top of page

ఆస్తి మీదే.. పత్రాలు మాత్రం మావి!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • పలాస`కాశీబుగ్గలో వెలుగులోకి భూదందా

  • రూ.3 కోట్ల స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు

  • వేరేవారి ఆస్తికి లోకల్‌గా పొజిషన్‌ సర్టిఫికెట్‌

  • సర్వే నెంబరు మార్చి అవే హద్దులతో కౌన్సిలర్‌ పేరిట రిజిస్ట్రేషన్‌

  • అసలు హక్కుదారులు కోల్‌కతాలో మకాం

  • కోట్లు పంచుకున్న పార్టీ నేతలు



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పలాస`కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో అక్రమార్కుల ఆగడాలకు అదుపు లేదని మరోమారు రుజువైంది. ప్రభుత్వాలు మారినా కబ్జాకోరులు మాత్రం వారి పాత సంప్రదాయానికి పదునుపెట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ చోటా నాయకుల హస్తం ఉందని ప్రచారం సాగుతోంది. నగరం నడిబొడ్డున కేటీ రోడ్డుకు ఆనించి పశ్చమ దిశలో మధురిమ ఎలక్ట్రికల్‌ షాపు పక్కన ఉన్న సర్వే నెంబర్‌ 219/3లో సుమారు రూ.3కోట్ల విలువైన 565.5 చదరపు అడుగుల స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని, దాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు కోడై కూస్తున్నారు. వాస్తవంగా ఈ వివాదాస్పద స్థలం వీరిరువురిది కాదని, దీని వారసులు కోల్‌కతాలో ఉన్నారని పట్టణంలో టాక్‌ నడుస్తోంది. దీని ప్రకారం చూస్తే కొందరు ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని సొంతం చేసుకోడానికి పోటాపోటీగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు భావించాల్సివుంది. జీవనోపాధి కోసం టీకొట్టు పెట్టుకోవడానికి ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇచ్చినందుకు స్థల యజమానికి సున్నం పెట్టి దాన్ని వారసత్వంగా ఆపాదించినట్టు నెయ్యల రామారావు తన కొడుకు రాజు పేరున 2023 సెప్టెంబర్‌ 16న డాక్యుమెంట్‌ నెంబర్‌ 5275/23తో సెటిల్మెంట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆతర్వాత ఆ స్థల వారసుడినంటూ మందస మండలం వీఆర్‌ పురం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి మన్మధరావు 1968 లింక్‌ డాక్యుమెంట్‌ 2508/68 ద్వారా 2024 డిసెంబర్‌ 28న కౌన్సిలర్‌ బోర బుజ్జికి రిజిస్ట్రేషన్‌ చేశారు. (డాక్యుమెంట్‌ 13222/24 ద్వారా దఖలుపరిచారు). ఈ వివాదం నడుస్తుండగానే సెటిల్మెంట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కలిగివున్న నెయ్యల రాజు ఆ స్థలాన్ని టీడీపీ నాయకుల సహకారంతో రొక్కం సాయికి జనవరి 30న డాక్యుమెంట్‌ నెంబర్‌ 557/25న రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇదంతా స్థల అసలు యజమానికి తెలియకుండానే వ్యవహారం నడిపించినట్టు పట్టణంలో హాట్‌టాపిక్‌.

అద్దెకు ఉంటూ స్థలం కాజేశారా?

ఈ స్థలానికి అసలైన యజమాని కాశీబుగ్గకు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి బొత్స గోపాలరావు. ఈయన ఖరగ్‌పూర్‌లో నివాసముంటూ 2016లో మృతి చెందినట్టు ప్రచారం జరగడంతో ఆ స్థలాన్ని అప్పటికే టీకొట్టుకు అద్దెకు తీసుకున్న నెయ్యల రామారావు సొంతం చేసుకోవడానికి పావులు కదిపారు. సుమారు మూడు దశాబ్ధాలుగా పునాదుల ముందు భాగంలోని ఖాళీ స్థలంలో టీకొట్టు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న రామారావును ఖాళీ చేయాలంటూ వచ్చేవారికి ఎదురుతిరగడం ప్రారంభించారు. అద్దెకు స్థలం ఇచ్చిన వ్యక్తి వస్తే ఖాళీ చేస్తానని చెప్పి తిప్పి పంపేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే స్థల యజమాని మృతి చెందాడని ప్రచారం జరగడంతో రామారావు స్థలాన్ని సొంతం చేసుకోవడానికి పావులు కదిపాడు. కోవిడ్‌ సమయంలో టీకొట్టు మూతపడటంతో రామారావు కుమారుడు రాజు ఒక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించాడు. దీనికోసం ఒక కంటైనర్‌ను టీకొట్టు స్థలంలో ఏర్పాటుచేశాడు. ఈ వ్యాపారం కొన్ని రోజులకే మూతపడిరది. దీంతో ఆ కంటైనర్‌ను రెడీమేడ్‌ వ్యాపారం నిర్వహించడానికి ఒక మార్వాడీకి నెలకు రూ.30వేలకు అద్దెకు ఇచ్చేశాడు. ఆ మొత్తాన్ని సదరు వ్యాపారి ప్రతి నెల రాజు ఖాతాలోనే జమ చేస్తున్నాడు. ఈ స్థలానికి చెందిన వారసులు ఎవరూ లేరని ప్రచారం జరగడంతో దీన్ని సొంతం చేసుకోవడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. స్థలం ఖాళీ చేయాలని నెయ్యల రామారావును పలాస పట్టణంలోని కొందరు వ్యక్తులు ఒత్తిడి తీసుకువచ్చినా ఆయనకున్న పరిచయాలతో దాన్ని తిప్పికొడుతూ వచ్చాడు. ఆ క్రమంలోనే రామారావు తన కుమారుడు రాజుకు వారసత్వంగా దఖలుపడినట్టు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ సృష్టించారు.

వారసులను సాక్షులుగా చూపించి

ప్రస్తుతం ఆ స్థలం నెయ్యల రాజు స్వాధీనంలో ఉండడంతో కౌన్సిలర్‌ బోర బుజ్జి వివాదాస్పద స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా దాని జోలికి వెళ్లలేదు. రామారావు తన కుమారుడు రాజు పేరుతో వారసత్వం సెటిల్మెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత దీన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ ప్రయత్నాలకు కొన్ని అదృశ్య శక్తులు అడ్డుతగలడంతో దీనికోసం టీడీపీ నాయకులను ఆశ్రయించారని ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఈ స్థలాన్ని విక్రయించి 50`50 వాటాగా పంచుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే వివాదాస్పద స్థలానికి వారసులుగా ఖరగ్‌పూర్‌కు చెందిన రొక్కం శేషగిరిరావు అనే ఒక వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చారు. శేషగిరిరావు భార్య మీనాక్షి, కుమారుడు హరీష్‌ను స్థలానికి వారసులుగా చూపించి కథ నడిపించిన టీడీపీ నాయకులు ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ పత్రాలపై రొక్కం మీనాక్షి, హరీష్‌లను సాక్షులు మాత్రంగానే చూపించి నెయ్యల రాజును స్థలం యజమానిగా చూపించి రిజిస్ట్రేషన్‌ చేశారు. స్థలానికి వారసులుగా చెప్పకుంటున్న రొక్కం మీనాక్షి, హరీష్‌ల నుంచి రిజిస్ట్రేషన్‌ చేయించకుండా తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించినట్టు డాక్యుమెంట్‌ సృష్టించిన నెయ్యల రాజుతో రొక్కం సాయికి రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనికోసం నెయ్యల రాజుకు రూ.1.50 కోట్లు, మధ్యవర్తులుగా వ్యవహరించిన టీడీపీ నాయకులు, స్థానిక బ్రోకర్లకు రూ.1.50 కోట్లు వాటాలుగా పంచుకున్నారని ప్రచారం సాగుతుంది.

సర్వే నెంబర్‌లో తేడా

ఈ స్థలం తనదేనంటూ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ చూపిస్తున్న కౌన్సిలర్‌ బోర బుజ్జి ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలిసింది. బుజ్జి కొనుగోలు చేసిన స్థలం సర్వే నెంబర్‌ 225/1లో ఉంది. వివాదాస్పద స్థలం సర్వే నెంబర్‌ 219/3 జీటీ రోడ్డుకు పశ్చిమ దిశలో ఉంటే 225/1 తూర్పుదిశలో ఉంది. వివాదాస్పద స్థలంగా మారిన సర్వే నెంబర్‌ 219/3లోని 565.5 చదరపు అడుగుల స్థలానికి ఉన్న హద్దులు, కౌన్సిలర్‌ బోర బుజ్జి కొనుగోలు చేసినట్టు చూపిస్తున్న స్థలానికి హద్దులు ఒక్కటే. ఇప్పుడు ఇది పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. స్థలం చేతులు మారిపోతుందన్న ఆందోళనలో సర్వే నెంబరు తప్పుగా వేసేసుంటారని, ఎలాగూ తప్పుడు డాక్యుమెంట్లే కాబట్టి నెంబరు మర్చిపోయుంటారని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపైనా, వీరికి పొజిషన్‌ ఇచ్చిన రెవెన్యూ అధికారులపైనా అనుమానాలున్నాయి. జీవనోపాధి కోసం టీకొట్టు పెట్టుకున్న వ్యక్తి యజమానిగా మారి స్థలయజమానికి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేస్తే రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులు కళ్లు మూసుకొని సంతకాలు చేయడంపైనా పట్టణంలో తీవ్ర చర్చ సాగుతుంది. ఈ వ్యవహారం వెనుక వివిధ రాజకీయ పార్టీల లోకల్‌ నాయకులు ఉన్నారని ప్రచారం ఉంది. వివాదాస్పద స్థలం చేతులు మారడంలో పెద్ద మొత్తంలో వాటాలు పంపకాలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page