top of page

ఆవుల నుంచి ఆన్‌లైన్‌ వరకు..!

Writer: DV RAMANADV RAMANA
  • ఆవుల నుంచి ఆన్‌లైన్‌ వరకు..!

  • `మొదటికీ ఇప్పటికీ ఎన్నికల్లో ఎన్నో మార్పులు

  • `1951నాటి తొలి ఎన్నికల్లో 4 నెలలు.. 68 దశల్లో పోలింగ్‌

  • `ఇప్పుడు రెండు నెలలు.. ఏడు దశలే..

  • `దాదాపు ఐదున్నర రెట్లు పెరిగిన ఓటర్లు

  • `అదే సమయం 80 రెట్లు పెరిగిన ఎన్నికల నిర్వహణ ఖర్చు


ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లో మొదలైన ఎన్నికల ద్వారా ప్రజా ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియ ఇప్పటికీ అవిచ్ఛినంగా కొనసాగుతోంది. పెరుగుతున్న ఓటర్లు, ఖర్చుల లెక్కలు చూసుకుంటే ఎన్నికల నిర్వహణ చిన్న విషయం కాదు.. ఒక మహాక్రతువు. కొన్ని కోట్ల మంది సిబ్బంది, అధికారులు నెలల తరబడి శ్రమిస్తే తప్ప ఈ క్రతువు విజయవంతం కాదన్నది వాస్తవం. దేశంలో ప్రస్తుతం 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటులోని 543 లోక్‌సభ స్థానాలకు, అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇంతపెద్ద ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నడూ లేనంత సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్రకటించింది. దాదాపు రెండు నెలలపాటు మొత్తం ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసింది. దీన్నే అతి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియగా భావిస్తూ.. ఇంత సుదీర్ఘ కాలం ఫలితాల కోసం ఎదురు చూడాలా? అని ప్రజలు, రాజకీయ నాయకులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కసారి దేశంలో జరిగిన మొదటి ఎన్నికల ప్రక్రియను గుర్తు చేసుకుంటే.. అమ్మో.. ఇప్పుడే నయం అనిపించకమానదు. ఇప్పటితో పోలిస్తే తక్కువ ఓటర్లు, తక్కువ సిబ్బంది, తక్కువ ఖర్చుతో జరిగిన స్వాతంత్య్ర భారత మొదటి ఎన్నికలనాటికి ఒక్కసారి వెళదాం.

అదే తొలి ఎన్నికల అనుభవం

సుమారు రెండు శతాబ్దాల బ్రిటీష్‌ పాలన అనంతరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య దేశంగా, ఎన్నికల్లో ప్రజల ఓటు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే ఘనమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అంతకుముందు ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోయినా.. ఉన్నంతలో విజయవంతంగానే తొలి ఎన్నికలను నిర్వహించుకోగలిగింది. దేశానికి స్వాతంత్య్రం లభించడం ఖాయమైన తర్వాత బ్రిటీష్‌ పాలన చరమాంకంలో ప్రావిన్షియల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ సభ్యుల ద్వారా 1946లో రాజ్యాంగ సభను ఎన్నుకున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగ సభే పార్లమెంటుగా వ్యవహరించింది. ఇందులో జరిగిన చర్చలు, సూచనల ఆధారంగానే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలోని కమిటీ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. దీన్ని 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ ఆమోదించగా 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సొంత రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేసి ఐదేళ్లకోసారి ప్రజా ప్రభుత్వాలను ఎన్నుకునేలా సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

అబ్బురపర్చిన నాటి ఎన్నికల క్రతువు

అంతకుముందు రాజులు, సంస్థానాధీశుల పాలన.. ఆ తర్వాత బ్రిటీష్‌ పాలనను చూసిన దేశ ప్రజలకు అంతవరకు ఎన్నికలంటే ఏమిటో తెలియదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలే ఓట్లు వేసి తమను పాలించేవారిని ఎన్నుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఎన్నికలు నిర్వహిస్తారని, ప్రజలు తమకు నచ్చిన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవచ్చని ప్రచారం ప్రారంభమైంది. దాంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. తమ రాజు (ప్రజాప్రతినిధి)ను తాము ఎన్నుకునే అవకాశం లభించినందుకు విస్మయానందాలతో మురిసిపోయారు. ఎక్కడ చూసినా అదే చర్చ. అయితే ఎలా ఓటు వేయాలి.. ఎవరు పోటీలో ఉన్నారు.. ఏ పార్టీ సిద్ధాంతం ఏమిటి.. ఇలాంటి విషయాలు ఓట్లు వేసే ప్రజలకు తెలిసేదెలా?.. ప్రచారం ఎలా చేయాలి? అన్న అంశాలు రాజకీయ పార్టీలకు, ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని పెద్ద సవాల్‌గా మారాయి. దాంతో ఎన్నికల నిర్వహణ, ఓటు వేసే విధానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. కొత్తగా ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. దేశంలో ఉన్న మూడువేలకు పైగా సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో వివరిస్తూ స్లైడ్లు, ప్రచార చిత్రాల రూపంలో ప్రదర్శించి అవగాహన కల్పించారు. 21 ఏళ్లు పైబడినవారంతా ఓటర్లుగా నమోదై ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం డాక్యుమెంటరీని ప్రదర్శించింది.

అదే అతి సుదీర్ఘ ఎన్నికల క్రతువు

మొదటి లోక్‌సభ ఎన్నికలే దేశంలో అతి సుదీర్ఘ ఎన్నికల క్రతువుగా ఇప్పటికీ రికార్డుల్లో నిలిచింది. 1951 అక్టోబర్‌ 25 నుంచి ప్రారంభమై 1952 ఫిబ్రవరి 21 వరకు సుమారు నాలుగు నెలల పాటు ఇది కొనసాగింది. అప్పట్లో దేశంలో 489 లోక్‌సభ స్థానాలే ఉండేది. వాటికి మొత్తం 68 దశల్లో ఎన్నికల్లో నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిని తహసీల్‌ (ప్రస్తుతం కిన్నౌర్‌ జిల్లా)లో నివసిస్తున్న బౌద్ధులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన మొదటి భారతీయులుగా గుర్తింపు పొందారు. శీతాకాలంలో ఈ ప్రాంతాలు మంచుతో కప్పబడిపోతాయన్న ఉద్దేశంతో మొదటి దశలోనే 1951 అక్టోబర్‌ 25నే ఇక్కడ పోలింగ్‌ నిర్వహించారు. తొలిసారి జరిగిన ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొనగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వారి సంఖ్య ఐదున్నర రెట్లు పెరిగి 97 కోట్లకు పెరిగింది. ఆనాటితోపోలిస్తే ఎన్నికల ఖర్చు మాత్రం దాదాపు 80 రెట్లు పెరిగిపోయింది. తొలి ఎన్నికల్లో ఒక్కో ఓటర్లు సగటున 62 పైసలు చొప్పున మొత్తం రూ.10.45 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి సగటున ఒక్కో ఓటురుకు రూ.72 చొప్పున సుమారు రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. 3.80 లక్షల రీముల పేపర్లను ఉపయోగించి ఓటర్ల జాబితాలు ప్రింట్‌ చేశారు. వాటి ఆధారంగా పోలింగ్‌ జరిగింది. ఓటర్లు వేసిన బ్యాలెట్లను భద్రపరిచేందుకు దాదాపు 20 లక్షల బ్యాలెట్‌ బాక్సులు వినియోగించారు. ఇవి బుల్లెట్‌ ప్రూఫ్‌ బాక్సులు కావడం విశేషం. అలాగే ఒకసారి ఓటు వేసినవారు మళ్లీ వేయకుండా నిరోధించేందుకు, దొంగ ఓటర్లను గుర్తించేందుకు వీలుగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన చెరగని ఇంకును ఉపయోగించారు. ఓటు వేసిన వారి వేలిపై ఇంకు గుర్తు పెట్టడం కూడా అప్పుడే మొదలైంది.

ఓటర్ల జాబితా తయారీలో తిప్పలు

ఎన్నికల నిర్వహణలో ఓటర్ల నమోదు, వారి జాబితాల తయారీయే. వీటికోసం వీటి కోసం అప్పట్లో ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించిన 16,500 మంది సిబ్బంది ఆరు నెలలపాటు దేశవ్యాప్తంగా తిరిగి ఓటర్లను నమోదు చేశారు. అయితే అప్పటి సామాజిక పరిస్థితులు, సంప్రదాయాల నేపథ్యంలో ఓటర్ల నమోదు చాలా కష్టంగా మారింది. ఓటర్ల పేరు, వయస్సు, లింగం తదితర సమాచారాన్ని సేకరించే సమయంలో మహిళలు తమ పేర్లను అపరిచితులకు వెల్లడిరచేందుకు నిరాకరించారు. పేరు అడిగితే ఫలానా వ్యక్తి భార్య అనో లేక ఫలానా వ్యక్తి తల్లి, కుమార్తె, సోదరి అని మాత్రమే చెప్పేవారు తప్ప తమ పేరు నేరుగా చెప్పడానికి మాత్రం నిరాకరించారు. దాంతో పూర్తిస్థాయి సమాచారం లేక తొలి ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి 28 లక్షల మంది పేర్లను తొలగించాల్సి వచ్చింది.

అందరికీ అర్థమయ్యేలా గర్తులు

మొదటి లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో 85 శాతం ప్రజలు నిరక్షరాస్యులే. దాదాపు 40 కోట్ల జనాభాలో 15 శాతం మందికి మాత్రమే ఒక భాషలో చదవడం, రాయడం తెలుసు. దీంతో అభ్యర్థుల పేర్లు, ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల పేర్లను బ్యాలెట్‌ పేపర్లపై ముద్రిస్తే ఓటర్లు తెలుసుకునే పరిస్థితి లేదు. దీన్ని ఎదుర్కొనేందుకు సుకుమార్‌ సేన్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయించి వాటినే బ్యాలెట్‌ పేపర్లలో ముద్రించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం కాంగ్రెస్‌కు కాడెద్దులు, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి చేతి గుర్తును కేటాయించింది. ఏ పార్టీ ఏ గుర్తుతో పోటీ చేస్తోందన్నది ఓటర్లకు తెలియడం ఎలా అన్నది మరో సమస్యగా మారింది. ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహించగా, ఆయా పార్టీల స్థానిక నాయకులు ఓట్లు అభ్యర్థిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. అయితే కోల్‌కతా వీధుల్లో వినూత్నంగా ఆవుల వీపుపై బెంగాలీ భాషలో ‘ఓటు ఫర్‌ కాంగ్రెస్‌’ అని రాసి వీధుల్లోకి వదిలేవారు. ఆనాటి ఎన్నికల నిర్వహణ, ప్రచారానికి భిన్నంగా ప్రస్తుత ఎన్నికలు డిజిటల్‌, ఆన్‌లైన్‌ ప్రచారంతోపాటు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల స్థాయికి చేరింది.

 
 
 

Komentarze


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page