ఆ ఎంపికలకు వెళ్లకండి
- BAGADI NARAYANARAO

- May 28
- 2 min read
జిల్లా క్రికెట్ సంఘం పిలుపుపై ఏసీఏ స్పందన
జ్యుడీషియల్ విచారణ పూర్తయ్యే వరకు దేన్నీ గుర్తించమని ప్రకటన
స్థానికంగా క్రికెటర్స్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం
గతంలో జరిగిన అక్రమాలపై కమిషన్ ముందుకు వెళ్తామని ప్రకటన
స్థానికేతరులను సెలక్ట్ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా క్రికెట్ సంఘానికి నూతన కమిటీని ప్రకటించిన తర్వాత జిల్లాలో రోజుకో పరిణామాలు ఎదురవుతున్నాయి. జిల్లా కమిటీ ఎన్నిక, సంఘం నిధుల దుర్వినియోగంపై ఏసీఏ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ వేసి విచారణకు ఆదేశించిన విషయం పూర్తిగా బయటపడకముందే ఈ నెల 31న, వచ్చే నెల 1న జరగాల్సిన అండర్`16 బాలురు, బాలికల ఎంపికల్లో ఎవరూ పాల్గొనవద్దని ఏసీఏ పేర్కొనడం గమనార్హం. ఈ ఎంపికలు ఉన్నాయని కొత్త కమిటీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే జిల్లా పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ ఏసీఏకు ఫిర్యాదు చేయడంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు బ్రేకులు పడ్డాయి. విచారణ పూర్తయి నివేదిక వచ్చేవరకు జిల్లా క్రికెట్ సంఘం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అధికారికంగా ఆమోదించమని ఏసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకు జిల్లా క్రికెట్ సంఘం బాలురు, బాలికల ఎంపికలో వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ గురువారం నగరంలోని ఓ హటల్‌లో జిల్లా క్రికెటర్స్ తల్లిదండ్రులు సమావేశమయ్యారు. జిల్లా క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని, స్థానికేతరులతో జిల్లా కోటాలో ఆడించవద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ బయటివారిని తెస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా క్రికెట్ జిల్లాకు చెందిన క్రీడాకారులకే సొంతమని నినదించారు. ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-16 బాలురు, బాలికల క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో తల్లిదండ్రులంతా విధిగా హాజరు కావాలని తీర్మానించుకున్నారు. ఎంపికలు సజావుగా సాగాలని, బయటి వ్యక్తులు వచ్చి ఆటంకం కలిగించకుండా భద్రత కల్పించాలని పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా క్రికెట్ సంఘం ఏకపక్ష నిర్ణయాలను పేరెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకించాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లా క్రికెట్ సంఘంతో తాడోపేడో తేల్చుకోవడానికి పేరెంట్స్ అసోసియేషన్ సిద్ధమైందనే సంకేతాలను ఈ సమావేశం ద్వారా బయటకు పంపారు. జిల్లా క్రికెట్ సంఘం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన సమావేశానికి సంఘం ప్రతినిధులు దుప్పల వెంకటరావుతో పాటు సుమారు 50మంది సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా క్రికెట్ సంఘంపై జ్యుడీషియల్ విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాలో టాలెంట్ చూపించే క్రికెటర్లను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల నుంచి జిల్లా తరఫున క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారని, దీన్ని ప్రశ్నించే పేరెంట్స్‌పై సంఘం ప్రతినిధులు బ్లాక్‌మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెటర్‌గా జట్టులో ఎంపిక చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని కొందరు ఈ సమావేశంలో ఆరోపించారు. జ్యుడీషియల్ కమిషన్‌కు ఈ ఆధారాలను అందించడానికి కొందరు పేరెంట్స్ సిద్ధమవుతున్నారు.






Comments