top of page

ఆర్‌ఎం ఉచ్చులో స్వప్నప్రియే సమిధ!

Writer: ADMINADMIN
  • మిగతా నిందితులను వదిలేసి ఆమెనే ఇరికించారు

  • `కేసు వివరాలు పరిశీలిస్తే ఎన్నెన్నో ప్రశ్నలు

  • `సస్పెండ్‌ చేసిన తర్వాత లీవు.. చనిపోయిన తర్వాత ఫిర్యాదు

  • `సీసీ ఫుటేజ్‌లో మిగతా భాగాలన్నీ ఏమైనట్లు?

  • `మభ్యపెట్టి మేనేజ్‌ చేయడంలో దిట్ట ఆర్‌ఎం రాజు

స్టేట్‌ బ్యాంక్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద నిలబడి ఫొటో తీయించుకున్న ఈమె పేరు స్వప్నప్రియ. అయితే ఫొటో ఉంది గానీ.. ఆమె మాత్రం ప్రస్తుతం లేరు. గత ఏడాది నవంబరు 29న ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. గార ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతాదారులు కుదువ పెట్టిన 89 బంగారం బ్యాగులు మాయమయ్యాయని.. దానికి స్వప్నప్రియే సూత్రధారి అంటూ ఆమె చుట్టూ ఒక ఉచ్చు అల్లడంతో దాన్నుంచి ఎలా బయటపడాలో తెలీక ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు జైలుపాలయ్యారు. అసలు గార ఎస్‌బీఐలో 89 బంగారం బ్యాగుల మాయం వెనుక సూత్రధారే ఉన్నతాధికారి హోదాలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్నుంచి ఎలా బయటపడాలో తెలీక స్వప్నప్రియ చనిపోయింది. గార బ్యాంకులో కుంభకోణం వెలుగుచూసినప్పటినుంచి బ్యాంకు అప్పటి రీజనల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) టీఆర్‌ఎం రాజు పాత్రపై ‘సత్యం’ అనుమానం వ్యక్తం చేస్తునే ఉంది. అయితే అనేక బ్రాంచిల్లో దిగమింగిన సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్‌ చేసి టీఆర్‌ఎం రాజు, ఆయనకు కుడి ఎడమలుగా వ్యవహరించిన వారు తప్పించుకోగలిగారు. తనువు చాలించిన స్వప్నప్రియ కుటుంబ సభ్యులు మాత్రమే తాము ఏ నేరమూ చేయలేదంటూ జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధికకు స్వప్నప్రియ మొబైల్‌ ఫోన్‌తో పాటు అన్ని ఆధారాలనూ అందించి అరెస్టయిపోయారు. కానీ ఈ కేసులో అసలు సూత్రధారులు టీఆర్‌ఎం రాజుతో పాటు ఆయన చెప్పినట్టల్లా ఆడే ఫీల్డ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావులే. వారి తీరుకు సంబంధించి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలెన్నో ఎదురవుతున్నాయి.
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అసలు గార ఎస్‌బీఐలో ఏం జరిగింది? బ్యాంకులో కుదువ పెట్టిన బంగారం విడిపించుకోవడానికి వెళ్లిన ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది సాకులు చెప్పి పంపేయడంతో గత ఏడాది నవంబరు 24న మొదటిసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ అదే నెల 28న అప్పటి రీజనల్‌ మేనేజర్‌ రాజు మూడు నెలలకోసారి నిర్వహించే తనిఖీల కారణంగా కుదువ పెట్టిన ఆభరణాలు ఖాతాదారులకు అందజేయలేకపోతున్నామని, దీనిపై వదంతులను నమ్మవద్దని స్వయంగా బ్యాంకు బయటకు వచ్చి మీడియాకు, స్థానికులకు చెప్పారు. రిఫరెన్స్‌ కావాలంటే నవంబరు 28 మంగళవారం 2023 నాటి ఈనాడు పత్రికను చూడొచ్చు. బ్యాంకులో బంగారం మాయం కాలేదని చెప్పిన టీఆర్‌ఎం రాజు.. స్వప్నప్రియ చనిపోయిన తర్వాత మాత్రమే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యలో ఏం జరిగింది? నవంబరు 24న ఈ వ్యవహారం పత్రికలకు తెలిసిపోయిందని బంగారం దొంగలంతా టీఆర్‌ఎం రాజుకు చెప్పారు. ఇందులో తిలా పాపం తలా పిడికెడు ఉండటంతో నవంబరు 26న స్వప్న కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాజు కొంచెం కోఆర్డినేట్‌ చేసి ఇష్యూను ఎలాగోలా క్లోజ్‌ చేయడానికి ట్రై చేయండంటూ బతిమాలుకున్నారు. దీంతో స్వప్నప్రియ ఉద్యోగం పోకూడదన్న ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులు నవంబరు 27న బ్రాంచి ఏజెంటును పట్టుకొని 16 బ్యాగులు, మరుసటి రోజు 5 బ్యాగులు తాకట్టు నుంచి విడిపించి బ్యాంకుకు అందజేశారు. ఇంకా అనేక బ్యాగులు బయట ఉండిపోవడంతో దాన్ని విడిపించే ఆర్థిక స్తోమత లేక స్వప్న ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్వప్న కుటుంబ సభ్యులు మిగిలిన బంగారం విడిపించి ఇవ్వలేరని గ్రహించిన ఆర్‌ఎం అదే నెల 30న స్వప్నప్రియ మీద ఫిర్యాదు చేశారు. బ్యాంకులో బంగారం పోలేదని చెప్పిన టీఆర్‌ఎం రాజు స్వప్నప్రియ చనిపోయిన తర్వాత బంగారం మాయమైందని చెప్పడం గమనార్హం. నిజంగా స్వప్నప్రియే బంగారం తీసుంటే ఆమె చనిపోయేవరకు ఆర్‌ఎం ఎందుకు వేచిచూడాల్సి వచ్చింది?

సస్పెండ్‌ చేసిన తర్వాత లీవు ఎలా ఇచ్చారు?

బ్యాంకులో బంగారం మాయమైందని తెలిసిన వెంటనే ఆమెను నవంబరు 18న సస్పెండ్‌ చేశామని కూడా అప్పటి ఆర్‌ఎం రాజు తెలిపారు. వాస్తవానికి స్వప్నప్రియ నవంబరు 20 నుంచి డిసెంబరు 15 వరకు మేండేటరీ లీవులో ఉంది. మేండేటరీ లీవు అంటే ప్రతి బ్యాంకు ఉద్యోగి ఏడాదిలో కచ్చితంగా ఉపయోగించి తీరాల్సిన సెలవు. దీనిని ఎర్న్‌డ్‌ లీవుగా మార్చుకోడానికి, లేదా వేరే సెలవుల్లో కలుపుకోడానికి అవకాశం లేకుండా బ్యాంకు నిబంధనల ప్రకారం కచ్చితంగా తీసుకోవాల్సి లీవు. నవంబరు 20 నుంచి డిసెంబరు 15 వరకు ఆమె లీవులో ఉంటే, 18న ఎలా సస్పెండ్‌ చేశారు. నిజంగా సస్పెండ్‌ అయి ఉంటే 20 నుంచి మేండేటరీ లీవుకు ఎలా అర్హురాలైంది? ఈ కేసు నడుస్తున్నకొద్దీ స్వప్నప్రియ సస్పెండ్‌ అయిన వివరాలు కావాలని అడిగితే, అసలు ఆమెను సస్పెండే చేయలేదని చెబుతున్నారు. స్వప్నప్రియ చనిపోయిన తర్వాత ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్‌ కూడా ఇచ్చేశారు. నిజంగా స్వప్నప్రియ మీదే కేసు ఉంటే అది తేలకుండా బెనిఫిట్స్‌ ఎలా ఇస్తారు? అంటే.. ఇక్కడ స్వప్నప్రియ కాకుండా ఇంకెవరో ఏదో చేశారు. వారికి వెన్నుదన్నుగా ఇంకెవరో ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్న స్టేట్‌బ్యాంకు ఉన్నత వర్గాల్లో కూడా ఉత్పన్నమైంది.

తాకట్టు బంగారం పోతే ఆడిట్‌ క్లియరెన్స్‌ ఎలా వచ్చినట్లు?

గార అంశం బయటపడిన తర్వాత రీజనల్‌ మేనేజర్‌ రాజుపై ఆ బ్యాంకు విజిలెన్స్‌ విభాగం నిఘా వేసింది. అందులో భాగంగానే నరసన్నపేట బ్రాంచిలో మాయమైన రూ.3కోట్ల కేసులో ఆయన దొరికిపోయారు. స్వప్నప్రియ కేసులో సక్సెస్‌ఫుల్‌గా తప్పించుకున్న ఆర్‌ఎం రాజుకు ఈసారి అది కుదరలేదు. ఆర్‌ఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం పోలీసులు అత్యుత్సాహం చూపించి బలమైన విచారణ చేపట్టకుండానే కేసును ఛేదించేశామంటూ చేతులు దులిపేసుకున్నారు. స్వప్నప్రియ 2022 జూన్‌ నుంచి గార బ్రాంచిలో పని చేశారు. ప్రతి రెండు నెలలకు ఒక ఆడిట్‌ జరుగుతుంది. ఈ లెక్కన కనీసం ఐదు ఆడిట్లయినా స్వప్నప్రియ చనిపోయే లోపు జరిగి ఉంటాయి. చివరిగా 2023 సెప్టెంబరులో జరిగిన ఆడిట్‌లో కూడా అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్థారించిన తర్వాత.. 89 బంగారం బ్యాగులను గత మూడేళ్ల నుంచి కుదువ పెట్టారని పోలీసులు చెప్పారు. ఈ లెక్కన చూస్తే సెప్టెంబరు 2023న ఇచ్చిన ఆడిట్‌ నివేదిక తప్పయివుండాలి. అదే నిజమైతే బయటి ప్రాంతం నుంచి వచ్చి ఆడిట్‌ చేసేవారిని ఎవరు మేనేజ్‌ చేశారు? అక్కడ బంగారం బ్యాగులు లేకపోయినా ఉన్నాయని ఎవరు రిపోర్టు రాయించారు? కచ్చితంగా రీజనల్‌ మేనేజర్‌ అండ లేకుండా ఇది జరగదు. అకౌంటెంట్‌, క్యాష్‌ ఆఫీసర్‌, బ్రాంచి మేనేజర్‌కు తెలియకుండా ఒక బ్యాంకులో ఏదీ జరగదు. అలాంటిది అక్కడ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఒక్క స్వప్నప్రియనే ఎందుకు టార్గెట్‌ చేశారు? వాస్తవానికి అక్కడ లాకర్‌కు క్యాష్‌ ఆఫీసరే సుప్రీమ్‌. అకౌంటెంటు, క్యాష్‌ ఆఫీసరు కలిపి లాకర్‌ను ఓపెన్‌ చేస్తారు. కానీ అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు క్యాష్‌ ఆఫీసర్‌ను తప్పించి ఒక్క స్వప్నప్రియ మీదే ఎందుకు ఫిర్యాదు చేశారు? ‘సత్యం’లో కథనం ద్వారా క్యాష్‌ ఆఫీసర్‌ పాత్ర ఉందని బయట పడిన తర్వాత ఆయన ముందస్తు బెయిల్‌ కోసం పరారీలో ఉన్నాడని తెలుసుకొని అప్పుడు ఫిర్యాదులో పేరు చేర్చింది టీఆర్‌ఎం రాజే. ఒక్క స్వప్నప్రియ కుటుంబం తప్ప మిగిలిన ఎవరూ పోలీసులు మీడియా ముందుకు ఈ కేసును తీసుకువచ్చినప్పుడు పోలీసుల అదుపులో లేరు. అప్పటి క్యాష్‌ ఆఫీసర్‌ సురేష్‌నాయుడు అకౌంటెంట్‌ (స్వప్నప్రియ) దగ్గర ఉన్న తాళాలతో పాటు లాకర్‌ను ఆపరేట్‌ చేసినట్లు సీసీ టీవీల్లో రికార్డై ఉంది. కానీ ఒక్క ఫుటేజ్‌నే పోలీసుల ముందు ఎందుకు పెట్టారు. 56 సార్లు 89 బ్యాగులు బ్యాంకు నుంచి బయటకు వెళ్లాయని చెబుతున్న కథలో చూపిస్తున్న ఆధారం సీసీ ఫుటేజ్‌ మాత్రమే. ఇందులో ఒక్కచోట మాత్రమే స్వప్నప్రియ కనిపించింది. అది కూడా తన చేతిలో చెక్‌బుక్‌లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఫుటేజీ ఎక్కడుంది? లేకపోతే ఎందుకు మాయమైంది? లోలలాక్షి ఫైనాన్స్‌ ద్వారా తాకట్టు పెట్టిన బంగారానికి చెందిన డబ్బంతా ఎస్‌బీఐ స్టాఫ్‌ అకౌంట్స్‌కు వెళ్లినట్టు పోలీసుల వద్ద ఓ రిటర్న్‌ స్టేట్‌మెంట్‌ ఉంది. ఇది సాక్షాత్తు నిందితుల్లో ఒకరిచ్చిందే. కానీ వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? క్యాష్‌ ఆఫీసర్‌ సురేష్‌ను స్వప్నప్రియ కొట్టించిందని ఇచ్చిన ఫిర్యాదు ఫేక్‌ అని పోలీసులు నిర్ధారించిన తర్వాత కూడా ఈ కేసులో ఆయన్ను బ్యాంకు అధికారులు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో. పాత్రధారులు ఎందరో. కానీ వీటన్నింటికీ సుత్రధారి అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు.

 క్రిమినల్‌ చర్యలు తప్పించుకోవడానికి ఎత్తులు


స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళం రీజియన్‌ పరిధిలో బ్రాంచీలను భ్రష్టు పట్టించేసి ఆర్‌ఎంగా తనకున్న విచక్షణాధికారాలతో జనం సొమ్ము తినేసిన బదిలీ అయిన ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు ప్రస్తుతం విశాఖపట్నంలో జోనల్‌ ఆఫీస్‌కు రిపోర్టు చేయడానికి వెళ్లారు. మరోవైపు ‘సత్యం’లో వచ్చిన కథనాలు బ్యాంకు వర్గాలను కదిపి కుదిపేయడంతో ఆయన హయాంలో, ఆయన పరిధిలో జరిగిన మరికొన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బ్యాంకులో మాయమైన సొమ్ములకు బాధ్యత వహించాలంటూ ఆయన్ను ముందు బదిలీ చేశారు. గురువారం జోనల్‌ ఆఫీస్‌లో ఆయన రిపోర్టు చేసి కొత్త పోస్టింగ్‌ తెచ్చుకోవాల్సి ఉంది. కానీ ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోడానికి బ్యాంకు ఉన్నత వర్గాలు సిద్ధపడుతున్నట్టు భోగట్టా. తన హయాంలో చేసిన కుంభకోణాలు ఇక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాయని, ఈరోజు కాకపోతే రేపైనా వాటిపై చర్యలు తప్పవని భావించిన టీఆర్‌ఎం రాజు క్రిమినల్‌ చర్యలు లేకుండా ఓవైపు లాబీయింగ్‌ చేస్తూనే మరోవైపు అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. బ్యాంకు నిబంధనల్లో ఉండే లూప్‌ హోల్స్‌ను చూపించి ఆయన్ను తప్పించడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం రీజియన్‌కు ఏ ఉన్నతాధికారి వచ్చినా టీఆర్‌ఎం రాజు చేసే సపర్యలతో మురిసిపోయి ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇన్నాళ్లూ వెనకేసుకొచ్చారు. జిల్లాలో ఓ బ్రాంచి పరిశీలనకు ఓ ఉన్నతాధికారి వస్తే ఆయనకు ఏకంగా పులిచర్మాన్నే వలిపించేసి బహుమతిగా ఇచ్చిన ఘనుడు టీఆర్‌ఎం రాజు అని బ్యాంకు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన అనుమతి లేనిదే జిల్లా ఎస్‌బీఐ బ్రాంచిల్లో పూచికపుల్ల కూడా కదపడానికి లేదు. అటువంటిది గార బ్రాంచిలో తాకట్టు బంగారం మాయం కావడం, నరసన్నపేట బజారు బ్రాంచిలో పర్సనల్‌ లోన్లు, ఎంఎస్‌ఎంఈ లోన్ల పేరిట సొమ్ము పక్కదారి పట్టడం వెనుక ఆర్‌ఎం హస్తం కచ్చితంగా ఉండి ఉంటుంది. దీనికి టెక్నికాలిటీ అంశాలు జోడిస్తే తప్పించుకునే అవకాశం ఉంటుందేమో గానీ కర్మ నుంచి మాత్రం ఆయన తప్పించుకోలేరు.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page