top of page

ఆయన చెప్పినట్లే.. ఆడిట్‌ ఆట!

Writer: ADMINADMIN
  • `స్టేట్‌బ్యాంక్‌ శ్రీకాకుళం రీజియన్‌లో తనిఖీలు తూతూ మంత్రమే

  • `నచ్చిన బ్రాంచిలకు డబుల్‌`ఎ గ్రేడ్‌

  • `మార్ట్‌గేజ్‌ లేకుండానే ఇంటి రుణాల మంజూరు

  • `జోనల్‌ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళం రీజనల్‌ మేనేజర్‌గా పని చేసిన టీఆర్‌ఎం రాజు బ్యాంకును సొంత కిరాణా కొట్టు కంటే దారుణంగా వాడేసుకున్నారు. నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణాన్ని ‘సత్యం’ పత్రిక వెలుగులోకి తెచ్చిన తర్వాత గాలిలో ఉన్న టీఆర్‌ఎం రాజును ప్రస్తుతం విశాఖపట్నం జోనల్‌ కార్యాలయంలో విచారిస్తున్నారు. బ్యాంకు నిబంధనల ప్రకారం ఈయన్ను బదిలీ చేయాలా? సస్పెండ్‌ చేయాలా? క్రిమినల్‌ కేసు పెట్టాలా? అని బ్యాంకు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టు భోగట్టా. శ్రీకాకుళం రీజియన్‌లో టీఆర్‌ఎం రాజు ఆడిరదే ఆట, పాడిరదే పాట అన్నట్లు బ్యాంకులను తయారుచేశారు. చివరకు ఎస్‌బీఐ బ్రాండ్‌ ఇమేజ్‌ను భ్రష్టుపట్టించేసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడానికి ఏకంగా కొన్నింటికి సూపర్‌గ్రేడ్‌ బ్రాంచిలుగా గుర్తింపునిస్తూ తన చేతకానితనం, ఆశ్రిత పక్షపాతం బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఇప్పుడు రాజును శ్రీకాకుళం నుంచి తప్పించడంతో ఒక్కో అంశం వెలుగులోకి వస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తన అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని స్టేట్‌బ్యాంకు పరిధిలో చేయిస్తే సంబంధిత రీజనల్‌ మేనేజర్‌ ఖాతాకు పది శాతం కమీషన్‌ వెళ్తుంది. దాంతో ఈ కమీషన్‌ కోసం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఎక్కువగా చేయించిన మేనేజర్లు పని చేస్తున్న ఎస్బీఐ బ్రాంచిలకు డబుల్‌`ఎ గ్రేడ్‌ ఇచ్చి ఆయా శాఖలు అద్భుతంగా పని చేస్తున్నాయంటూ ఉన్నతాధికారులను ఆర్‌ఎం రాజు మభ్యపెట్టారు. వాస్తవానికి ఒక బ్యాంకుకు డబుల్‌`ఎ గ్రేడ్‌ రావాలంటే అక్కడ 100 శాతం గ్రోత్‌ (డిపాజిట్లు, లోన్ల మంజూరు) ఉండాలి. అలాగే రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక్క శాతం కూడా డీవియేషన్‌ ఉండకూడదు. చివరికి ఆ బ్రాంచి పరిధిలోని ఖాతాదారుకు పోస్టులో పంపిన ఏటీఎం కార్డు నిర్దేశించిన సమయానికి రాలేదన్న ఫిర్యాదు కూడా ఉండకూడదు. సహజంగా కస్టమర్‌ ఫిర్యాదు లేని బ్యాంకు బ్రాంచి అంటూ ఉండదు. కానీ సంబంధిత బ్రాంచి మీద ఎటువంటి ఫిర్యాదు వచ్చినా తన వద్దే తొక్కిపెట్టేసిన ఆర్‌ఎం రాజు తన సేవలో తరించే మేనేజర్లు ఉన్న బ్రాంచిలకు మాత్రం డబుల్‌`ఎ గ్రేడ్‌ ఇచ్చారు. ఇలా ప్రమోషన్‌ పొందిన వాటిలో కాశీబుగ్గ, హరిపురం, ఒప్పంగి బ్రాంచిలు కూడా ఉన్నాయి. మరీ విచిత్రంగా సీ గ్రేడ్‌లో స్థానిక జిల్లాపరిషత్‌ బ్రాంచికి నేరుగా ఎ`గ్రేడ్‌ ఇచ్చి ఆర్‌ఎం రాజు బ్యాంకు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు.

తప్పనిసరి తంతుగా ఆడిటింగ్‌

గార ఎస్‌బీఐ బ్రాంచిలో తాకట్టులో ఉన్న బంగారం ప్రైవేటు బ్యాంకులకు తరలిపోయినా ఆడిట్‌కు వచ్చిన అధికారులు మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నాయని రిపోర్టు ఇవ్వడం వెనుక ప్రధాన కారణం.. రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజే. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఆడిట్‌ చేయాలి. అలాగే రీజియన్‌ పరిధిలోని 1/5వ వంతు బ్రాంచిలకు ప్రతి ఏడాది ఆడిట్‌ నిర్వహించి లోటుపాట్లు గుర్తించాలి లేదా క్లీన్‌చిట్‌ అయినా ఇవ్వాలి. కానీ ఆర్‌ఎంగా రాజు ఇక్కడ పని చేసిన రెండేళ్ల వ్యవధిలో ఆడిటింగ్‌ అంతా తూతూ మంత్రంగానే జరిగింది. ఎందుకంటే.. అనేక బ్రాంచిల్లో హౌసింగ్‌ లోన్లు, గోల్డ్‌ లోన్లను ఆర్‌ఎం తన సొంతానికే వాడుకున్నారు. ఆ కుట్రలో భాగంగానే గార బ్రాంచిలో స్వప్నప్రియను బలి చేశారు. వాస్తవానికి బ్యాంకు ఆడిట్‌కు వచ్చినవారు మొత్తం తనిఖీ చేసి రికార్డుల్లో ఉన్నవన్నీ ఫిజికల్‌గా ఉన్నాయా, లేదా అని చూస్తారు. కానీ వచ్చిన ఆడిటర్లకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా వారెవరూ లోతుపాతుల్లోకి వెళ్లకుండా రికార్డులు చూసి వెళ్లిపోయేలా ఆర్‌ఎం రాజు మేనేజ్‌ చేసేవారు. దీనికి సాక్ష్యాలు కావాలంటే ప్రతి నెలా ఆర్‌ఎం పరిధిలో ఛార్జెస్‌ రిపోర్టు చూస్తే తెలిసిపోతుంది. ఛార్జెస్‌ రిపోర్టు అంటే.. ఖర్చుల పద్దు. ఆడిట్‌కు ముందు ప్రతి నెలా ఖర్చు ఎంతయింది? ఆడిట్‌ తర్వాత ఎంత ఉంది? ఆడిట్‌ జరిగిన సమయంలో ఎంత ఖర్చయింది? ఓచర్లు తీసి పరిశీలిస్తే ఆడిట్‌కు వచ్చినవారికి ఆర్‌ఎం రాజు ఎలా చూసుకునేవారో అర్థమవుతుంది. ప్రతినెలా అయ్యే సాధారణ ఖర్చు కంటే ఆడిట్‌ సమయంలో లక్ష రూపాయల ఎక్కువ ఖర్చు చూపించేవారు. వాస్తవానికి ఆడిట్‌కు వచ్చేవారికి అన్నం కూడా పెట్టాల్సిన అవసరంలేదు. ఈ ఖర్చులు బ్యాంకు మేనేజ్‌మెంటే ఇచ్చుకుంటుంది. కానీ ఆర్‌ఎం వారిని మేనేజ్‌ చేయడానికి ఇలా బ్యాంకు డబ్బుల్ని ఖర్చు చేసేశారు. ఇప్పుడు రీజియన్‌ పరిధిలోని అనేక బ్రాంచీల్లో అవకతవకలు వెలుగుచూస్తుండటంతో రాజు పరిధిలో ఉన్న 49 బ్రాంచీల్లోనూ మొత్తం రీఆడిట్‌ చేయడానికి అధికారులు సిద్ధపడుతున్నారు. మరీ ముఖ్యంగా నరసన్నపేట బజారు బ్రాంచిలో ఇచ్చిన హౌసింగ్‌ లోన్ల మాదిరిగానే ఆయన పరిధిలో అనేక బ్రాంచిల్లో చేశారని, ఎటువంటి మార్ట్‌గేజ్‌ డాక్యుమెంట్లు సమర్పించకుండానే రాత్రికి రాత్రి చెక్కులు రాసేసి, దాని కమీషన్‌ను ఏజెంట్‌ ఖాతాలో వేసేసి, ఆ సొమ్మును దిగమింగేసే విధానంపై విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page