ఆరోగ్య ఖర్చుల వల్లే పది కోట్ల మంది పేదరికంలోకి
కొత్త ప్రభుత్వం ఏమైనా చేస్తుందా?
అరకొర నిధులతో మమ అనిపిస్తున్న ఆరోగ్యశాఖ
(డి.వి.మణిజ)
తమ ఆరోగ్యం కోసం వెచ్చిస్తోన్న ఖర్చుల వల్లనే ప్రతి ఏటా 7 శాతం భారత జనాభా.. అంటే సుమారు పది కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని నీతి అయోగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టారు. మరి పరిస్థితి మారబోతోందా! ఇది వెయ్యి డాలర్ల ప్రశ్న. ప్రజలంతా ఎవడి ఆరోగ్యం వాడు బాగు చేసుకోవాలి గాని, ప్రభుత్వం వచ్చి ఉద్ధరిస్తుందనుకుంటే వారు మాత్రం ఎంతమందికని స్వస్థత చేకూర్చగలరని భావించే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో భారత ప్రభుత్వం ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధను గమనిస్తే మనకు అనిపించేది కూడా అదే!
జగత్ ప్రకాష్ నడ్డా చిటిక వేసి ఈ దేశ ఆరోగ్య రంగ రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తాడని ఆశలు ఏమీ లేనప్పటికీ, అతనికున్న అనుభవం ప్రస్తావించుకోవాలి. ప్రజాపోరులో నెగ్గని జేపీ నడ్డాను రాజ్యసభకు పంపించి, అటునుంచి 2014లో ఆరోగ్య శాఖ మంత్రిగా మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి తర్వాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా, రెండేళ్లకు అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. ఈ పర్యాయం కూడా నడ్డాను ప్రధాని మోదీ తన టీమ్‌లోకి మరోసారి తీసుకుని ఆరోగ్య శాఖను అప్పగించారు. ఇప్పటివరకూ ఆరోగ్య శాఖకు మంత్రిగా పనిచేసిన మాన్‌సుఖ్ మాండవీయ నుంచి నడ్డా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదేళ్లలో బాగుచేయలేనంతగా చెడిపోయిన ఆరోగ్యశాఖను నడ్డా ఏమి చేస్తారో భారత రాజకీయ యవనికపైనే చూడాలి. అనారోగ్యానికి గురయిన ఆరోగ్య రంగం గురించి ఈసారి ఎన్నికల ముందు జరిపిన ప్రచార ఆర్భాటంలో అసలు చర్చ నడవకుండా ప్రభుత్వం చేసింది. పూర్తిగా మౌనం పాటిస్తూ దానికి తన సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎక్కడా ఆ ఊసెత్తలేదు. ఇరువురికీ ఆరోగ్యం ఎన్నికల అస్త్రం కాకుండా పోయింది.
అరకొర నిధులు విదిల్చి..
మన ఆరోగ్యరంగాన్ని పట్టి పీడిస్తున్న ఐదు సమస్యల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది ఆరోగ్యానికి మనం వెచ్చిస్తున్న నిధులు. ఎవరెంత గట్టిగా అరిచి చెప్పినా, మన ప్రభుత్వాలు మాత్రం ఆరోగ్యానికి ఆ ఏడాది బడ్జెట్‌లో కేవలం 1.3 శాతం నిధులు మాత్రమే కేటాయించడం విచారకరం. ప్రపంచ దేశాలలోనే ఇది అత్యంత తక్కువ కేటాయింపు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఆర్భాటానికి, వాస్తవిక చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదు. జాతీయ ఆరోగ్య పథకం 2017లో ఈ కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలని గట్టిగా తీర్మానించుకుని, ఆ సంగతే మర్చిపోయింది. ప్రభుత్వాలు చేసే బడ్జెట్ కేటాయింపులు నామమాత్రమైనపుడు ప్రజలు తమ ఆరోగ్యం కోసం చేయాల్సిన ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. కార్పొరేట్ ఆసుపత్రులకు సరిగా కావలసింది అదే. మన మొత్తం ఆరోగ్యపరమైన ఖర్చులో ప్రజలు 52 శాతం భరిస్తుంటే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి 35 శాతం భరిస్తున్నాయి. మళ్లీ ఇందులో చాలా రాష్ట్రాల కంటే కేంద్రం తక్కువ డబ్బులు దీనికోసం ఖర్చు చేస్తోంది. తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇబ్బడిముబ్బడిగా చేస్తోన్న ఖర్చుల వలన ప్రతి ఏటా ఏడు శాతం భారత సంతతి అంటే సుమారు పది కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.
రెండవ అంశంగా పోషకాహారాన్ని ప్రస్తావించవచ్చు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లు పరిశీలించినట్లయితే మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం 125 దేశాలలో ఆకలి దప్పుల విషయంలో మన దేశం 111వ స్థానం సాధించింది. చాలా బీద ఆఫ్రికన్ దేశాల కంటే ఇది అధ్వానమైన పెర్ఫార్మెన్స్‌గా నిలుస్తోంది. మరో నివేదిక ఇచ్చిన అంచనాల ప్రకారం మన దేశంలో 74.1 శాతం ప్రజలు ఒక ఆరోగ్య పానీయం సైతం కొనుక్కోలేనంత పేదరికంలో ఉన్నారని తెలుస్తోంది. పైగా దారుణమైన ఈ ఆకలి వలన ప్రజలకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలాంటి 80 కోట్ల ప్రజానీకం కోసం నెలకు ఐదు కేజీల ఉచిత బియ్యం అందించే పథకం కూడా మన పౌరులకు సమీకృత ఆహారం అందించలేని దుస్థితిలో ఉంది. మందుల నాణ్యత లభ్యతలపై ముసురుకున్న నీలినీడలు మూడో అతి పెద్ద సవాల్‌గా పరిణమించాయి. సాధారణంగా వైద్యం అంటే వ్యాధి గుర్తింపు, వైద్యుని సంప్రదించడం, వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు, మందులు, పథ్యం పాటించడానికి అయ్యే ఖర్చులుగా అనుకుంటే, మన దేశంలో వైద్య పరీక్షలకు, మందులకు అయ్యే ఖర్చులు, ఇతర దేశాలలో కంటే చాలా ఎక్కువగా మారిపోయాయి. ఇది సగటు పౌరునికి భరించలేని ఖర్చుగా పరిణమిస్తోంది.
ఔషధ నియంత్రణ విధానాల లేమి
2022లో విడుదలైన ఒక నివేదికలో భారతీయులు కేవలం ఆరోగ్య సంబంధ సమస్యలతో ఆసుపత్రులకు పోయి, తమ ఆదాయంలో 45.5 శాతం అంటే దాదాపు సగం కేవలం మందులు కొనడానికే ఖర్చు చేస్తున్నారని తెలిపింది. నిజానికి మన దేశంలో సరైన ఔషధ నియంత్రణ (డ్రగ్ కంట్రోల్) విధానాలు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో మన దేశంలో తయారైన ఔషధాలు వాడి పసిపిల్లలు మరణించడంతో మనమీద పడిన మరకను తొలగించుకోవడానికి భారత ప్రభుత్వం నియంత్రణ విధానాలను సరిచేయడానికి బదులు విదేశాలకు పంపే మందుల తయారీ జాగ్రత్తగా ఉంటే చాలనుకుని సంతృప్తి చెందడం విచారకరం. విదేశాలకు పంపే మందుల నాణ్యత సరిచూసుకున్న ప్రభుత్వాలు, మన దేశంలో వాడే ఔషధాల గురించి పట్టించుకోకపోవడం దారుణం. దగ్గు మందు వాడి మన దేశంలో ఎంతోమంది పసిపిల్లలు మరణించడం ఈ దేశంలో మాత్రమే జరగగల దుర్ఘటన.
నాలుగో అంశంగా అవాస్తవిక లక్ష్యాలను ప్రస్తావించుకోవచ్చు. ఆరోగ్యపరంగా మనం నిర్దేశించుకుంటున్న లక్ష్యాలలో కొన్ని జీవితకాలంలో మనం సాధించలేనివి కాగా, మరికొన్ని సుసాధ్యమైనా నిర్లక్ష్యం చేస్తున్నవి. ఉదాహరణకు బ్లాక్ ఫీవర్ అని పిలుచుకునే కాలా అజార్ అనే కాలేయ సంబంధిత వ్యాధి నివారణకు సరైన వైద్యం లభించాక, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017కల్లా భూమి మీద ఈ వ్యాధి ఉండబోదని ఆశించింది. కాని, మన దేశంలో దీని పూర్తి నివారణ సాధించలేకపోయాం. ఇప్పటికీ మన దేశంలో ఈ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఈసారి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని శతశాతం నిర్మూలించడానికి కృషి చేస్తామని వాగ్దానంగా కూడా చేర్చింది. అలాంటిదే మరో వ్యాధి బోధకాలు (ఫైలేరియాసిస్). 2015 కల్లా అంతమవ్వాల్సిన ఈ వ్యాధి నివారణను ఏటికేడాది పొడిగించుకుంటూనే పోతున్నాం. తాజాగా 2027 లోపల ఈ వ్యాధి అంతు చూస్తామని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. చివరిదైన అయిదో అంశంగా అధ్వాన వసతులు, మానవ వనరుల లోటును గురించి చెప్పుకోవాలి.
పెరగాల్సిన వైద్యుల సంఖ్య
దేశ జనాభాకు సరిపడినంతమంది వైద్యుల కొరత మన దేశాన్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. దీనిని అధిగమించడానికి దేశవ్యాప్తంగా గత పదేళ్లలో సుమారుగా 300 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసినట్టు కేంద్రం చెప్తోంది. కాని, ఈ కళాశాలల్లో వైద్యవిద్యను అభ్యసించడానికి సరైన వసతులు ఏర్పాటుచేయకపోవడం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ప్రతి ఏటా జరిపే తనిఖీలలో 80 శాతం కళాశాలలో అధ్యాపకుల కొరతను తాము గుర్తించినట్టు కౌన్సిల్ హెచ్చరిస్తూనే ఉంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నుంచి గ్రామస్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వేధిస్తున్న ఉద్యోగుల కొరతను పరిష్కరించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఉద్యోగుల ఎంపిక లక్షల సంఖ్యలో చేపట్టవలసి ఉంది. ఈ సమస్యలను అధిగమించిననాడే మన ఆరోగ్యరంగం నెమ్మదినెమ్మదిగా కుదుటపడుతుంది. మన నూతన ఏలిక జేపీ నడ్డా దీనికి సంబంధించిన చొరవను ఏ మేరకు చూపిస్తారో చూడాలి.
Comments