పెద్దపెద్ద అధికారులు ఇక్కడకు రావడం ఏమిటి?
అశ్లీల వీడియోలు ఉన్నాయన్న ప్రచారం
డిప్యూటీ కమాండిరగ్ ఆఫీసర్‌కు రేపు ఫిర్యాదు
ఏవో శ్రీకాంత్‌ను ప్రశ్నిస్తే బయటపడనున్న వాస్తవాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
యుధ్‌సేవా మెడల్ అంటే తెలుసా? దేశం తరఫున ఎన్నో యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం పాటుపడేవారికి ఆర్మీలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది.
ఆర్మీలో మేజర్ జనరల్ అంటే ఏ స్థాయో తెలుసా? టూ స్టార్ ర్యాంక్ ఉన్న మేజర్ జనరల్ అంటే ఆర్మీలో దేశం మొత్తానికి నెంబర్ టూ.
ఇటు హోదా, అటు మెడల్ ఒకే వ్యక్తి దగ్గర ఉంటే అది ఈ దేశానికి సేవ చేసిన రాజ్‌పాల్‌సింగ్ పూనియానే. పదవీ విరమణ చేసినా ఆయనకు ఇచ్చే గౌరవంలో ఈ దేశంలో ఎటువంటి మార్పు ఉండదు. సరిగ్గా అదే వ్యక్తిని తీసుకొచ్చి ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట సంస్థను స్థాపించి శనివారం రాత్రి రిమాండ్‌కు వెళ్లిన బీవీ రమణ ఇక్కడ సన్మానం చేశాడు.
జేడీ లక్ష్మీనారాయణ.. జేడీ అంటే ఆయన ఇంటిపేరు కాదు. ఆయన సీబీఐలో నిర్వహించి జాయింట్ డైరెక్టర్ హోదా. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద అక్రమాస్తుల కేసును స్వయంగా విచారించిన లక్ష్మీనారాయణ కోసం ఈ రాష్ట్రంలో చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. సిన్సియర్ ఐపీఎస్ అధికారిగా ముంబైలో క్రిమినల్ గ్యాంగ్ ఆట కట్టించిన లక్ష్మీనారాయణను శ్రీకాకుళం తీసుకువచ్చి ఇదే బీవీ రమణ ఆయనతో సన్మానం చేయించుకున్నాడు.
జిల్లాలో 14వ ఆంధ్రా ఎన్‌సీసీ బెటాలియన్ ఉంది. ఇందులో పని చేస్తున్నవారు కూడా ఆర్మీకి చెందిన ఉద్యోగులే. ఎంతోమంది ఎన్‌సీసీ బెటాలియన్ ఉద్యోగులు ఇండియన్ ఆర్మీకాలింగ్‌కు వచ్చిపోయారు.
జిల్లా నుంచి ఆర్మీలో మంచి హోదాల్లో పని చేస్తున్న ఎంతోమంది బీవీ రమణ చేతుల మీదుగా సత్కారాలు అందుకున్నారు. వీటన్నింటినీ బయటి నుంచి చూస్తున్న మనకు ఆర్మీలో సేవలందిస్తున్నవారికి రమణ సత్కరించడంలో తప్పేముందనిపిస్తుంది. కానీ ఇదే రమణ తాను ఆర్మీలో పెద్ద హోదాలో పని చేసినప్పుడు వీరందరూ తనతో కలిసిమెలిసి తిరిగినవారేనని, కొందరికి తానే శిక్షణ ఇచ్చేవాడినని విద్యార్థులకు చెప్పుకునేవాడు. తమ గురువు శత్రుదేశం మీదకు యుద్ధానికి వెళితే సింగిల్ హ్యాండ్‌తో చంపేస్తాడని భావించిన విద్యార్థులు ఆ తర్వాత నుంచి ఆయన ఏం చేసినా భరించడం మొదలుపెట్టారు. అందుకే వీపు చీరుకుపోయినా ఎవరూ నోరిప్పడానికి ముందుకు రాలేదు.
ఇన్నింటి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కేవలం ఆర్మీలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగం చేసి మానసిక స్థితి సరిగా లేక గెంటివేయబడ్డ బీవీ రమణది అంటే నమ్మలేం. కచ్చితంగా ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ వెనుక ఇంకెవరివో అండదండలున్నాయి. అందరూ రమణ హింసిస్తున్న వీడియోలు ఎక్కడి నుంచి లీకయ్యాయని ఆలోచిస్తున్నారు తప్ప రమణ చేసిన మోసం కోసం మాట్లాడటంలేదు. జిల్లాలో మాజీ ఆర్మీ అధికారుల సంఘంలో ఉన్న కొందరికి బీవీ రమణ వ్యవహారంపై మొదట్లో అనుమానం ఉండేది. కానీ ఎప్పుడైతే రాజ్‌పాల్‌సింగ్ పూనియా వంటి ఆర్మీ శిఖరమే ఈయన వద్దకు వచ్చిందో అప్పుడే జిల్లాలో ఉన్న మాజీ ఆర్మీ ఉద్యోగులకు ఫీజులు కొట్టేశాయి. అక్కడి నుంచి తన మీద నిఘా లేదని తెలుసుకొని రమణ అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడుకున్నాడు. ఇండియన్ ఆర్మీ అనే పేరు వాడుకోవడమే ఆయన చేసిన మొదటి నేరం. ఇదే మిలటరీ క్యాంపులు నడిచే రాష్ట్రాల్లో అయితే ఈ పేరు వాడినందుకు కచ్చితంగా ఆ బిల్డింగ్‌ను బ్లాస్ట్ చేసుండేవారు. రమణ అదృష్టంకొద్ది ఈ జిల్లా వెనుకబాటుతనం, ఆర్మీలో పిల్లల్ని చేర్చాలన్న తల్లిదండ్రుల తపన కలిసొచ్చాయి.

ఈ ఫొటోలో దర్జాగా కుర్చీలో కూర్చుని ఫైల్ చూసుకుంటూ వెనుక ఒకరితో తలకు మర్దన చేయించుకుంటున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవస్థాపకుడు బీవీ రమణ జిల్లాలో అనేకమంది ప్రముఖులకు, సెలబ్రిటీలకు ఓం భీం బుస్ చేసేశాడు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని, అందుకోసం ముందుగా శిక్షణ తీసుకోవాలని ఏర్పాటుచేసిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థలో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చారంటే ఒక అర్థముంది. నగరంలో ప్రముఖులు, పోలీసు అధికారులు, చివరకు ఆర్మీలో సేవలందించి ఇప్పుడు రిటైర్డ్ అధికారులుగా ఉన్నవారు కూడా బీవీ రమణ మంత్రానికి పడిపోయారు. రమణ తాను ఆర్మీలో కల్నల్‌గా చేశానని కొందరికి, లెఫ్ట్‌నెంట్‌గా చేశానని మరికొందరికి చెప్పుకొచ్చారు. ఆర్మీ డిజిగ్నేషన్ల మీద సామాన్యుడికి పెద్దగా అవగాహన ఉండకపోవడం సహజం. కానీ ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు కూడా రమణ చెప్పినదానిపై అనుమానం రాకపోవడమే విచిత్రం. వాస్తవానికి ఐటీబీపీ విభాగంలో కానిస్టేబుల్‌గా రమణ పనిచేసేవాడు. మానసిక పరిస్థితి బాగోలేదని ఈయన్ను విధుల నుంచి తప్పించారు. కానీ రమణ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నట్టు ఒక ఐడెంటిటీ కార్డు ట్రోల్ అవుతోంది. దీనిపై పోలీసులు కూడా రమణను ప్రశ్నించారు. తన వద్ద ఆ కార్డు లేదని, ఎవరో తయారుచేసి ట్రోల్ చేస్తే, అందుకు బాధ్యత తనది కాదంటూ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట ఎటువంటి రిజిస్ట్రేషన్ రమణకు లేదు. ఆర్మీలో పెద్దస్థాయిల్లో పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత డిఫెన్స్ అకాడమీలు పెట్టుకోడానికి ఇటు ఆర్మీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి. కానీ ఇక్కడ రమణ ఆఫీసరూ కాదు, ఆయన సంస్థకు గుర్తింపూ లేదు. కానీ ఎంచక్కా త్రివిధ దళాలకు చెందిన జెండాలను, లోగోలను ఆయన విచ్చలవిడిగా వాడేసుకున్నారు. రమణ తక్కువ సొమ్ములే వసూలుచేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడని ఇప్పటికీ కొందరు ఆయన్ను వెనకేసుకొస్తున్నారు.
ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ పెట్టిన తొలిరోజుల్లో రమణ ఇబ్బందిపడివుండవచ్చు. కానీ, ఆ తర్వాత తన ఆర్మీ కోచింగ్ సెంటర్‌ను కాస్తా బౌన్సర్ల టీమ్‌గా తయారుచేసేశారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో ఫిజికల్‌గా రాటుదేలిన విద్యార్థులను నిరంతరం ఏదో ఒక షాపు ఓపెనింగ్, ప్రైవేటు ఫంక్షన్లు, పబ్లిక్ ఫంక్షన్లలో సెక్యూరిటీ గార్డులుగా వినియోగించి సంబంధిత సంస్థల నుంచి రమణ కొంతమొత్తాన్ని వసూలు చేసేవారని తెలుస్తుంది. స్థానిక ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి కూడా ఇందులో భాగంగానే పట్టుకెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున వస్త్రాలు దొంగతనాలు జరిగాయని, అవి సీసీల్లో రికార్డయ్యాయని, ఫిర్యాదు ఇస్తామని సంబంధిత యాజమాన్యం భయపెట్టడంతో విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదాడు.
అసలు కాలేజీలో ఇంటర్ చదువుకొనే విద్యార్థులు షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్‌కు, పెద్దల ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్న కూడా ఏ రోజూ ఇక్కడ అధికారుల మెదడులో మొలకెత్తలేదు. ఇక శ్రీకాకుళంలో 5కె, 10కె రన్‌లు జరిగినా ఇండియన్ ఆర్మీ కాలింగ్ విద్యార్థులనే ముందు పెట్టేవాడు. దీని ద్వారా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, నగరంలో ప్రముఖులందరి దృష్టిలోనూ పడాలని రమణ తపన పడ్డాడు. ఇండియన్ ఆర్మీ కాలింగ్‌లో విద్యార్థుల సంఖ్య రానురాను పెరగడం, దీన్ని ఒక పద్ధతి ప్రకారం మార్కెటింగ్ చేయడం కానిస్టేబుల్ స్థాయిలో పని చేసిన రమణ లాంటి వ్యక్తుల బుర్రకు తోచింది కాదు. దీని వెనుక కచ్చితంగా ఓ మాస్టర్‌మైండ్ ఉండేవుంటుంది. ఎందుకంటే తన సంస్థ పేరుతో రమణ నగరంలో చాలామందికి దగ్గరయ్యాడు. చివరకు మాజీ ఆర్మీ అధికారులతో కూడా సన్మానం చేయించుకునే స్థాయికి రమణ పెరిగిపోయాడు.
రెండు చోట్ల హాస్టళ్లు, ఓ కారు మెయింటినెన్స్ వంటివి విద్యార్థుల ఫీజులతో నడిచే వ్యవహారం కాదు. అంతకు మించి ఈ సంస్థలో ఏదో జరుగుతోంది. దీని వెనుక ఎవరో ఉన్నారన్న అనుమానం ఇప్పుడిప్పుడే బలపడుతోంది. మంగళవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీకి చెందిన డిప్యూటీ జనరల్ కమాండిరగ్ ఆఫీసర్ బ్రిగేడియర్ ఎన్‌వీ నంజుదేశ్వర వస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ రచ్చ మీద ఆయనకు ఒక నివేదిక సమర్పించడానికి మాజీ ఆర్మీ ఉద్యోగుల సంఘం సిద్ధపడుతోంది.

వాస్తవానికి ఈ సంస్థను నడిపిస్తున్నది అక్కడ ఏవోగా పని చేస్తున్న శ్రీకాంత్. రమణ పెట్టిన నిబంధనలను పూర్తిగా అమలుచేయడం శ్రీకాంత్ వంతు. ఇందులో భాగంగానే విద్యార్థులను చాలాసార్లు శ్రీకాంత్ కూడా చావచితక్కొట్టాడని తెలుస్తుంది. ఉద్యోగులతో పని చేయించుకోవడం, జీతాలు ఇవ్వకపోవడం, హాస్టల్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలకు బ్రెయిన్‌వాష్ చేయడం వంటివి శ్రీకాంతే చేస్తుంటాడని వినికిడి. రమణ కూడా పోలీస్ ఇంటరాగేషన్‌లో ఎక్కడా శ్రీకాంత్ పేరు చెప్పలేదని, ఆయన బయటవుంటే తన బెయిల్‌కు ప్రయత్నిస్తాడన్న కోణంలోనే శ్రీకాంత్ ఊసెత్తలేదని తెలుస్తుంది. ఈ సంస్థలో మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ శ్రీకాంతే చూస్తుంటాడు. శ్రీకాంత్‌కు సంబంధించిన వీడియోలతో పాటు మరికొన్ని వీడియోలు కూడా విడతలవారీగా విడుదల కానున్నాయని భోగట్టా. ఈ సంస్థలో పనిచేసి జీతాలివ్వక ఏడాది క్రితం వెళ్లిపోయిన కొందరు అప్పట్లో ఉన్న సీసీ ఫుటేజీని స్టోర్ చేసుకొని ఇప్పుడు విడుదల చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో వాస్తవమెంత ఉందో తెలియదు కానీ 2018 నుంచి విడతలవారీగా జిల్లాలో అంటకాగిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ప్రముఖులు ఇప్పుడు తమ బండారం బయటపడుతుందన్న బెంగతో బిగుసుకుపోతున్నారు. తాజాగా ఏ హాస్టల్‌లో అయితే విద్యార్థి మీద రమణ పశువులా ప్రవర్తించాడో అదే హాస్టల్ కాంపౌండ్‌ను బిల్డింగ్ యజమానులు ఆదివారం ఖాళీ చేయించారు.
תגובות