ఆయన ఉంటే.. కప్ గెలిచినట్టే!
- DV RAMANA

- Jun 1
- 2 min read
ఆస్ట్రేలియన్ క్రికెటర్ హెజెల్‌వుడ్‌ది లక్కీహ్యాండ్
జట్టు ఫైనల్ చేరితే చాలు.. విజయం ఖాయం
జోష్ చేరికతోనే ఆర్సీబీకి రెండు వరుస ఐపీఎల్ టైటిళ్లు
ఈ జాబితాలో రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్‌లు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
భారతీయ సమాజంలో సెంటిమెంట్లు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇటువంటి విశ్వాసలకు ఉన్నప్పటికీ మనకు ఉన్నంత ఎక్కువ సెంటిమెంట్లు ఇంకెక్కడా కనిపించవు. ఆయన హస్తవాసి మంచిదని అంటూ కొందరు ఏ రుగ్మత వచ్చినా ఒకే వైద్యుడి దగ్గరకు వెళ్తుంటారు. అలాగే ఇంకొందరు ఇంట్లో అడుగుపెడితే అరిష్టమని భావించి దూరం పెడుతుంటారు. సామాన్య ప్రజల్లోనే కాదు.. సెలబ్రిటీలు చెలామణీ అయ్యేవారు ఉండే రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాల్లోనూ సెంటిమెంట్లకు కొదవలేదు. ఇంకా చెప్పాలంటే జనసామాన్యానికంటే సోకాల్డ్ సెలబ్రిటీలే సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతూ.. ఆ ప్రకారమే తమ కదలికలు ఉండేలా చూసుకుంటుంటారు. క్రికెట్‌రంగం దీనికి మినహాయింపు కాదు. దీనికి సంబంధించి గతంలోకి వెళ్తే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. అంతెందుకు ఆదివారం రాత్రి ముగిసిన ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ టోర్నీ అయిన టాటా ఐపీఎల్ టోర్నీ విజేత విషయంలోనూ ఇటువంటి ఒక సెంటిమెంటే ఈ టోర్నీ కొనసాగుతున్న సమయంలో ప్రచారంలోకి వచ్చింది. ఆ సెంటిమెంట్ నిజమేనని తుది ఫలితం ద్వారా వెల్లడైంది కూడా. ఇంతకీ ఆ సెంటెమెంట్ ఏమిటంటే.. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా క్రికెటర్ జోష్ హెజెల్‌వుడ్ లక్కీ క్రీడాకారుడని, అతనిది గోల్డెన్ హ్యాండ్ అన్న విశ్వాసం క్రికెట్ ప్రపంచంలో ఉంది. ఆయన సభ్యుడిగా ఉండే జట్టు ఒకవేళ ఫైనల్‌కు చేరితే మాత్రం ఆ జట్టు విజేతగా నిలవడం, కప్పును ముద్దాడటం ఖాయమని క్రికెట్‌వర్గాల్లో ఒక బలమైన అభిప్రాయం ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ తుదిపోరులో అది రుజువైంది కూడా. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు విజయం సాధించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టోర్నీలో జెండా ఎగురవేసింది.
తొలి నుంచీ అదే వరస
హెజెల్‌వుడ్ ప్రాతినిధ్యం వహించిన జట్లు విజయం సాధించి టైటిల్ విజేతలుగా నిలవడం ఒకటిరెండుసార్లక పరిమితం కాలేదు. ఇలా జరగడం ఇది ఏకంగా ఏడోసారి. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడటం మొదలుపెట్టినప్పటినుంచీ ఇలాగే జరుగుతున్నది. 2010 జూన్‌లో 19 ఏళ్ల వయసులో వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హెజెల్‌వుడ్ 2013 ఫిబ్రవరిలో టీ20 క్రికెట్‌లోకి ప్రవేశించాడు. కాగా ఆయన సభ్యుడిగా ఉన్న జట్టు ఫైనల్‌కు చేరితే చాలు.. విజేతగా నిలిచే సంప్రదాయం 2012లో మొదలై నిన్నటి ఐపీఎల్ వరకు కొనసాగింది. వీటిలో ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌లు కూడా ఉండటం విశేషం. అదెలాగో చూద్దాం.
2012లో జరిగిన ఆస్ట్రేలియాకు చెందిన ఛాంపియన్స్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నీలో హెజెల్‌వుడ్ సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫైనల్‌లో ఆ జట్టు హైవెల్డ్ లయన్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హెజెల్‌వుడ్ సభ్యుడిగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు న్యూజీలాండ్‌పై నెగ్గి కప్ ఎగరేసుకుపోయింది.
2021 ఐపీఎల్ టోర్నీలో చైన్నె సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించగా ఆ జట్లు ఫైనల్ విజేతగా ఆవిర్భవించింది.
అదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సొంత దేశం ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిగా ఆ జట్లు న్యూజీలాండ్‌ను ఓడించి కప్ అందుకుంది.
2023 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలోనూ ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా భారత్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.
2025 ఐపీఎల్(18వ సీజను)లో తొలిసారి ఆర్సీబీ ఫ్రాంఛైజీకి హెజెల్‌వుడ్ ప్రాతినిధ్యం వహించాడు. దాంతో 17 ఏళ్లుగా టైటిల్ కోసం మొహం వాచిన ఆర్సీబీ దశ తిరిగింది. అనూహ్యంగా ఆ జట్టు విజయాల బాటలోకి వచ్చి తొలి టైటిల్ అందుకుంది. అక్కడితో ఆగకుండా ఈ సీజను(2026)లో కూడా గెలుపొందింది.
మంచి ఆల్‌రౌండర్
సభ్యుడిగా ఉన్నంత మాత్రాన ఒక క్రికెటరే జట్టు విజయాలకు కారకుడని చెప్పడం సమంజసం కాదు. బృంద క్రీడ అయిన క్రికెట్‌లో సమష్టి కృషితోనే విజయం సాధ్యం. జట్టులో ఉన్న సభ్యులపై పాజిటివ్ వైబ్ ఉంటే.. జట్టు ఆటతీరుపైనా సానుకూల ప్రభావం పడుతుంది. ఆ కోణంలో చూసినా హెజెల్‌వుడ్ ఏ జట్టులో ఉన్నా విలువైన ఆటగాడిగానే పరిగణించాల్సి ఉంటుందని క్రీడా నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన హెజెల్‌వుడు అటు బాల్‌తోనూ, ఇటు బ్యాట్‌తోనూ ప్రభావం చూపగలడు. ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ చెప్పినట్లు కూల్‌గా ఉండే హెజెల్‌వుడ్ ఒత్తిడిలోనూ క్లియర్‌గా ఆలోచిస్తాడు. ఏ బ్యాటర్‌కు ఏ బాల్ వేయాలో సరిగ్గా అంచనా వేయగలడు. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన ఈ ఆటగాడు తాను ఆడిన దాదాపు అన్ని ఫైనల్ మ్యాచ్‌లలోనూ వికెట్లు పడగొట్టడమే కాకుండా తమ జట్టు ఇన్నింగ్స్‌లో చివరిలో వచ్చి వేగంగా కొన్ని పరుగులు జత చేయడం ద్వారా తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.






Comments