు రాయడం విస్మయం కలిగిస్తోంది. 2001, 2003 డీఎస్సీల్లో నకిలీ వికలాంగ ధ్రువప్రతాలతో ఉద్యోగాలు పొందిన ట్లు నిర్ధారణ కావడంతో విజయనగరం జిల్లాలో నలుగురిని 2007లోనే విధుల నుంచి టెర్మినేట్ చేశారు. కానీ ఈ జిల్లాలో అప్పలనరసమ్మకు మాత్రం విద్యాశాఖ అధికారులు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.
Comments