11సార్లు గెలిచి అగ్రస్థానంలో ఇంద్రజిత్ గుప్తా
సోమనాథ్ ఛటర్జీ, పీఎంసయీద్ పదిసార్లు ఎన్నిక
వాజ్‌పేయి సహా తొమ్మిదిమందికి తొమ్మిదేసి విజయాలు
ఈ ఘనత భవిష్యత్తులో ఇంకెవరికీ సాధ్యకాదేమో?
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అందుకోవడం కష్టం. అసెంబ్లీ కంటే పార్లమెంట్(లోక్‌సభ) ఎన్నికల్లో నెగ్గుకురావడం అంతకంటే కష్టం. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడుతుంది. అంటే ఒక ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలతో సమానమన్నమాట. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని సుమారు పదిహేను, పదహారు లక్షల ఓటర్లు కలిసి ఒక లోక్‌సభ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను చుట్టేసి ప్రచారం చేయడం కూడా ఒక పెద్ద తతంగమే. పైగా అత్యంత ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఎన్నికవ్వడం సంగతి తర్వాత.. ముందు పోటీ చేయడానికే చాలామంది వెనకాడుతుంటారు. అందువల్లే ఇటీవలి కాలంలో పార్టీలు మంచి ధనబలం, మందీమార్బలం ఉన్న వారినే ఎంపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాయి. ఒక్కసారి ఎంపీగా ఎన్నికవ్వడమే ఇంతకష్టమని భావిస్తున్న తరుణంలో కొందరు మాత్రం వరుస పెట్టి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికై తమ పేరిట చెరిగిపోని రికార్డులు నమోదు చేసుకోవడం చిన్న విషయం కాదు. మనదేశంలో 1951`52లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటినుంచి 2019 వరకు 17సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లోనూ చాలామంది తొలిసారి ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు పోటీ చేస్తుంటే కొందరు రెండోసారి, ఇంకొందరు మూడోసారి.. అలాగే నాలుగు, ఐదోసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. ఇంతవరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎన్నికల్లో గెలిచిన వారిలో దివంగత సీపీఐ నేత ఇంద్రజిత్ గుప్తాదే మొదటిస్థానం. ఆయన తర్వాత స్థానాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, సోమనాథ్ ఛటర్జీ, తదితర కొద్దిమంది ప్రముఖులు నిలుస్తున్నారు. వీరిలో కొందరు ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ నుంచి పోటీ చేసి అత్యధిక విజయాలు సాధించిన ఘనత దక్కించుకుంటే.. మరికొందరు పార్టీలు, నియోజకవర్గాలు మారినా ఎంపీ ఎన్నికల్లో విజయం అందుకుని తమ పట్టును నిరూపించుకున్నారు. అలాంటి వివరాలు చూద్దాం.
ఇంద్రజీత్ గుప్తా(సీపీఐ)
భారతీయ ఎన్నికల కురుక్షేత్రంలో అత్యధిక విజయాలు దక్కించుకున్న ఘనుడు కమ్యూనిస్ట్ అగ్రనేత, ఒకప్పటి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, దివంగత ఇంద్రజిత్ గుప్తా. దేశంలో 1960లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి కోల్‌కతా వాయువ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. అప్పటినుంచి ఒక్క 1977లో మినహా 1999 వరకు వరుసగా పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్, మిడ్నాపూర్ వంటి పలు నియోజకవర్గాలు మార్చినా గెలుస్తూ వచ్చారు. ఈయన పార్లమెంటరీ జీవితంగా 1977లో ఒక్క పరాజయం, మిగతా 11సార్లు విజయం సాధించి అత్యధికసార్లు ఎంపీ అయిన ఘనత సొంతం చేసుకున్నారు. దేవెగౌడ, ఐకేగుజ్రాల్ కేబినెట్లలో మంత్రిగా కూడా చేశారు.
సోమనాథ్ ఛటర్జీ(సీపీఎం)
ఇంద్రజిత్ గుప్తా తర్వాత అత్యధికంగా పదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన చరిత్ర మరో కమ్యూనిస్టు నేత, సీపీఎం అగ్రనాయకుల్లో ఒకరైన సోమనాథ్ ఛటర్జీది. 1971 నుంచి 2009 వరకు పార్లమెంటు సభ్యుడుగా ఉన్న ఈయన పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్, బోల్‌పూర్, జాదవ్‌పూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. 1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు.
పీఎం సయీద్(కాంగ్రెస్)
సోమనాథ్ ఛటర్జీ మాదిరిగానే మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పదనాథ్ మహమ్మద్ సయీద్(పీఎం సయీద్) కూడా పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967 నుంచి 1999 వరకు వరుసగా పది ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయిన ఈయన మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి మిగతా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థిగానే విజయాలు అందుకున్నారు. అలాగే లక్షద్వీప్ నియోజకవర్గం నుంచే వరుస విజయాలు సాధించడం ఈయన ప్రత్యేకత. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. చివరిగా 2004`05 మధ్య యూపీఏ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి(బీజేపీ)
ఈ వరుసలో మరో ప్రముఖుడు అటల్ బిహారీ వాజ్‌పేయి తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. దాంతోపాటు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికైన ఘనత ఈయనది. మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అరుదైన ఘనత కూడా వాజ్‌పేయి సొంతం. ఒకటి, మూడు, తొమ్మిదో లోక్‌సభ ఎన్నికలు మినహాయించి ఏకధాటిగా 14వ లోక్‌సభ వరకు ప్రాతినిధ్యం వహించారు. అయితే మధ్యలో రెండుసార్లు లోక్‌సభకు కాకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మొదట జనసంఫ్‌ు నుంచి ఎంపీగా ఎన్నికైన వాజ్‌పేయి, తర్వాత బీజేపీ నుంచి ఎంపీగా రాణించి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా అందుకున్నారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వమైన జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు. న్యూఢల్లీి, గ్వాలియర్, లక్నో, బలరాంపూర్, తదితర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.
కమల్‌నాథ్(కాంగ్రెస్)
వాజ్‌పేయి మాదిరిగానే తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నేత మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ 1991 నుంచి 2014 వరకు మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేసినా కమల్‌నాథ్ 2018 నుంచి 2020 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు.
మాధవరావు సింధియా(కాంగ్రెస్)
మధ్యప్రదేశ్‌కే చెందిన మరో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా కూడా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన ఘనత సాధించారు. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన ఈయన 1971లో తొలిసారి జనసంఫ్‌ు తరఫున గుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరడంతోపాటు గ్వాలియర్ నియోజకవర్గానికి మారి వరుస విజయాలు సాధించారు. 1984లో అగ్రనేత వాజ్‌పేయినే ఓడిరచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
ఖగపతి ప్రదాన్(కాంగ్రెస్)
ఒడిశాకు చెందిన కాంగ్రెస్ నేత దివంగత ఖగపతి ప్రదాన్ కూడా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. ఈయన నవరంగపూర్ లోక్‌సభ స్థానం నుంచి 1967లో తొలిసారి ఎంపీగా గెలిచారు. అప్పటినుంచి 1999 వరకు వరుసగా తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు.
గిరిధర్ గమాంగ్(కాంగ్రెస్)
ఒడిశాకే చెందిన గిరిధర్ గమాంగ్ కూడా తొమ్మిదిసార్లు ఎంపీ అయ్యారు. 1972లో తొలిసారి లక్ష్మీపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 1999 వరకు ఆ నియోజకవర్గంలోనే కొనసాగారు. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం కొరాపుట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో కొన్ని నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
రామ్‌విలాస్ పాశ్వాన్(ఎల్జేపీ)
ఒకప్పటి జనతాపార్టీ నాయకుడు, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ పార్టీలు మారినా బీహార్‌లోని హాజీపూర్ నుంచి ఎనిమిదిసార్లు, రోస్రా స్థానం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
జార్జ్‌ఫెర్నాండెజ్(జనతా పార్టీ)
ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, కార్మిక నేత జార్జ్ ఫెర్నాండెజ్ కూడా తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన ఆ తర్వాత బీహార్‌లోని ముజఫర్‌పూర్ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు గెలిచారు. జనతా ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించారు.
వాసుదేవ్ ఆచార్య(సీపీఎం)
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ సీపీఎం నేత వాసుదావ్ ఆచార్య కూడా తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలోని బంకురా నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఒకే పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు.
Comments