కేబీసీ వేదికగా అందరినీ కదిలించిన నరేషి మీనా
వైద్యం ఖర్చులు.. ఆపై ఐఏఎస్ లక్ష్యసాధనకు ప్రయత్నం
రూ.50 లక్షలే గెలుచుకున్నా.. పోరాటంలో విజయం
వైద్యఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చిన అమితాబ్

ఐఏఎస్ కావాలన్నది ఆమె కల. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తన కల సాకారం చేసుకునేందుకు సొంత తెలివినే నమ్ముకుంది. ఉన్నత చదువులు చదివి ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. కానీ అనుకోని అవాంతరం ఆమె లక్ష్యానికి అడ్డుగా నిలిచింది. మెదడులో పెద్ద కణితి(గడ్డ) ఏర్పడిరది. ఆ అడ్డంకిని అధిగమించేందుకు సర్జరీ చేయించుకున్నా సరిపోలేదు. మరింత ఉన్నత వైద్యం అవసరం. దానికి చాలానే ఖర్చు అవుతుంది. దాంతో వైద్యానికి అవసరమైన డబ్బును తానే సంపాదించాలనుకుంది. అప్పటికే కణితితో భారంగా మారిన మెదడుకే పని చెప్పింది. సాధారణంగా తలనొప్పి వస్తేనే తట్టుకోలేం. అలాంటిది మెదడులో కణితితో నిరంతరం బాధపడుతున్నా.. లెక్క చేయకుండా లక్ష్యసాధన కోసం బుర్రకు పదును పెట్టాల్సిన క్విజ్ షోను ఆశ్రయించింది. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేకపోయినా.. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ మనసును కదిలించ గలిగింది. ఆమె వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును భరించేందుకు అమితాబ్ ముందుకొచ్చేలా చేయడంలో విజయం సాధించింది. ఆ యువతి పేరే నరేషి మీనా. రాజస్థాన్‌కు చెందిన ఈమె ఎదుర్కొంటున్న కష్టం. దాన్ని అధిగమించి, తన కలలు సాకారం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం యావత్తు యువతకు స్ఫూర్తి మంత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం యువతకు ఇచ్చిన సందేశం. కానీ చాలామంది జీవితంలో ఎన్నో సాధించాలని కలలుగంటారు.. కానీ వాటిని సాధించే ప్రయత్నంలో చిన్నపాటి అవరోధాలు ఏర్పడితే చాలు చతికిలపడిపోతారు. ఏ ప్రయత్నమూ ఫలించడం లేదని ఒత్తిడికి లోనైపోతారు. నిరాశ నిస్పృహలతో కుంగిపోతారు. ఇటువంటి వారందరికి తాను భిన్నమైన దాన్నని నరేషి మీనా నిరూపించారు. అబ్దుల్ కలాం నినాదాన్నే అందిపుచ్చుకుని తన జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ పోరాటంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, తీవ్ర అనారోగ్య సమస్యలు అడ్డొచ్చినా వాటిని కూడా సొంతంగానే అధిగమించేందుకు ఆమె చేసిన ప్రయత్నం కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ కదిలిస్తోంది. భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యధిక జనాదరణ పొందిన కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలిచే కేబీసీ 16వ సీజన్ కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభమై కొనసాగుతోంది. సోనీ టీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి మెదడుకు మేతతోపాటు భారీ ప్రైజ్ మనీ అందుకుని ఆర్థిక లక్ష్యాలను సాధించుకునే అవకాశం లభిస్తుంది. నరేషి మీనా కూడా తన ఆరోగ్య సమస్య, జీవిత లక్ష్యం సాధించుకునేందుకు కేబీసీనే వేదికగా ఎంచుకుంది. కార్యక్రమ వ్యాఖ్యాత అమితాబ్ ముందు హాట్ సీట్‌లో కూర్చోవడమే కాకుండా 16వ సీజన్‌లో కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కొన్న తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది. కానీ రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పే విషయంలో తడబడి రూ.50 లక్షలతోనే నిష్క్రమించింది. అయితేనేం.. తాను అనుకున్నది సాధించగలిగింది. రూ.50 లక్షలతోపాటు తన చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును భరించేలా అమితాబ్ నుంచి వరం అందుకుంది.
ఎవరీ నరేషి మీనా?
సాధారణ కుటుంబానికి చెందిన నరేషి మీనా స్వగ్రామం. రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాథోపూర్. తండ్రి సాధారణ రైతు, తల్లి గృహిణి. బాగా చదువుకొని కలెక్టర్ కావాలన్నది మీనా కల. అందుకోసం కష్టపడి చదివేది. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే తొమ్మిదో తరగతి వరకు చదివిన తర్వాత సవాయ్ మాధోపూర్‌లో 12వ తరగతి, అక్కడే 2017లో బీఏ పూర్తి చేసింది. అనంతర పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. తర్వాత ముందు ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకుంటూనే ఐఏఎస్(సివిల్స్) కావాలన్న లక్ష్యసాధనకు ప్రిపేర్ అయ్యేది. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని మహిళా సాధికారత విభాగంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తోంది. ఓసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మందులు వాడినా తగ్గలేదు. అదే సమయంలో 2018లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. తీవ్రమైన తలనొప్పిని భరిస్తూనే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. అనంతరం రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నిర్వహించే వైద్య పరీక్షలకు వెళ్లినప్పుడు తన తలనొప్పికి కారణమేంటో తెలిసింది. మెదడులో కణితి ఉందని వైద్యపరీక్షల్లో తేలింది. సర్జరీ చేసి దాన్ని తొలగించాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కానీ కుమార్తె ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఆలోచించారు. ఇంట్లో ఉన్న నగలు అమ్మి 2019లో సర్జరీ చేయించారు.
సమస్యను పరిష్కరించని సర్జరీ
అయితే సర్జరీతో ఆమె ఆరోగ్య సమస్య పరిష్కారం కాలేదు. పైగా మరింత చిక్కుల్లో పడేసింది. మెదడులోని సున్నిత భాగంలో కణితి ఉండటం వల్ల సర్జరీ ద్వారా దాన్ని డాక్టర్లు పూర్తిగా తొలగించలేకపోయారు. ఇంకా పావు వంత కణితి ఉండిపోయింది. మెదడుకు దెబ్బతగలకుండా దాన్ని పూర్తిగా తొలగించాలంటే ప్రోటాన్ థెరపీ చేయించాలని, దానికి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దాంతో మీనాతోపాటు ఆమె కుటుంబీకులు హతాశులయ్యారు. అంత డబ్బు సమకూర్చే పరిస్థితి లేదు. దాంతో మీనా కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రలు అన్నలు ఆమెకు ధైర్యం చెబుతూ అండగా నిలిచారు. ఓవైపు తలనొప్పి.. మరోవైపు రూ.30 లక్షల అవసరం.. ఇంకోవైపు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి మరింత భారం కాకూడదన్న ఉద్దేశంతో డిప్రెషన్‌ను తట్టుకుని మీనా సూపర్‌వైజర్ ఉద్యోగంలో చేరింది.
ఆశలు రేపిన కేబీసీ
ఉద్యోగం చేస్తూనే తన చికిత్సకు డబ్బు గురించి ఆలోచిస్తూ.. మరోవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న మీనాకు కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఆశలు రేపింది. తన కోచింగ్ సెంటర్ టీచర్ ప్రేరణతో కేబీసీలో పాల్గొనాలన్న ఆలోచన కలిగింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తాను కేబీసీలో అడిగే ప్రశ్నల్లో చాలావాటికి సమాధానం చెప్పగలనన్న నమ్మకం కలిగింది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసి కంటెస్టెంట్‌గా ఎంపికైంది. తన ప్రతిభతో హాట్‌సీట్‌లోనూ కూర్చోగలిగింది. హాట్ సీట్‌కు చేరుకున్న వారికి ప్రశ్నలు సంధించే ముందు వారి పూర్తి వివరాలను కార్యక్రమ ప్రయోక్త అమితాబ్ తెలుసుకుంటుంటారు. ఆ క్రమంలోనే నరేషి మీనా ఆరోగ్య సమస్య, స్ఫూర్తిదాయక ప్రయత్నాల గురించి ఆమె ద్వారానే తెలుసుకుని అమితాబ్ చలించిపోయారు. తన చికిత్సకు అవసరమైన డబ్బు సమకూర్చుకునేందుకే తాను కేబీసీకి వచ్చినట్లు మీనా చెప్పడంతో కదిలిపోయారు. షోలో ఆమె గెలిచినా గెలవలేకపోయినా చికిత్సకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని సూపర్‌స్టార్ ముందే హామీ ఇచ్చారు. అనుకున్నట్లే మీనా ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రూ.50 లక్షల టార్గెట్ ఛేదించింది. ఆ తర్వాత అమితాబ్ రూ.కోటి ప్రశ్నను సంధించారు. వింబుల్డన్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో లీలారావు దయాళ్ ఎవరిని ఓడిరచి ఛాంపియన్‌షిప్ సాధించారన్న ఆ ప్రశ్నకు మీనా సమాధానం చెప్పలేక రూ.50 లక్షలతోనే షో నుంచి క్విట్ అయిపోవాల్సి వచ్చింది. అయితే తాను ముందే ఇచ్చిన హామీ ప్రకారం వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తానని, కేబీసీ ద్వారా వచ్చిన రూ.50 లక్షలను ఐఏఎస్ కల సాధించుకోవడానికి, ఇతరత్రా అవసరాలకు వాడుకోవాలని అమితాబ్ మీనాకు సూచించి తన పెద్దమనసును చాటుకున్నారు.
Comments