ఆయిల్ కొరత లేదు.. అనుమానాలు తీరలేదు!
- Prasad Satyam
- Apr 28
- 2 min read
ఒక్కరోజులోనే 164 కి.లీ. పెట్రోలు, 210 కి.లీ. డీజిల్ అదనంగా విక్రయం
మంగళవారం అన్ని బంకులూ తెరుచుకున్నాయి
నాలుగు రోజులకు సరిపడా నిల్వలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఆయిల్ నింపుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, అన్ని బంకుల్లోనూ పెట్రోల్ ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఎంతమంది క్యూలో ఉన్నా అందరికీ కాస్త అటూఇటుగా ట్యాంకులు నింపుతుండటమే ఇందుకు నిదర్శనం. అయినా ఎందుకో జనాల్లో అనుమానాలు తీరడంలేదు. ఆదివారం మొదలైన ఈ మేనియో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం కూడా కొనసాగింది. వాస్తవానికి ఆదివారం రాత్రి నుంచి కొన్ని బంకులు, సోమవారం మరికొద్దిపాటి బంకుల్లో ఆయిల్ అయిపోయిన మాట వాస్తవం. అయితే శనివారం తీసిన డీడీలకు ఆయిల్ కంపెనీలు సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయిల్ ట్యాంకర్లు సరఫరా చేయడం మొదలుపెట్టాయి. దీంతో సోమవారం ఉదయం నోస్టాక్ బోర్డు పెట్టిన బంకులన్నీ సాయంత్రానికి తెరుచుకున్నాయి. మరీ సూటిగా చెప్పాలంటే.. ఈ సంక్షోభం తలెత్తనంత వరకు డీజిల్ కొరత అంతో ఇంతో ఉండేది. ఎప్ప్పుడైతే బంకుల్లో ఆయిల్ లేక మÖతబడుతున్నాయన్న ఫొటోలు అన్ని ప్రధాన పత్రికల్లోనూ ప్రచురితం కావడంతో సోమవారం నుంచి డీజిల్ కూడా జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆయిల్‌కు కొరత లేదని తేలింది. అయినా జనాల్లో అనుమానాలు నివృత్తి కాలేదు. బండిలో ఫుల్‌ట్యాంక్ కొట్టించి కూడా ఇంటిలో స్టాక్ పెట్టుకోవడం కోసం బాటిళ్లు నింపుకొనేవారు ప్రతీ బంకులోనూ కనిపిస్తున్నారు. ప్రభుత్వం బాటిళ్లకు, క్యాన్లకు ఆయిల్ ఇవ్వకూడదని ఆదేశాలిచ్చింది. కానీ డీజిల్‌కు సంబంధించి ఈ నిబంధన అమలుచేయడం కుదరదు. జనరేటర్లకు, వరికోత యంత్రాలకు, రొయ్యలు, చేపల చెరువుల్లో మోటార్లు నడవడానికి డీజిల్ అవసరం. వీరంతా ప్రతీ ఏరియాలోనూ ఒక నిర్దిష్టమైన బంకులో ఎప్పట్నుంచో ఖాతా నడుపుతుంటారు. అటువంటివారు క్యాన్లు పట్టుకొని వస్తే డీజిల్ ఇవ్వలేమని చెప్పడం కుదరదు. అందుకే అన్ని బంకుల్లోనూ వచ్చినోడు అడిగినంత నింపి పంపిస్తున్నారు. మంగళవారం నాటి లెక్కల మేరకు జిల్లాలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈలోగానే బంకు యాజమాన్యాలు ఆయిల్ కోసం డీడీలు తీస్తునే ఉంటాయి. 713 కిలోలీటర్ల పెట్రోలు, 734 కిలో లీటర్ల డీజిల్ నిల్వ ఉంది. అయినా ప్రజల్లో ఈ పేనిక్ సిండ్రోమ్ ఉండటం వల్ల బంకుల వద్ద ఎగబడుతున్నారు. అందుకే ప్రతీ బంకువద్ద ఒక వీఆర్వోను ఉంచుతున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ సోమవారం ప్రకటించారు. మరోవైపు అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలితే లోపలేస్తామన్నట్టు ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి కూడా హెచ్చరించారు. వేసవి కాలంలో ఆయిల్ అమ్మకాలు కొంతమేరకు తగ్గుతాయి. అదే సమయంలో మారుమÖల ప్రాంతాల్లో ఉన్న బంకులు తమ దగ్గర నిల్వ అయిపోతుందనుకున్న సమయంలోనే మళ్లీ కొనుగోలుకు డీడీలు తీస్తారు. ఎప్ప్పుడైతే నగరంలో ఆయిల్ ఎద్దడి పెరిగిందో గ్రామీణ ప్రాంతాల్లోని బంకులు కూడా ఇప్ప్పుడు ఆయిల్ ట్యాంకర్లు తెప్పించుకోవడం మొదలుపెట్టాయి. ఒక్క సోమవారమే 164 కిలోలీటర్ల పెట్రోలు, 210 కిలోలీటర్ల డీజిల్ అదనంగా విక్రయించారంటే జనాల్లో ఏమేరకు భయాందోళనలు ఉన్నాయో అర్థమవుతుంది. సోమవారం జిల్లావ్యాప్తంగా 29 బంకులు మూతపడగా, అదే రోజు సాయంత్రం 10 బంకులకు ఆయిల్ వచ్చింది. మిగిలిన 10 బంకులు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభించడం మొదలయ్యాయి. మధ్యాహ్నానికే పలుచబడిపోయింది. సాయంత్రానికి పెట్రోల్ సమస్య పూర్తిగా తీరుతుంది. ఇదిలా ఉండగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం పలు బంకులను తనిఖీ చేశారు. పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టించవద్దని బంకు యజమానులకు సూచించారు. అలాగే నిల్వలు 10 శాతానికి చేరగానే ఆర్డర్ పెట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు.






Comments