ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
- DV RAMANA

- Apr 10
- 2 min read
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత
బడ్జెట్‌లో రెండు శాతానికి మించని కేటాయింపులు
మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు
వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్
సామాన్యుడే ‘శర’మెత్తితే-6

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్‌కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటున్న ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్, చేస్తున్న ఖర్చులు చూస్తే ఆ రంగం పట్ల దాని చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వం ఆరోగ్యరంగానికి కేవలం రెండు శాతం నిధులే కేటాయిస్తున్నది. మరోవైపు నగరాలు, గ్రామాలు అభివద్ధి చెందాలంటే రహదారి సౌకర్యాలు బాగుండాలన్న విషయం కొత్త చెప్పాల్సిన పనిలేదు. కానీ రోడ్ల నిర్మాణాలు, నిర్వహణలో విఫలమవుతున్న ప్రభుత్వం మరోవైపు ఆ పేరుతో ప్రజల నుంచి రెండుసార్లు పన్నులు వసూలు చేస్తూ ఒకరకమైన దోపిడీకి పాల్పడుతున్నదని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆమధ్య రాజ్యసభలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకవైపు రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తుండగా మరోవైపు జాతీయ రహదారుల నిర్మాణ ఖర్చు రాబట్టుకునే నెపంతో భారీగా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండటాన్ని ఎత్తిచూపుతూ ఒకే ప్రయోజనానికి రెండుసార్లు పన్ను వసూలు చేయడమేమిటని సర్కారును నిలదీశారు. ఈ రెండు రంగాల్లో జరుగుతున్న తతంగమేమిటో సవివరంగా చూద్దాం.
నామమాత్రపు కేటాయింపులు
కూడు, గూడు, విద్య, వైద్యం, రోడ్లు.. ఇవే ప్రజల కనీస అవసరాలుగా ప్రభుత్వాలు ఏనాడో గుర్తించాయి. కానీ జనాభా అవసరాలకు అనుగుణంగా వాటిని సమకూర్చడంలో మాత్రం విఫలమవుతున్నాయి. దీనికి ప్రజారోగ్య రంగాన్నే ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం కారణాలు ఏవైనా గానీ ఆ రంగానికి బడ్జెట్‌లో నామమాత్రపు ప్రాధాన్యతనిస్తున్నది. ఈ రంగానికి బడ్జెట్‌పరంగా పెడుతున్న ఖర్చు కేవలం రూ.లక్ష కోట్లు(2 శాతం)కు మించడంలేదు. మన దేశ జీడీపీతో పోల్చి చూస్తే ఇది 0.5 శాతం మాత్రమే. అత్తెసరు కేటాయింపుల వల్ల వైద్యరంగం లోపాలపుట్టగా మారుతున్నది. ఆధునికత సంతరించుకోవడంలో బాగా వెనుకబడిపోతున్నది. మందుల కొరత, పరికరాలు, వసతుల కొరత ప్రభుత్వ ఆస్పత్రులను వెంటాడుతున్నాయి. దాంతో స్తోమత లేకపోయినా పేదరోగులు గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వైద్యం వైపు మళ్లుతున్నారు. తీవ్ర ఆర్థిక దోపిడీకి గురై ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్నారు. భారత్‌తో పోలిస్తే విదేశాల్లో ప్రజారోగ్య రంగానికి చాలా ప్రాధాన్యమిస్తున్నాయి. అమెరికా అత్యధికంగా 18 శాతం ఆరోగ్యానికి కేటాయిస్తుండగా యూకే 12 శాతం, జర్మనీ 13 శాతం, స్వీడన్, జపాన్, స్పెయిన్ దేశాలు పది శాతం చొప్పున నిధులు కేటాయిస్తున్నాయి. వీటితో పోలిస్తే మనదేశ కేటాయింపులు చాలా హీనమనే చెప్పక తప్పదు. అరకొర కేటాయింపుల వల్ల ప్రభుత్వ వైద్యరంగం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో కోవిడ్ సమయంలో నెలకొన్న సంక్షోభంతో అర్థమైంది. భవిష్యత్తులో అలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు చేతులెత్తేసి పరిస్థితి రాకుండా వైద్యరంగానికి పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని రాఘవ్ చద్దా ప్రభుత్వానికి సూచించారు.
వాహనాలపై అన్ని పన్నులెందుకు?
మరో కీలక మౌలిక అవసరమైన రోడ్ల విషయంలో, ఆ పేరుతో అమలు చేస్తున్న పన్ను వ్యవస్థలోనూ జనసామాన్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దాని చర్యలను చూసి అనుకోవాల్సి వస్తుంది. అభివద్ధికి రహదారులే సూచికలు అనే నానుడిని అపహాస్యం చేస్తూ ఆ రహదారుల పేరుతో ఎడాపెడా పన్నులు వసూలు చేస్తున్నది. పోనీ ఆ నిధులతో రహదారులను అభివద్ధి చేస్తున్నారా అంటే రోడ్ల నిర్వహణ, కొత్త రోడ్ల నిర్మాణాలు సక్రమంగా జరగడంలేదు. ఈ దోపిడీ విధానం చాలా దారుణంగా అమలవుతున్నది. మోటార్ వెహికల్ యాక్ట్`1988 ప్రకారం వాహనం కొనుగోలు చేసినప్పుడే దానికి సంబంధించి జీఎస్టీ, రోడ్డు సేఫ్టీ సెస్, లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్, రోడ్డు ట్యాక్స్ వంటి కట్టించుకుంటారు. రహదారుల మరమ్మతులు, నిర్మాణం, నిర్వహణతోపాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికే పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో టోల్‌ప్లాజాలు పెట్టి మళ్లీ టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారు. అంటే రోడ్ల కోసం వాహనం రోడ్డెక్కక ముందే రకరకాల పన్నులు కడుతున్న మనం.. మళ్లీ జాతీయ రహదారుల్లో అడుగడుగునా మళ్లీ పన్నులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనివల్ల టోల్‌ప్లాజాల వద్ద తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. వాహనదారుల సమయం, నిరీక్షణ సమయంలో ఇంధన వథా వంటి నష్టాలు సంభవిస్తున్నాయి. దీనివల్ల ఉత్పాదక శక్తి కూడా తగ్గుతుందంటున్నారు. వీటిని అరికట్టేందుకు కొన్ని నిర్ణయాలను రాఘవ్ చద్దా ప్రతిపాదించారు. టోల్ ప్లాజాల వల్ల ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఆలస్యమైతే టోల్ కట్టే అవసరం లేకుండా నిబంధన తీసుకురావాలని సూచించారు. అయితే ద్వంద్వ ట్యాక్సుల గురించి ప్రస్తావించని మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారులపై జీపీఎస్ ట్రాకర్స్ ఏర్పాటు చేసి జాప్యం లేకుండా టోల్ వసులు చేసేలా చర్యలు తీసుకుంటామని పార్లమెంటులో ప్రకటించారు.






Comments