పలాసలో స్థలం మాదేనంటూ తెరపైకి మరికొందరు
కౌన్సిలర్ బోర బుజ్జికి రిజిస్ట్రేషనైన స్థలం వేరేచోట
మేమే వారసులమంటున్నమాజీ ఎమ్మెల్యే కుటుంబీకులు
కులం, గోత్రం ఆధారంగా నకిలీలతో సాక్షి సంతకాలు
లిటిగేషన్ తీర్చి చవగ్గా కొట్టేయడానికి బంగారం వ్యాపారి సిద్ధం
హాట్‌టాపిక్‌గా మారిన ఊరి సొమ్ము రామభజన భాగోతం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కేటీ రోడ్డుకు ఆనించి పశ్చిమ దిశలో ఉన్న మధురిమ ఎలక్ట్రికల్ షాపు పక్కన 219/3 సర్వే నెంబరులో అప్పనంగా రూ.3 కోట్ల విలువైన ఆస్తి కనిపించడంతో దీనికి రోజురోజుకు వారసులు పుట్టుకొస్తున్నారు. సుదీర్ఘకాలం ఇక్కడ టీకొట్టు నడిపి, కరోనా పాండమిక్ తర్వాత అత్తసొమ్ము అల్లుడు దానం మాదిరిగా వేరే వస్త్రదుకాణానికి సబ్‌లీజుకు ఇచ్చి సొమ్ములు సంపాదించిన లీజుదారుడు నెయ్యల రామారావు, ఆ తర్వాతన తనకు ఇన్నాళ్లూ లీజుకు ఇచ్చిన వ్యక్తి కాంటాక్ట్‌లో లేకపోవడంతో కాలంచేసి ఉంటాడని భావించి ఏకంగా ఆ ఆస్తి తన కుమారుడి పేరిట ధారాదత్తం చేసిన అంశాన్ని మంగళవారం ‘ఆస్తి మీదే.. పత్రాలు మాత్రం మావి’ పేరిట ‘సత్యం’ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో 565.5 చదరపు అడుగుల స్థలం రూ.3 కోట్లు పలుకుతుందంటే కాశీబుగ్గలో భూముల విలువలు మామూలుగా లేవని తెలుసుకున్న అసలు, కొసరు వారసులు ఇప్పుడు రంగంలోకి వస్తున్నారు.
టీకొట్టు కోసం అద్దెకు తీసుకున్న నెయ్యల రామారావుకు స్థలం యజమాని ఖాళీ చెయ్యమని బతిమాలినా పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. స్థలం యజమాని మృతి చెందినట్టు పుకారు షికారు చేయడంతో రూ.కోట్లు విలువైన స్థలాన్ని సొంతం చేసుకొనేందుకు అనేక మంది ప్రయత్నాలు చేశారు. అందులో మొదటి వ్యక్తి ప్రభుత్వ ఐటీఐలో పనిచేస్తూ ప్రైవేట్‌గా మున్సిపాలిటీ ప్లాన్లు ఇచ్చే వి.వెంకటరావు అని తెలిసింది. ఈ స్థలానికి వారసులెవరూ లేరని తెలుసుకొని నెయ్యల రామారావును అక్కడ నుంచి ఖాళీ చేయించాలని టీకొట్టు వద్దకు వెళ్లి గొడవపడ్డారని తెలుస్తుంది. దీంతో రామారావు కుమారుడు రాజుకు పరిచయం ఉన్న కొందరు పెద్దలు వద్దకు వెళ్లి వెంకటరావు తమను బెదిరిస్తున్న విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. దీనికి సమాంతరంగా వెంకటరావు మరో నగరంలోని బంగారం వ్యాపారి వద్దకు వెళ్లి బేరం పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఖరగ్‌పూర్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న మందస మండలం వరదరాజపురానికి చెందిన యు.మన్మధరావును తెరపైకి తీసుకువచ్చి సదరు స్థలానికి వారసుడిగా పరిచయం చేశారు. మన్మధరావు తన వద్ద ఉన్న 1968 నాటి డాక్యుమెంట్ 2508/68ను తీసుకువచ్చి బంగారం వ్యాపారికి ఇచ్చినట్టు తెలిసింది. దీంతో బంగారం వ్యాపారి తెరవెనుక ఉండి మన్మధరావు వద్ద ఉన్న డాక్యుమెంట్‌తో కౌన్సిలర్ బోర బుజ్జికి రూ.80 లక్షలకు సర్వే నెంబర్ 225/1లో ఉన్న స్థలాన్ని విక్రయించారు.
రూ.80 లక్షల్లో రూ.10 లక్షలు చెక్కు రూపంలో రూ.3.50 లక్షలు నగదు రూపంలో అందించినట్టు తెలిసింది. మిగతా మొత్తం వివాదం పూర్తిస్థాయిలో తొలగిన తర్వాత ఇవ్వడానికి బంగారం వ్యాపారి శివానంద సమక్షంలో అంగీకారం కుదిరినట్టు తెలిసింది. బోర బుజ్జి ఇచ్చిన రూ.10 లక్షల చెక్కు బౌన్స్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా మన్మధరావు వద్ద ఉన్న 1968 నాటి డాక్యుమెంట్ ప్రకారం సర్వే నెంబర్ 225/1లో ఆ స్థలాన్ని పలాసకు చెందిన దేవరకొండ జగన్నాధమ్మ నుంచి కొనుగోలు చేసినట్టు ఉంది. ఆమెకు ఈ స్థలం ఏవిధంగా సంక్రమించిందో ఎక్కడా ప్రస్తావించలేదు. బోర బుజ్జి కొనుగోలు చేసినట్టు చెబుతున్న స్థలానికి, వివాదాస్పద స్థలానికి మధ్య జీటీ రోడ్డు ఉంది. వివాదాస్పద స్థలం శ్రీనివాస లాడ్జి వైపు ఉండగా, బోర బుజ్జి కొనుగోలు చేసిన స్థలం శ్రీనివాస లాడ్జ్‌కు ఎదురుగా ఉన్న రోడ్డులో ఉంది. అయితే ఈ స్థలానికి హద్దులు ఒక్కటే కావడంతో వివాదాస్పద స్థలాన్నే కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.

సాయికి అంత స్తోమత లేదు
మరోవైపు టీకొట్టు తొలగించి కంటైనర్‌ను ఏర్పాటుచేసి బట్టల దుకాణానికి అద్దెకు ఇచ్చిన నెయ్యల రామారావు, ఈ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని కుమారుడు రాజుకు పిత్రార్జితంగా సంక్రమించినట్టు సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించారు. వివాదాస్పద స్థలాన్ని రాజు వదిలించుకోవడానికి నగరానికి చెందిన కొందరు వైకాపా, టీడీపీ నాయకులను ఆశ్రయించినట్టు తెలిసింది. చివరికి టీడీపీ నాయకులు మధ్యవర్తిత్వంతో రియల్ ఎస్టేట్ కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న రొక్కం సాయికి రూ.1.50 కోట్లకు విక్రయించి చేతులు దులుపుకొన్నారు. వివాదాస్పద స్థలం విక్రయించిన నెయ్యల రాజుకు పూర్తిస్థాయిలో డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. అయితే రొక్కం సాయి రూ.1.50 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినంత ఆర్ధిక స్తోమత లేదని పలాస`కాశీబుగ్గలో ప్రచారం ఉంది. ఖరగ్‌పూర్ నుంచి వచ్చిన రొక్కం మీనాక్షి, హరీష్‌లను వివాదాస్పద స్థలానికి వారసులుగా పరిచయం చేయించి వారితో సాక్షుల సంతకాలు పెట్టించడానికి రొక్కం సాయిని వాడుకొని ఆయన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివెనుక పెద్దమనుషులుగా చలామణి అవుతున్న కొందరు వ్యాపారులు ఉన్నారని మున్సిపాలిటీలో చర్చ సాగుతుంది. వివాదాస్పద స్థలాన్ని ఎవరికివారే మాదేనంటూ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి స్థల యజమాని బొత్స గోపాలరావు బతికే ఉన్నారని సమాచారం అందించడం కొసమెరుపు. ఆయన బతికే ఉన్నా మతిస్తిమితం కోల్పోయినట్టు పలాసలో ప్రచారం సాగుతుంది. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టడానికి బంగారం వ్యాపారి శివానంద రంగంలోకి దిగినట్టు తెలిసింది. రొక్కం సాయికి నెయ్యల రాజు నుంచి రిజిస్ట్రేషన్ ద్వారా దఖలుపడిన వివాదాస్పద స్థలాన్ని కౌన్సిలర్ బోర బుజ్జికి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బంగారం వ్యాపారి శివానంద మధ్యవర్తిత్వంతో బోర బుజ్జి, రొక్కం సాయి మధ్య చర్చలు సాగినట్టు తెలిసింది.
రద్దు చేయాలని ఫిర్యాదు
బోర బుజ్జికి రొక్కం సాయి రిజిస్ట్రేషన్ చేయడం పూర్తయితే, రెండు వర్గాలూ కలిసిపోయి ఆ స్థలం మీద వివాదానికి పుల్‌స్టాప్ పెట్టినట్టవుతుంది. అప్పుడు దీన్ని బోర బుజ్జి ద్వారా బంగారం వ్యాపారికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీరి మధ్య అంగీకారం కుదిరినట్టు తెలిసింది. చివరికి స్థలయజమానికి దక్కకుండా జీటీ రోడ్డులో సర్వే నెంబర్ 219/3లో ఉన్న 565.5 చదరపు అడుగుల స్థలం నాలుగో వ్యక్తి చేతిలో పెట్టడానికి రంగం సిద్ధమైపోయినట్టు పలాసలో చర్చ సాగుతుంది. అందుకోసం పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది. బ్రహ్మణతర్ల మాజీ ఎమ్మెల్యే నిచ్చెర్ల అప్పారావు వారసులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. దీనికి కారణంలో సర్వే నెంబర్ 219లో నిచ్చెర్ల అప్పారావు వారసులకు భూములు ఉన్నాయి. వీరికి పోటీగా పట్టణంలో ప్రముఖ వ్యాపారి పెంట గున్నయ్య వారసులు ఆ స్థలం తమదేనంటూ గళం విప్పడానికి సిద్ధమవుతున్నారు. వీరికి కూడా ఈ వివాదాస్పద స్థలం సమీపంలో స్థలాలు ఉన్నాయి. మరోవైపు వివాదాస్పద స్థలానికి వారసుంటూ తెరపైకి వచ్చిన ఖరగ్‌పూర్‌లో నివాసం ఉంటున్న పలాసకు చెందిన బొత్స గోపాలరావు కుటుంబ సభ్యులకు స్థలం దురాక్రమణ చేసి చేతులు మారిపోయిందని సమాచారం అందినట్టు తెలిసింది. దీంతో వారు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టి వాటిని రద్దు చేయాలని సీఎంవోకు, డైరెక్టర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్‌కు, జిల్లా రిజిష్ట్రర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. మున్సిపాలిటీలో కొందరు వ్యక్తులు చేస్తున్న అరాచకాల వల్ల పలాస బ్రాండ్ దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమాలు అదుపు చేయలేకపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఇప్పుడు స్వార్జిత భూములను తన్నుకుపోవాలని కొందరు దురాక్రమణదారులు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Comments