top of page

ఆశీలిస్తారా.. షాపు మూసేయాలా?

Writer: NVS PRASADNVS PRASAD
  • జీఎస్టీ చెల్లిస్తున్న షాపుల నుంచి అనధికారికంగా వసూలు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమానులు



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తాంబూళాలిచ్చాం.. తన్నుకుచావండి అన్నట్టుంది శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో అధికారుల తీరు. కార్పొరేషన్‌ పరిధిలో రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్నవారి నుంచి, మార్కెట్‌లో తోపుడుబళ్లు నుంచి వసూలు చేయాల్సిన ఆశీలు ఇప్పుడు జీఎస్టీ కట్టి ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఆదాయాన్ని సమకూరుస్తున్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు చేస్తుండటంతో ఈ పంచాయితీ పోలీసుల వరకు చేరింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఈ నెలాఖరుతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వసూలుచేసే కాంట్రాక్ట్‌ను హటకేశం అనే వ్యక్తి రూ.43 లక్షలకు దక్కించుకున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఇంత సొమ్ము రాదనుకున్నారో, లేదూ వచ్చిన లాభం సరిపోలేదనుకున్నారో తెలియదు కానీ ఆశీల పరిధికి రాని వాహనాల నుంచి కూడా లెక్కాపత్రం లేకుండా రూ.100 నుంచి రూ.200 వరకు అనధికారికంగా ఆశీలు వసూలు చేస్తున్నారని ఎప్పట్నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే దీనికి కొనసాగింపుగా శనివారం స్థానిక పెద్దపాడు రోడ్డులో జీఎస్టీ చెల్లించి అన్ని బిల్లులతో కూడిన సరుకులు తెస్తున్న లారీలకు ఆశీలు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్‌కు చెందిన మనుషులు గొడవకు దిగారు. లారీ డ్రైవర్లు ఆశీలు చెల్లించకపోతే సరుకును దించుకుంటున్న షాపు యజమానులు ఇవ్వాలని, లేదంటే వ్యాపారాలు కొనసాగనివ్వమని రచ్చ చేయడంతో వ్యాపారులు నేరుగా ఎస్పీకి ఫోన్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఎటువంటి లిటిగేషన్లు ఉన్నా కార్పొరేషన్‌ అధికారుల వద్ద తేల్చుకోవాలి గాని, షాపుల వద్ద గొడవ చేస్తే ఊరుకునేది లేదని పోలీసులు చెప్పడంతో అక్కడ కొట్లాట వాతావరణం తప్పింది. నిబంధనల ప్రకారం నగరంలో పెద్ద మార్కెట్‌, చేపల మార్కెట్‌, తోపుడుబళ్ల దగ్గర్నుంచి ఆశీలు వసూలు చేయాలి. ఇది కాకుండా ఎటువంటి బిల్లులు, జీఎస్టీ లేకుండా ముత్యాలమ్మ తల్లి పెద్దమార్కెట్‌కు వచ్చే లారీల నుంచి కూడా ఆశీలు వసూలుచేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఒక కంపెనీ నుంచి జీఎస్టీ, వేబిల్లు వంటివి చెల్లించి శ్రీకాకుళం సరుకు తీసుకొస్తే, ఆ లారీలకు ఆశీలు ఇమ్మనడం చట్టవిరుద్ధం. 1965 నాటి మున్సిపల్‌ చట్టం ప్రకారం సంతలు, నాటుబళ్ల నుంచి కొంత మొత్తాన్ని వసూలుచేసి, దాన్ని స్థానికంగా అభివృద్ధి పనుల కోసం వాడాలని సూచించారు. కానీ ఈ నెల 31తో ఆశీల కాంట్రాక్ట్‌కు గడువు పూర్తవుతుండటం వల్ల రశీదు ఇస్తే రూ.200, లేదూ అంటే రూ.150, ఇంకా కుదరదంటే రూ.100 అయినా ఇవ్వాలని అనధికారికంగా వసూళ్లు మొదలుపెట్టారు. ఇది ఇవ్వలేదని శనివారం కొంతమంది షాపుల మీదకు దండయాత్రకు వచ్చారు. నిబంధనల ప్రకారమైతే ఇలా టాక్స్‌లు కట్టి వేబిల్లులతో వచ్చే లారీలకు ఆశీలు వసూలుచేసే అవకాశం లేదు. సాధారణంగా కార్పొరేషన్‌ పరిధిలో రూ.35 లక్షలకు ఆశీల పాట ఖరారైతే గొప్ప. కానీ ఈసారి విలీన పంచాయతీలతో పాటు అన్ని షాపుల నుంచి ఆశీలు వసూలు చేసుకోవచ్చని చెప్పారో ఏమో తెలీదు కానీ దబాయించి మరీ వసూలు చేసేస్తున్నారు. ఇదే విషయాన్ని కార్పొరేషన్‌లో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళితే.. ఈ నెల 31తో గడువు ముగిసిపోతుండగా ఇన్నాళ్లూ ఏం చేశారని ఎదురు ప్రశ్నించడం కొసమెరుపు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page