ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
- SATYAM DAILY
- Jun 2
- 2 min read
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు
దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ

దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
అయితే ఇటీవల ఈ డిమాండ్‌కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా గోవధ నిషేధం, గోరక్షణ అంశాల్లో విభేదించే వర్గాలు ఇప్పుడు ఒకే డిమాండ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మూకదాడులు ఆగిపోతాయన్న వాదన
ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్న ముస్లిం నేతల వాదన ఏమిటంటే, ఆవు సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న మూకదాడులు, ద్వేష రాజకీయాలు, సామాజిక ఉద్రిక్తతలు తగ్గాలంటే ఆవుకు జాతీయ జంతువు హోదా ఇవ్వాలని. అప్పుడు ఆవు విషయంలో స్పష్టమైన చట్టబద్ధత ఏర్పడి వివాదాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమస్య మూలాన్ని తొలగించగలిగితే అలాంటి చర్యలను పరిశీలించడంలో తప్పులేదన్నారు.
నిజంగా సమస్యకు మూలం ఆవేనా?
గోవధ నిషేధం ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ వివాదాలు. ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధపై పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉంది. అయితే గోరక్షణ పేరుతో జరిగిన అనేక వివాదాస్పద ఘటనలు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఉదాహరణకు 2015లో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ గ్రామంలో మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని గోమాంసం నిల్వ చేశాడనే అనుమానంతో మూకదాడి చేసి హత్య చేశారు. తర్వాత జరిగిన దర్యాప్తుల్లో ఆ మాంసం గోమాంసమా, కాదా అన్న విషయంపైనే వివాదం కొనసాగింది.
రాజస్థాన్‌లో పశువుల వ్యాపారి పెహ్లూ ఖాన్‌పై జరిగిన దాడి కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చట్టబద్ధంగా పశువులను కొనుగోలు చేసిన పత్రాలు ఉన్నప్పటికీ గోరక్షకుల పేరుతో కొందరు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమస్య కేవలం గోవధ చట్టాల లోపం కాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తుల వ్యవహారశైలిలో కూడా ఉందని.
హోదా మారితే మనస్తత్వం మారుతుందా?
భారతదేశ జాతీయ పక్షి నెమలి. జాతీయ జంతువు పులి. వాటికి ప్రత్యేక హోదా ఉంది. అయినప్పటికీ వేట, అక్రమ రవాణా, అడవి జంతువులపై నేరాలు పూర్తిగా ఆగిపోలేదు. అలాగే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం వల్ల చట్టపరంగా ఒక గౌరవం లభించవచ్చు. కానీ ద్వేష రాజకీయాలు, అనుమానాల ఆధారంగా జరిగే దాడులు, సామాజిక ఉద్రిక్తతలు ఒక్కసారిగా మాయమవుతాయని చెప్పడం కష్టం.
బాబ్రీ వివాదం గుర్తుచేస్తున్న చరిత్ర
బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమైన తర్వాత ఇకపై ఇలాంటి వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో 1991లో ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం తీసుకువచ్చారు. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న మతపరమైన స్థితిని మార్చరాదని ఆ చట్టం పేర్కొంది. అయితే తర్వాతి సంవత్సరాల్లో కాశీ, మథుర వంటి ప్రాంతాల్లో కొత్త వివాదాలు తెరపైకి వచ్చాయి. అంటే ఒక చట్టం తీసుకురావడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని ఈ ఉదాహరణ చూపిస్తోంది.
ముస్లిం సమాజంలోనూ భిన్నాభిప్రాయాలు
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్న కొందరు ముస్లిం నేతలు మొత్తం ముస్లిం సమాజం తమ వెంటే ఉందని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియా, మేధావుల వర్గాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ముస్లిం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఈ డిమాండ్‌ను ‘సమస్యకు అసలు పరిష్కారం కాదు’ అని విమర్శిస్తున్నారు. చట్టాల కంటే చట్టాలను అమలుచేసే సంకల్పం, నేరస్థులపై కఠిన చర్యలే ముఖ్యమని వారు అంటున్నారు.
అసలు పరిష్కారం ఏమిటి?
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలా వద్దా అన్నది ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయం. దానిపై అనుకూల, ప్రతికూల వాదనలు ఉండవచ్చు. కానీ దేశంలో సామరస్యం నెలకొనాలంటే కేవలం కొత్త హోదాలు, కొత్త చట్టాలు సరిపోవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు, సామాజిక న్యాయం, పరస్పర గౌరవం, రాజకీయ సంకల్పం కూడా అవసరం. ఎందుకంటే సమస్య ఆవు హోదాలో లేదని, ఆవు పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే రాజకీయ, సామాజిక ధోరణుల్లో ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ‘ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాంతి వస్తుందా? లేక శాంతి కోసం మనస్తత్వం మారాల్సి ఉందా?’
-సత్యండెస్క్, శ్రీకాకుళం






Comments