top of page

ఆయన పెత్తనం అ‘విశ్రాంతం’

Writer: NVS PRASADNVS PRASAD
  • `రిటైరై పదేళ్లయినా ఆచారే బీసీ శాఖలో అనధికారి

  • `అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఉద్యోగులపై జులుం

  • `ఆయన చెబితేనే ఫైళ్లకు మోక్షం, ప్రమోషన్లు

  • `జిల్లా అధికారి, మరికొందరి వత్తాసుతోనే ఆగడాలు

  • `తనపై విచారణ జరిపిన అధికారులనూ బ్లాక్‌మెయిల్‌ చేసే ఘనుడు

బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డెన్ల అధికారిక వాట్సప్‌ గ్రూపులో జిల్లా అధికారులతో పాటు ఆయనా ఒక సభ్యుడు. జిల్లా బీసీ సంక్షేమాధికారిణి వార్డెన్ల మీటింగ్‌ కాల్‌ఫర్‌ చేయాలన్నా, డైట్‌ బిల్లులు వంటి సమర్పించాలని చెప్పాలన్నా ఆచారి అనే ఈ సభ్యుడే గ్రూప్‌లో మెసేజ్‌లు పెట్టాలి. చివరికి ప్రభుత్వం పంపించే జీవో కాపీలను సర్క్యులేట్‌ చేయడంతోపాటు డీబీసీ, సహాయ బీసీ సంక్షేమ అధికారులు ఇవ్వాల్సిన ఆదేశాలను సైతం ఆచారే ఇచ్చేస్తున్న పరిస్థితి. ఇన్ని చేసేస్తున్న సదరు ఆచారి జిల్లా బీసీ సంక్షేమాధికారిణి తర్వాత స్థాయిలోనో లేక హాస్టల్‌ వార్డెన్ల సంఘం అధ్యక్షుడిగానో ఉన్నారనుకుంటే బీసీ హాస్టల్‌ బాత్రూమ్‌లో కాలేసినట్టే. ఈయనగారు పదవీ విరమణ చేసిన ఒకానొక వార్డెన్‌ మాత్రమే. మరి అధికారిక కార్యకలాపాలతో సంబంధం ఏమిటనుకుంటున్నారా.. జిల్లా బీసీ సంక్షేమశాఖ అంటేనే అక్రమాల పుట్ట. ప్రభుత్వం బీసీ విద్యార్థులకు కేటాయించే బడ్జెట్‌లో తిలా పాపం తలా పిడికెడు పంచుకుంటారు. ఈ వ్యవహారాల్లో డీబీసీడబ్ల్యూవోగా ఎవరు పని చేసినా రింగ్‌మాస్టర్‌ మాత్రం ఆచారే. ఆయనే అందరి వాటాలూ వసూలు చేయడం, పంచడం చేస్తుంటారు. పదవీ విరమణ చేసినా ఇప్పటికీ ఆ శాఖలో ఈయన అధికారికంగానే జులుం ప్రదర్శిస్తుంటారు. కాదు కూడదు అని ఏ డీబీసీడబ్ల్యూవో అయినా ప్రశ్నిస్తే హౌరా మెయిల్‌ కంటే వేగంగా బ్లాక్‌మెయిల్‌ కోసం ఆర్‌టీఐ చట్టాన్ని వాడుకొని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. ఆచారి కోసం రాయని పత్రికలు లేవు, వెలుగుచూడని అక్రమాలూ లేవు. అయినా ఆయన ఇప్పటికీ ఆ శాఖలో తన మాట నెగ్గించుకుంటున్నాడంటే వ్యవస్థలో లోపమా? ఉన్నతాధికారుల పాపమా? అనేది మనమే తేల్చుకోవాలి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా బీసీ సంక్షేమాధికారి(డీబీసీడబ్ల్యూవో) విధి నిర్వహణనే నియంత్రించే విధంగా ఉద్యోగ విరమణ చేసిన ఆచారి ఇప్పటికీ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డీబీసీడబ్ల్యూవో అధికారికంగా ఇచ్చే అదేశాలు, పంపాల్సిన సర్క్యులర్లు, ఇతర సమాచారాన్ని ఆచారే అధికారిక వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా వార్డెన్లందరికీ చేరవేస్తున్నారు. వసతి గృహలకు చెందిన విద్యార్ధులు, ఇతర సమాచారాన్ని ఇవ్వాలని వాట్సాప్‌ గ్రూప్‌లో ఆచారే ఆదేశిస్తున్న పరిస్థితి శాఖలో కొనసాగుతోంది. బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌ నుంచి వచ్చే ఏ చిన్న సమాచారమైనా అధికారికంగా వాట్సప్‌లో ఆచారి సెండ్‌ చేస్తేగానీ వార్డెన్లకు తెలియదన్నట్టుగా పరిస్థితి తయారైంది. అంతలా ఆయన పాతుకుపోయారు. పదేళ్ల క్రితమే పదవీ విరమణ చేసినా రణస్థలం మండలం జీరుపాలెం బాలికల వసతి గృహం వార్డెన్‌గానే అధికారిక వాట్సప్‌ గ్రూపులో ఆచారిని కొనసాగిస్తున్నారంటే బీసీ సంక్షేమ శాఖపైన, ఆ శాఖ అధికారులు, ఉద్యోగులపైనా ఆచారి ఎంత ప్రభావం చూపుతున్నారో అర్ధమవుతుంది. ఆచారి పేరు చెబితే చాలు శాఖాధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే బీసీ సంక్షేమ శాఖకు ఆయనే అనధికారిక బాస్‌. 2014 మే 31న వార్డెన్‌గా ఉద్యోగ విరమణ చేసినా ఇప్పటికీ ఆ శాఖను వీడకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసి పదేళ్లు పూర్తి అవుతున్నా జీరుపాలెం ప్రభుత్వ బాలికల వసతి గృహం, కొమరవానిపేట ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని అనధికారికంగా ఈయనగారే నిర్వహిస్తున్నారు.

అధికారులూ ఆయన బాధితులే

అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవల డీబీసీడబ్ల్యూవోపైనే ఎన్నికల కమిషన్‌కు ఆచారి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నెల రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న సంక్షేమాధికారిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో పాటు స.హ. చట్టం ద్వారా వివరాలు తీసుకొని బ్లాక్‌మెయిల్‌ చేసినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా ఆ ఫిర్యాదుల ఆధారంగా సదరు అధికారిని దారిలోకి తెచ్చుకుని వ్యవహారాన్ని సెటిల్‌ చేసినట్టు భోగట్టా. జిల్లా కార్యాలయంలోనే తిష్ట వేసి శాఖాధికారిని, వార్డెన్లను, కార్యాలయ ఉద్యోగులను, వసతి గృహాల సిబ్బందిని బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు పాల్పడుతూ ఎవరినీ కుదురుగా పని చేసుకోనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆయన చెప్పినట్టు చేయకపోతే అధికారులు, ఆఫీసు సిబ్బంది, వసతిగృహ సంక్షేమాధికారులపై ఏసీబీ, విజిలెన్స్‌, లోకాయుక్తలకు ఫిర్యాదులు చేసి వేధించడం నిత్యకృత్యంగా మారిపోయిందని ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ పని చేసిన శాఖాధికారులందరినీ బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటనలు ఉన్నాయి. ఆయన చేసిన అవినీతిపై విచారణ జరిపిన అధికారులపైనా ఫిర్యాదులు చేసి ముప్పతిప్పలు పెట్టిన ఘనత ఆచారికే సొంతం. వార్డెన్‌గా ఉన్నప్పుడు ఫోర్జరీ సంతకాలు చేసి లోకాయుక్త కేసులో బుక్కయి పెన్షన్‌, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు నిలిచిపోయిన తర్వాత సర్వీస్‌ రిజిస్టర్లను ఆచారి మాయం చేసినట్టు ఆరోపణలున్నాయి. విశ్రాంత సెకండరీ గ్రేడ్‌ వార్డెన్‌ ఆచారి చెప్పుచేతుల్లో బీసీ సంక్షేమశాఖ అధికారులు పని చేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆచారి ఉద్యోగ విరమణ చేసి పదేళ్లు గడిచినా ఆయన సలహా లేకుండా ఇప్పటికీ ఒక్క ఫైల్‌ ముందుకు కదలదన్న విమర్శ ఉంది. ఆచారి చెప్పిన ప్రకారమే పోస్టింగ్‌లు, డిప్యూటేషన్లు, ఉద్యోగుల సర్దుబాట్లు జరిగే పరిస్థితి ఇప్పటికీ జిల్లా బీసీ సంక్షేమశాఖలో కొనసాగుతోందని ఉద్యోగులే చెబుతున్నారు.

ఫిర్యాదులున్నా.. చర్యల్లేవు

జీరుపాలెం వసతి గృహానికి రెగ్యులర్‌ సంక్షేమ అధికారిగా ఉన్న ఒక వ్యక్తిని కొమరవానిపేటకు ఇన్‌ఛార్జిగా నియమించుకొని ఆయన పేరుతో ఆచారే పెత్తనం సాగిస్తున్నాడని ఆరోపణలున్నాయి. కోవిడ్‌ సమయంలో జిల్లాలోని అన్ని వసతి గృహాలు తెరచినా జీరుపాలెం, కొమరవానిపేట వసతి గృహాలను తెరవకుండానే డైట్‌ బిల్లుల మంజూరు చేయించుకున్న ఆచారి తన ఖాతాలో జమ చేయించినట్టు ఆరోపణలు ఉన్నారు. ఈ రెండు వసతి గృహాల నిర్వహణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా విచారణ పేరుతో కాలయాపన చేసి చర్యలు తీసుకోలేదు. అయితే ఆచారికి జిల్లా కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు సహకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జిల్లా కార్యాలయానికి వచ్చి వెళ్లేవారి వివరాలతో పాటు జిల్లా అధికారి సంతకం చేసే ప్రతి ఫైల్‌ వివరాలను, ఉద్యోగుల దినచర్యలను పూసగుచ్చినట్టు ఆచారికి చేరవేసే సిబ్బంది ఉన్నారు. ప్రమోషన్ల విషయంలోనూ ఆచారి జోక్యం చేసుకుంటున్నారని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆచారి అతి జోక్యం వల్ల ప్రమోషన్లు కోల్పోయిన అధికారులున్నారని విశ్వసనీయ సమాచారం. ఆచారిని శాఖ అధికారి, కార్యాలయం సూపరింటెండెంట్‌ వెనకేసుకు వస్తున్నారని విమర్శలున్నాయి. పలువురు మహిళా వార్డెన్లు కూడా ఆచారి బాధితులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page