
(సత్యంన్యూస్, ఆమదాలవలస)
ఆమదాలవలస పోలీసు స్టేషన్ పరిధి గాజులకొల్లివలస దగ్గర ఉన్న ఆర్‌ఆర్ కాలనీలో డి.పద్మ (35) ఆదివారం రాత్రి హత్యకు గురైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా భవానీ మాలలో ఉన్న వ్యక్తి సంఘమేశ్వర కొండపైకి పరుగులు తీయడం గమనించిన పోలీసులు వెంబడిరచారు. ఇది గమనించిన వ్యక్తి పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయలయ్యాయి. కొండ ప్రాంతంలో దాక్కోడంతో చీకట్లో పోలీసులకు కనిపించలేదు. అతనే హత్య చేసి పారిపోయుంటాడని గమనించిన పోలీసులు ఆరా తీయగా ఆయన పేరు సురేష్ అని తెలుసుకున్నారు. మృతురాలితో సురేష్ సన్నిహితంగా ఉండేవాడని, వారిరువురి మధ్య వివాహేతర సంబంధం ఉండివుండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఆమె భర్త డి.క్రిష్ణ అనారోగ్యంతో మృతిచెందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు వర్తిస్తాయేమోమని సురేష్ మృతురాలిని రాజకీయ నాయకుల వద్దకు తీసుకువెళ్లి పరిస్థితులు వివరించేవాడని, అప్పటి నుంచి వారిరువురి మధ్య సాంగత్యం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. సురేష్ దొరికిన తర్వాత దర్యాప్తు జరిపి మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలు పద్మకు ఇరువురు కుమార్తెలు ఉన్నారు. వంశధార బాధితులైన తులగాంకు చెందిన క్రిష్ణ, పద్మలకు ప్రభుత్వం ఆర్‌ఆర్ కాలనీలో ఇంటిని కేటాయించింది. అప్పటి నుంచి తులగాం నిర్వాసితులు సంగమేశ్వర కొండ వద్ద ఆర్‌ఆర్ కాలనీలో ఉంటున్నారు. ఇరువురు కుమార్తెలతో ఇంటి వద్దే చిన్న కిరాణా షాపు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారి కుటుంబానికి ఆదాయాన్ని ఇచ్చే కొబ్బరి బొండాలు కొట్టే కత్తే ఆమెను చంపడానికి ఉపయోగించారు. ఆమదాలవలస ఎస్సై వెంకటేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామానంతరం శ్రీకాకుళం సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
تعليقات