top of page

‘ఆర్మీ కాలింగ్‌’ హింసపై లోకేష్‌ తీవ్ర స్పందన

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Dec 7, 2024
  • 1 min read
  • ‘సత్యం’ ప్రతినిధితో మాట్లాడిన టీడీపీ సెంట్రల్‌ ఆఫీస్‌ వర్గాలు

  • పోలీసుల అదుపులో బీవీ రమణ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ అనే సంస్థను ఏర్పాటుచేసి, ఇక్కడ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను యూఎస్‌బీ కేబుల్‌తో చితకబాదుతూ బండబూతులు తిడుతున్న సంస్థ నిర్వాహకుడు బీవీ రమణ వీడియో హల్‌చల్‌ కావడంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దీనిపై అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు, యూ`ట్యూబ్‌ ఛానళ్లు కథనాలు ప్రచురించాయి. అంతకు ముందే విజయనగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త సొంగ మనోజ్‌కుమార్‌ ఈ వీడియోను రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌కు ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. అదే సమయంలో శుక్రవారం సాయంత్రం అన్ని మీడియాల్లోనూ ఈ కథనం రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. బీవీ రమణ కోసం గాలించారు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు శుక్రవారం సాయంత్రం ‘సత్యం’ ప్రతినిధికి ఫోన్‌ చేసి వాస్తవాలు ఏమేరకు ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులు, సంస్థ రికగ్నైజేషన్‌, నిర్వాహకుడి వ్యవహార శైలి వంటి విషయాలు కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. ‘సత్యం’లో వచ్చిన కథనం చదివామని, తెర వెనుక వాస్తవాలేమిటని ఆరా తీశారు. మంత్రి నారా లోకేష్‌ దీనిపై స్పందించడం కోసం వివరాలు అడుగుతున్నామని పేర్కొన్నారు. వెంటనే కారణాలేమైనా కానీ ఇటువంటి ప్రవృత్తి కలిగిన సంస్థ నిర్వాహకుడిపై జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవాలని లోకేష్‌ ‘ఎక్స్‌’ వేదికగా శ్రీకాకుళం పోలీసు, రాష్ట్ర పోలీస్‌ శాఖలకు టాగ్‌ చేస్తూ ఒక ట్వీట్‌ వేశారు. దీంతో పోలీస్‌ బాస్‌ ఈ వ్యవహారాన్ని టౌన్‌ డీఎస్పీ వివేకానందకు అప్పగించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వాహకులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ వ్యవస్థాపకుడు బీవీ రమణను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు భోగట్టా. బీవీ రమణకు జిల్లాలో ఉన్న కొందరితో లింకులపై ఆరా తీస్తుండగా, ఆయన కళ్లుతిరిగి పడిపోయాడని తెలుస్తుంది. ఆసుపత్రిలో శనివారం చికిత్స చేయించి వైద్యుల సిఫార్సు మేరకు మీడియా ముందు బీవీ రమణను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. బీవీ రమణపై ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటి సాక్ష్యాలన్నీ ఆయన హాస్టల్‌ కాంపౌండ్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఇన్నాళ్లూ పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఒక్క లోకేష్‌ ట్వీట్‌తో మొత్తం యంత్రాంగం కదిలింది. త్వరలోనే అన్ని విషయాలూ పోలీసులే వెల్లడిస్తారని తెలుస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page