కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. బలగలోని బాలా త్రిపురసుందరీ కాలభైరవ ఆలయాన్ని కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ నాగావళి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందడం ఆనందంగా ఉందని, ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. నేటి పోటీ ప్రపంచంలో మనుషుల ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆలయాలకు వస్తుంటారని, వారి మానసిక స్థితిని తెలుసుకొని వారిని సరైన మార్గంలో నడిచేలా ఆలయ అర్చకులు సూచనలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు గణేష్ గురూజీ కేందమంత్రితో మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ ఆవరణలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి ప్రతీరోజూ ప్రత్యేక, కుంకుమ పూజలు, లలితా సహస్ర పారాయణం, గాజులు, కలాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ప్రతీరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో నిర్వహిస్తున్న గోశాలను కేంద్రమంత్రి పరిశీలించి ఆలయ నిర్వాహకులకు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం అమ్మవారి మొక్కులు తీర్చుకుని గణేష్ గురూజీ వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బాలా త్రిపుర సుందరీదేవి అని అన్నారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, పార్టీ మహిళా అధ్యక్షులు తమ్మినేని సుజాత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments