top of page

ఆ ఎయిర్‌పోర్టు మా తాతల ఆస్తి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 14
  • 3 min read
  • రూ.3500 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే

  • సుప్రీంకోర్టులో సాధారణ రైతు న్యాయ పోరాటం

  • న్యాయ వివాదంలో రాయ్‌పూర్ విమానాశ్రయం

  • 1942లో ఎయిర్ ఫీల్డ్ కోసం తీసుకున్న బ్రిటిష్ సర్కారు

  • అప్పటినుంచీ ఆ 30 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే

  • రైతు కుటుంబానికి పైసా అయినా ఇవ్వలేదని వాదన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

భూ వివాదాలు, ఆస్తుల తగాదాలు సర్వసాధారణం. ఒకే కుటుంబానికి చెందినవారు వారసత్వ ఆస్తుల కోసం గొడవలు పడటం నిత్యం సమాజంలో చూస్తూనే ఉంటాం. అలాగే ప్రైవేట్ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు రేగుతూనే ఉంటాయి. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు చోటు చేసుకుని కోర్టులకు ఎక్కడం, ఏళ్లతరబడి ఆ వ్యాజ్యాలపై విచారణలు కొనసాగడం కొత్త కాదు. కానీ ఒక రైతు ఏకంగా ఒక విమానాశ్రయాన్నే తన పూర్వీకుల ఆస్తిగా క్లెయిమ్ చేస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. ఆయనేదో ఉత్త పుణ్యానికి క్లెయిమ్ చేస్తున్నాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. గత మÖడున్నర దశాబ్దాలుగా ఆయన దానికోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. ఎక్కడెక్కడివో పాత రెవెన్యూ రికార్డులను వెతికి మరీ తీసుకొచ్చి కోర్టు ముందు పెడుతున్నాడు. దాంతో న్యాయస్థానం కూడా ఈ కేసును సీరియస్‌గానే పరిగణించి విచారణ జరుపుతున్నది. సదరు రైతు తనదిగా చెబుతున్న విమానాశ్రయం ఒక రాష్ట్ర రాజధానిలో ఉండటం విశేషం. అదే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం. అంతపెద్ద విమానాశ్రయం భూ వివాదంలో కూరుకుపోవడం వెనుక పెద్ద కథే ఉంది.

ఇదీ రైతు వాదన

ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండి.. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న రాయ్‌పూర్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా అనే గ్రామానికి చెందిన అశ్వినీ బండే అనే సాధారణ రైతు ఏకంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర విమానయాన శాఖలతో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం రాయ్‌పూర్‌లో ఉన్న స్వామి వివేకానంద విమానాశ్రయం ఉన్న 30 ఎకరాల భూమి తన పూర్వీకుల ఆస్తి అన్నది ఆయన వాదన. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అప్పటి యుద్ధ అవసరాల కోసం తన పూర్వీకుల నుంచి ఆ భూమిని తీసుకున్నా ఒక్కపైసా అయినా ఇవ్వకపోగా.. భూమిని కూడా తిరిగి స్వాధీనం చేయలేదని అశ్వినీ బండే వాదిస్తూ దాన్ని ధ్రువీకరించే పాత రికార్డులను కూడా చూపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఆ భూమి ద్వారా ఎటువంటి ఆదాయం సంపాదించకుండా చేసినందుకుగాను తనకు ఎయిర్‌పోర్టు భూమి అయినా తిరిగి ఇవ్వాలని లేదా రూ.3500 కోట్ల పరిహారమైనా చెల్లించాలని కోర్టు ద్వారా డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానమై సుప్రీంకోర్టులోనే కేసు వేసి సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నాడు.

ఆనాడు ఏం జరిగిందంటే..

సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం జరిగిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక చర్య ఇప్పుడు పెద్ద భూవివాదంగా మారడం.. అది ఏళ్ల తరబడి కోర్టులో కొనసాగుతుండటమే పెద్ద విశేషం. ఆ యుద్ధ సమయంలోనే సైనికుల అవసరాల కోసం అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం జరిపిన ఓ తాత్కాలిక భూసేకరణే ఇప్పుడు రైతు అశ్వినీ బండే చేతిలో అస్త్రంగా మారింది. ఒక సామాన్య రైతు ఒక రాష్ట్ర రాజధానిలోని విమానాశ్రయ భూమిపై హక్కులు కోరుతూ భారీ మొత్తాన్ని పరిహారంగా క్లెయిమ్ చేయడం లీగల్, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతు చేస్తున్న వాదనల్లో వాస్తవం ఉందని ఆయన సమర్పిస్తున్న పాత రికార్డులు, కొందరు అధికారుల మాటల ద్వారా స్పష్టమవుతున్నది. 1942లో రెండో ప్రపంచ యుద్ధ అవసరాల కోసం అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం రాjáYTపూర్ సమీపంలోని మనా గ్రామంలో ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికోసం అశ్వినీ బండే కుటుంబానికి చెందిన 30 ఎకరాల భూమిని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుని ఎయిర్ ఫీల్డ్ నిర్మించింది. అందుకే దాన్ని మనా ఎయిర్‌పోర్ట్ లేదా మనా ఎయిర్ ఫీల్డ్ అని పిలిచేవారు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద జరిగిన ఈ భూసేకరణ పూర్తిగా తాత్కాలికమని, యుద్ధం ముగిశాక భూమిని తిరిగి ఇచ్చేయాలి లేదా ఏడాదికి రూ. 1,300 చొప్పున అద్దె చెల్లించాలనే నిబంధనతో రైతు కుటుంబంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ యుద్ధం ముగిసింది.. ఆ తర్వాత బ్రిటీషర్లు మనదేశాన్ని విడిచివెళ్లిపోయారు. అయినా ఎయిర్‌ఫీల్డ్ భూమి తిరిగి అశ్వినీ బండే కుటుంబానికి అందలేదు. పరిహారం రూపంలో గానీ.. లీజు రూపంలో గానీ ఒక్క పైసా అయినా ముట్టలేదు. అయినా ఆ కుటుంబానికి చెందినవారు ఆ భూమి విషయాన్ని పట్టించుకోలేదు. కాలక్రమేణా ఆ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ దేశీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసింది. దాని పేరును కూడా 2012లో ప్రముఖ తత్వవేత్త స్వామి వివేకానంద ను గుర్తు చేసుకునేలా స్వామి వివేకానంద విమానాశ్రయంగా మార్చింది.

నిర్విరామ పోరాటం

తన పూర్వీకుల ఆస్తి ఎయిర్‌పోర్టుగా మారిందని గుర్తించిన అశ్వినీ బండే దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. 35 ఏళ్లుగా దాని కోసం సుప్రీంకోర్టులో పోరాడుతున్న ఆయన ప్రభుత్వ లైబ్రరీలు, పలు శాఖలకు చెందిన రికార్డు రూముల చుట్టూ తిరుగుతూ తన వాదనకు అనుకూలంగా ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెబుతున్నాడు. రాయ్‌పూర్ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఒక ప్రదర్శనలో ఈ ఎయిర్‌ఫీల్డ్‌కు సంబంధించిన పాత ల్యాండ్ అక్విజిషన్ రికార్డులు బయటపడటంతో అశ్వినీ బండే వాదనకు బలమైన ఆధారం లభించింది. పబ్లిక్ సర్వీస్ గ్యారెంటీ యాక్ట్ కింద ఆ రికార్డుల సర్టిఫైడ్ కాపీలు సంపాదించి సుప్రీంకోర్టుకు సమర్పించాడు. సాంస్కృతిక శాఖ అధికారులు కూడా ఆ కాలం నాటి రికార్డులు, అందులో కొందరు రైతుల పేర్లు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించినా.. యాజమాన్య హక్కులపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వ రికార్డుల్లో ఆ భూమి శాశ్వతంగా సేకరించినట్లు లీగల్ ఎంట్రీ లేకపోతే సదరు రైతుకు పరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ విలువ, వడ్డీ లెక్కలు వేస్తే చాలా భారీగానే ఉంటుంది. విచారణలో ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టు రైతుకు అనుకూలంగా తీర్పునిస్తే అది ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ వ్యవహారాలపై మరిన్ని వివాదాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page