
ఈ ఏడాది సెప్టెంబరులో సగటు ధరల పెరుగుదల తొమ్మిది నెలల్లో లేనట్టుగా 5.5 శాతానికి చేరింది. మరీ ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు 9.2 శాతం దాటాయి. భారతీయుల్లో అత్యధికులు తమ ఆదా యంలో అర్థభాగం ఆహారంపైనే ఖర్చు పెడతారు. అందువల్ల ఆహార ద్రవ్యోల్బణం మరీ దారుణంగా దెబ్బ తీస్తుంది. ఆహార వస్తువులలోనూ ప్రత్యేకించి కూరగాయల ధరల పెరుగుదల దిగ్భ్రాంతి కలిగించేంత తీవ్రంగా పెరిగింది. ఏడాదికేడాది చూస్తే టమోటాల ధర 42.4 శాతం, ఉల్లిపాయలు 66.2 శాతం, బంగాళా దుంపలు 65.3 శాతం పెరిగాయి. దేశవ్యాపితంగా అత్యధికంగా వినియోగించే కూరగాయలు ఈ మూడే. ప్రభుత్వం దానికి వంత పాడే ఆర్థికవేత్తలు షరా మామూలుగా ఇది వాతావరణ సమస్యల వల్ల వచ్చిన సమస్య అని సాకులు చెప్పడానికి తంటాలు పడినా వాస్తవం మారిపోదు. ప్రతి ఏటా కొన్ని కూరగాయల ధరలు భరించలేని స్థాయిలో మండిపోతాయి. అప్పటికే బరువులమయంగా వున్న కుటుంబాల బడ్జెట్ల నుంచి ఈ కారణంగా వేల కోట్లు గల్లంతవుతుంటాయి. ప్రజలపై భారాలు మరికొన్ని వినియోగ వస్తువులకు సంబంధించి కూడా ధరల పెరుగుదల విపరీతంగా వుంది. వంటనూనెలు కూడా ఆ పెరిగే వాటిలో భాగమే. గత మూడు నెలల్లో ముడి పామాయిల్ ధరలు 45 శాతం పైగా పెరిగిపోవడం కూడా ఇందుకు కొంత కారణం. ముడి పామాయిల్‌ను కేవలం ఆహార పదార్థాల తయారీలోనే గాక సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ భారాలు కూడా నిస్సహాయులైన వినియోగదారులపైకి కంపెనీలు బదలాయించాయి. బడా కంపెనీలకు లాభాలు కట్టబెట్టే తమ విధే యతను ఏ మాత్రం దాచిపెట్టుకోకుండా నిస్సిగ్గుగా ప్రదర్శించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొన్ని అత్యవసర మందుల ధరలు యాభై శాతం పైగా అంటే సగానికి సగం పెంచుకోవడానికి అనుమతిని చ్చింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వును ఇందుకోసం వినియోగించింది. ఆస్తమా, టిబి, తలసే మియా వంటి వ్యాధుల చికిత్సకూ అలాగే బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే యాంటీ బయాటిక్స్‌కూ ఇది వర్తిస్తుంది. ఈ విధంగా ధరలు పెంచుకోనివ్వకపోతే ఫార్మా కంపెనీలు లాభాలు రావడం లేదు గనుక ఈ మందుల ఉత్పత్తి తమకు లాభదాయం కాదని మానేస్తారని వాదన చేసింది. పెట్రోలియం ప్రహసనం ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తులపైన హద్దూ అదుపు లేని విధంగా సుంకాలు విధించడం ద్వారా ప్రజలపై పడిన భారానికి అంతే లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ముడి చమురు ధర 18 శాతం పడిపోయినప్పటికీ మోడీ సర్కారు వాటి ధరలు తగ్గించకుండా అదే స్థాయిలో కొనసాగించింది. 2022-23లో వివిధ రకాల పన్నులు, సెస్సుల, సుంకాలు రాయల్టీల ద్వారా కేంద్రానికి రూ.3.5 లక్షల కోట్ల రాబడి వచ్చిందంటే హడలిపోవలసిందే. 2014లో మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల విధింపు ద్వారానే రూ. 26.74 లక్షల కోట్ల ఆదాయం పొందింది. కనీసం మనసంటూ లేకుండా విధించే ఈ భారం రవాణా ఖర్చులు పెంచేసి ఆహార ధాన్యాలు, కూరగాయల వంటి సరుకులపై అనేక రూపాల్లో ప్రభా వం చూపిస్తాయి. ఆర్‌బిఐ బూటకాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బిఐ చేసే ప్రయత్నాల గురించి ఎంతగానో దృష్టి కేంద్రీకరిస్తుంటారు. అయితే అదంతా బూటకంగానే కనిపిస్తుంది. 2016 మే నుంచి గడిచిన 102 నెలలో చూస్తే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ నిర్దేశించుకున్న నాలుగు శాతం 28 శాతం దాటిపోయిందని ఆర్థికవేత్తల ఒక అంచనా వెల్లడిరచింది. ఇకపై గరిష్ట పరిమితి ఆరు శాతంగా వుండాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆర్‌బిఐ 28 శాతం సంద ర్భాల్లో అందుకోలేకపోయింది. ద్రవ్యోల్బణం నియంత్రణ కావాలని ఆర్‌బిఐ చేసే హడావుడి కార్పొ రేట్ సంక్షేమం కోసం ఉద్దేశించింది తప్ప ప్రజల ప్రయోజనాలతో ముడిపడిరది కాదని తేలింది. ఈ చర్యలు బ్యాంకుల వడ్డీ రేట్లతోనూ ఇతర ఆర్థిక విధాన బేహారులతోనూ ముడిపడి వుండటమే ఇందుకు కారణమవుతుంది. ఎన్నిసార్లు వాగ్దానాలు గుప్పిస్తున్నా-ధరల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వ విధానం ఈ విధంగా పూర్తిగా కుప్పకూలిపోవడం-అనివార్య ఫలితమే. ఎందుకంటే ఈ విషయంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే జరుగుతున్నది. వనరులు పెంచుకోవడానికి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు పెంచుకోవడం వంటి మోసపూరిత పథకాలకు దిగడంతో పాటు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టతపైన, విస్తరణపైన దృష్టి పెట్టి వుండా ల్సింది. బహిరంగ మార్కెట్‌లో ధరల మంత్రజాలాన్ని అదుపు చేసేందుకు అది విరుగుడుగా పనిచేసి వుండేది.
Opmerkingen