ఈడీని ఉసిగొల్పి డబ్బులు లాగారంటూ కోర్టుకెళ్లిన మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
పేపర్ కటింగులతో కోర్టును ఆశ్రయించిన వైనం
వేలకోట్ల రూపాయల ఎలక్టొరల్ బాండ్లను చట్టవ్యతిరేకమంటూ తేల్చిన సుప్రీంకోర్టు
- దుప్పల రవికుమార్

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16,492 కోట్ల రూపాయలు. మొన్న మార్చి 30న భారత ఎన్నికల కమిషన్ పుణ్యమా అని ఎలక్టొరల్ బాండ్ల ముసుగు తొలగింది. మన రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఎవరెవరు ఎంత సొమ్ము విరాళంగా ఇచ్చిందీ మనకు తెలిసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి సామాజిక ఉద్యమకారుడిగా మారిన కర్ణాటకకు చెందిన యాభై ఏళ్ల ఆదర్శ అయ్యర్ దీనిమీద ఒక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కర్ణాటకకు చెందిన భాజపా పెద్దలు నళిన్ కుమార్ కటిల్, బివై విజయేంద్ర లాంటి కొందరు నేతలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) లాంటి విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలను ఎలక్టొరల్ బాండ్ల రూపంలో దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భాజపా తీసుకొచ్చిన ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో వ్యక్తులైనా, సంస్థలైనా తమ వివరాలు వెల్లడి చేయకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆరేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఈ పథకంలో అతిపెద్ద లబ్దిదారు బిజెపియే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! దాదాపు 30 రిజిస్టర్డు రాజకీయ సంస్థలకంటే ఎక్కువగా బిజెపి ఈ ఎలొక్టరల్ బాండ్ల ద్వారా 8,252 కోట్ల రూపాయలను పొందింది. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు చట్టవ్యతిరేకమని ప్రకటించింది. ఆదర్శ అయ్యర్ ప్రకారం బిజెపి ఇందులో ఎక్కువ డబ్బు సంపాదించడానికి కారణం ఈడీ లాంటి విచారణ ఏజెన్సీలను వాడి కార్పొరేట్ సంస్థలను బెదిరించి డబ్బులు గుంజడమే.
ఊహించని ట్విస్ట్
ఈ వార్తలు పత్రికలలో వచ్చిన తర్వాత అయ్యర్ తన స్నేహితులతో కలిసి తిలక్‌నగర్ పోలీస్ స్టేషనులో దాదాపు 15 ఫిర్యాదులు దాఖలు చేశారు. కేసులలో ఎలాంటి పురోగతీ లేకపోయేసరికి, అందులో ఒక్క ఫిర్యాదు పట్టుకుని ఏప్రిల్ 15న కర్నాటక సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడికి ఆరు నెలలకు గౌరవ కోర్టు సీతారామన్‌తో పాటు ఇతర నాయకులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయమని పోలీసులను ఆదేశించింది. దీంతో తప్పని పరిస్థితులలో మొదటి ముద్దాయి నిర్మలగాను, తర్వాతి ముద్దాయిలుగా కటిల్, విజయేంద్ర, మరికొందరు ప్రాచుర్యం లేని నేతలతో పాటు ఈడీ అధిరులను చేరుస్తూ 0224/2024 నెంబరుతో దోపిడీ, క్రిమినల్ కుట్రలకు పాల్పడిన నేరాలపై ఎఫ్‌ఐఆర్ దాఖలయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భూవివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకంగా ఈ కేసును బిజెపి అభివర్ణించింది. సెప్టెంబరు 30న ఈ కేసును విచారిస్తూ తదుపరి వాయిదా అక్టోబరు 22 వరకూ దీనిపై ఇంటెరిం స్టే విధించింది కర్ణాటక హైకోర్టు.
ఆదర్శ అయ్యర్ 2015లో కర్ణాటర లోకాయుక్త కార్యాలయంలో జరిగిన అవినీతి కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోర్టుకీడ్చారు. అంతేకాకుండా కరోనా సమయంలో కొందరు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన సందర్భంలో విద్యాశాఖ మంత్రిని బోనుకెక్కించారు. జనతాదళ్ నేతలు పాల్పడిన భూదందా కేసును కూడా తవ్వితోడిన చరిత్ర ఈయనకుంది. రెండు దశాబ్దాల కిందట అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండే ఆదర్శను రెండు సినిమాలు మార్చాయి. బ్రూస్ విల్లిస్ నటించిన ‘‘టియర్స్ ఆఫ్ ది సన్’’, షారూక్‌ఖాన్ నటించిన ‘‘స్వదేశ్’’ సినిమాలు చూసి ఆలోచనలో పడిన ఆదర్శ 2005లో ఉద్యోగం వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చేసాడు. మొదట అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పనిచేశాడు. లా కోర్సులో ప్రవేశం పొంది కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేసాడు. 2015లో తన స్నేహితులతో కలిసి జనాధికార సంఘర్ష పరిషత్ ఏర్పాటు చేసి, పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాడు.
పత్రికలలో వచ్చిన వార్తలే ఆధారాలు
ప్రస్తుతం ఆర్థిక మంత్రి విషయంలో కోర్టుకెక్కిన ఈ కేసులో రెండే రెండు కంపెనీల గురించి ప్రస్తావించారు. అవి వేదాంత మైనింగ్, అరబిందో ఫార్మా కంపెనీలు. ఆర్థిక మంత్రి తన ఆధీనంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ను వేదాంత సంస్థ తమిళనాడు శాఖపై ఆగస్టు 2022లో దాడి చేసింది. వేదాంత కంపెనీ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి కొంత లంచం ముట్టజెప్పి పంజాబ్‌లో పవర్ ప్లాంట్ తెరిచిందని ఇడి ఆరోపిస్తూ జరిపిన దాడి అది. దాంతో నవంబర్ 2022లో వేదాంత సంస్థ వంద కోట్ల రూపాయలను ఎలొక్టరల్ బాండ్లకు విరాళంగా అందించింది. ఏప్రిల్ 2019 నుండి నవంబరు 2023 వరకూ వేదాంత సంస్థ 230 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం వెనుక మతలబు గురించి పోలీసులు పరిశోధించాలని ఆదర్శ కోర్టును కోరాడు. దానికి సంబంధించిన వివరాలన్నీ కోర్టు ముందుంచాడు. దాంతోపాటు నవంబరు 2022లో అరబిందో ఫార్మా నుంచి 49.5 కోట్ల రూపాయలను విరాళంగా సేకరించారు. దీని వెనుక కూడా ఈడీ బెదిరింపులు ఉన్నాయని, ఆ సమయంలో ఈడీ అరబిందోపై జరిపిన దాడుల ఫైళ్లు కోర్టుకు అందజేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడతాయని వారు కోర్టును అభ్యర్థించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవుతుందని ఎవరూ ఊహించలేదు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక రాష్ట్ర న్యాయస్థానం దేశ ఆర్థికమంత్రిపై కేసు పెట్టమని ఆదేశించడంతో ఒక్కసారి దేశం దృష్టి అటు మళ్లింది. ఈ కేసును భాజపా పెద్దలు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
Comments