top of page

ఆర్థిక వృద్ధి వేగం.. కొనుగోలు శక్తి హీనం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 7
  • 2 min read

భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత స్పీడుగా పరుగులు తీస్తోంది. అగ్రదేశాలుగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న దేశాలను ఒకదాని తర్వాత మరోదాన్ని వెనక్కి నెడుతూ అగ్రపథంలోకి దూసుకుపోతోంది. నిన్నగాక మొన్నే నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. మరింత ప్రగతి సాధిస్తూ రేపో మాపో అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రపంచస్థాయి ఆర్థిక నివేదికలతో పాటు ఘోషిస్తున్నాయి. దాన్నే ఎన్డీయే పాలకులు ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉందని, భారత ఆర్థిక నాణేనికి మరో పార్శ్వం కూడా ఉందని ఆర్థిక నిపుణులు, కొన్ని నివేదికలు ఎత్తిచూపుతున్నాయి. మన ఆర్థిక రథం శరవేగంగా పరుగులు తీస్తున్నా దాని ఫలాలు దిగువస్థాయికి చేరడంలేదన్నదే వాటి సారాంశం. ఆర్థికంగా ఎదిగామని, మన కొనుగోలు శక్తి పెరిగిందని చెబుతున్నా.. ఇప్పటికీ సామాన్య ప్రజలు కొనుగోళ్ల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని, తగిన ఆర్థిక శక్తి వారికి లేకపోవడమే దీనికి కారణమని ఇండస్‌ వ్యాలీ యాన్యువల్‌ రిపోర్టు`2025 కుండ బద్దలుకొట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో ఉంది. స్టార్టప్‌ల బూమ్‌ నడుస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. గత కొన్ని నెలల పరిణామాలు మినహాయిస్తే మొత్తంగా కొన్నేళ్లుగా స్టాక్‌ మార్కెట్లు గణనీయ వృద్ధిని నమోదు చేశాయి. అయితే ఇదంతా ఒక కోణం మాత్రమేనని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘బ్లూమ్‌ వెంచర్స్‌’ విడుదల చేసిన ఇండస్‌ వ్యాలీ రిపోర్టులో పేర్కొన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే పేరుకుపోవడం, సామాన్య ప్రజల కొనుగోలు శక్తిలో వృద్ధి లేకపోవడం సహా భారత ఆర్థిక రంగంలో పేరుకుపోయిన పలు వ్యవస్థాగత లోపాలను ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. మన ఆర్థిక వ్యవస్థ ఏటా విస్తరిస్తోందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ దేశంలో 90 శాతం ప్రజలు మాత్రం తమకు నచ్చింది కొనుగోలు చేసే స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఏదైనా వస్తువు కొనేముందు వారు చాలా ఆలోచిస్తున్నారు. సంపదపరంగా పైస్థాయిలో ఉన్న పది శాతం మంది మాత్రమే ఖర్చుకు వెనుకాడడం లేదు. తక్కువ సంఖ్యలో ఉన్న ఈ సంపన్నవర్గాలవారే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మధ్యతరగతి ఆదాయవర్గంలో ఉన్న మరో మూడు కోట్ల మంది ఇప్పుడిప్పుడు కొంత వరకు నచ్చింది కొనగలిగే స్థాయికి చేరుకున్నారు. మిగిలిన 60 శాతం దేశప్రజలు మాత్రమే తమకు నచ్చిన వాటిని, తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేయడానికి వెనకాముందూ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. భారత జీడీపీలో వినియోగదారుల ఖర్చు వాటా 60 శాతం. ఆర్థిక వ్యవస్థ విషయంలో మనతో దాదాపు సమానంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే మన తలసరి వినిమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ విషయంలో చైనా కంటే మనం ఏకంగా ఒక దశాబ్ద కాలం వెనుకబడి ఉన్నాం. సంపద కొంతమంది చేతుల్లోనే పేరుకుపోతోంది. మధ్య ఆదాయ వర్గాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో కంపెనీలు సంపన్నుల కోసం ఖరీదైన, లగ్జరీ వస్తువులను మాత్రమే తయారు చేస్తున్నాయి. దీంతో ప్రీమియమైజేషన్‌ మార్కెట్‌ ఏర్పడుతోంది. మరోవైపు దేశంలో ఫ్యామిలీ సేవింగ్స్‌ పడిపోతుండగా.. అప్పులు పెరిగిపోతున్నాయి. చాలామంది బంగారంపై ఇన్వెస్ట్‌ చేయడానికే ఇష్టపడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ జోలికి వెళ్లడానికి వెనకాడుతున్నారు. ఈ రంగంలో లిటిగేషన్లు పెరగడమే దీనికి కారణం. గోల్డ్‌ అయితే ఎప్పుడంటే అప్పుడు డబ్బుగా మార్చుకునే వీలుంటుందనే భావనే కారణం. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు చాలా సులభంగా రుణాలు ఇస్తున్నాయి. దీంతో వ్యక్తిగత రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. దేశంలో స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో భారత్‌ది మూడో స్థానం. అయితే వాటి విలువను మాత్రం చాలా పెంచి చూపిస్తున్నట్లు ఇండస్‌ వ్యాలీ నివేదిక అంచనా వేసింది. కేవలం 90 కంపెనీల విలువ మాత్రమే ఒక బిలియన్‌ డాలర్లు మించి ఉంటుందని పేర్కొంది. ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడంలో యూపీఐ, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ వంటి చెల్లింపు వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో సుమారు 83 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. హైరిస్క్‌ ఆప్షన్స్‌ ట్రేడిరగ్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొండటమే దీనికి కారణం. కానీ వీరిలో 91 శాతం మంది తమ సంపదను కోల్పోతున్నారు.

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page