సమన్వయమే వైకాపాకు పెద్ద లోపం
విజయసాయిరెడ్డితో మొదలైన పైత్యం
సమాంతరంగా నడుస్తున్న క్యాడర్
అడిగే నాధుడు లేక ఇష్టారాజ్యం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో వైకాపా చతికిలపడిపోవడానికి కారణం సమన్వయలోపమే. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనివిధంగా రీజనల్ కోఆర్డినేటర్ (ప్రాంతీయ సమన్వయకర్త) అనే పోస్టు వైకాపాకు ఉన్నా ఆ సమన్వయమే పార్టీలో లోపించి రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయింది. విజయసాయిరెడ్డి లాంటి రెడ్డి నాయకుడే సమన్వయాన్ని మరచి జోడెద్దుల బండిని ఒంటెద్దుగా నడిపించి పార్టీని పాతాళానికి తొక్కేస్తే, ఇప్పుడు కురసాల కన్నబాబు లాంటి నేతలు శ్రీకాకుళం వంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో సమన్వయం ఎలా కుదురుస్తారన్నదే ఇక్కడ ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో వైకాపా రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీమంత్రి కురసాల కన్నబాబును నియమించారు. ఆయన ఈ నెల 4న జిల్లా వైకాపా నేతలతో సమన్వయకమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. విచిత్రమేమిటంటే.. ఈ జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు, మిగిలిన కేడర్‌కు మధ్య సమన్వయం లోపించడమే ప్రధాన సమస్య. విజయసాయిరెడ్డి సమన్వయకర్తగా ఉన్నా, వైవీ సుబ్బారెడ్డి సమన్వయకర్తగా వచ్చినా ఒక్కరు కూడా ఈ జిల్లాలో సమన్వయాన్ని సాధించలేకపోయారు సరికదా.. వారికంటూ ఉన్న స్వప్రయోజనాల కోసం కొత్త గ్రూపులను తయారుచేశారు. జిల్లాలో ఇప్పుడు కన్నబాబు రాకతో సమన్వయం కుదురుతుందా? లేదూ జగన్మోహన్‌రెడ్డి శైలే అంతా? లేదు లేదు రాజకీయాల్లో ఎప్పుడూ పక్కలో ఓ బల్లెం ఉండాలనే సూత్రం ఇప్పటికీ వర్తింపజేస్తున్నారా? అనేది నూరు డాలర్ల ప్రశ్న. 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే స్థానంలో వైకాపా ఇన్‌ఛార్జిలొచ్చారు. తప్పో ఒప్పో ఒక ఇన్‌ఛార్జిని నియమించిన తర్వాత పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు వారి నేతృత్వంలో జరగాల్సి ఉండగా, సమాంతరంగా మరో నాయకత్వం పొడుచుకొస్తున్నా పార్టీ చూసీచూడనట్లు వ్యవహరించడమే వైకాపాకు జరుగుతున్న పెద్ద నష్టం. దీన్ని తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించే జిల్లా పార్టీని రీజనల్ కోఆర్డినేటర్ గాడిలో పెట్టగలరా? అనేదే ఇక్కడ ప్రధాన సమస్య. పార్లమెంట్ సెగ్మెంట్‌లో 8 నియోజకవర్గాలు ఉంటే, అన్నిచోట్లా సమన్వయమే ప్రధాన లోపం కావడం గమనార్హం.

ఇచ్ఛాపురం: ఇక్కడ 2010లో వైకాపా ఏర్పడిన నాటి నుంచి ఎంతమంది ఇన్‌ఛార్జిలు మారారు? ఎంతమంది ఎన్నికల్లో పోటీ చేశారు? అన్న లెక్క పార్టీ దగ్గర ఉందో లేదో తెలీదు. ఈ జిల్లాలో స్టెబిలిటీ లేకుండా నడుస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందీ అంటే.. అది ఇచ్ఛాపురం మాత్రమే. ఇక్కడ బహునాయకత్వమే ఒక్కసారి కూడా వైకాపా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించలేదు. కర్ణుడి చావుకు కారణాల మాదిరిగా ఇచ్ఛాపురం మీద అందరిదీ పెత్తనమే. అవగాహన లేని అధినాయకత్వం ఎవరు ఏది చెపితే అది చేసుకుపోయింది ఇన్నాళ్లూ. అందుకే అధికారంలో ఉన్నా, లేకపోయినా అక్కడ మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గెలిచారు. అసలు ఇచ్ఛాపురం నియోజకవర్గ స్వరూపం ఏమిటి? దాని చరిత్ర ఏమిటి? అన్నది వైకాపా ఇన్‌ఛార్జిలుగా పనిచేసిన రెడ్లకు తెలియకపోవచ్చు. కానీ జర్నలిస్టుగా పనిచేసి పొలిటీషియన్‌గా మారిన కన్నబాబైనా కనీసం గ్రహించాలి. ఇచ్ఛాపురం మొదట్నుంచి కాంగ్రెసేతర పార్టీలకే పట్టం కట్టింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో సురంగి రాజు, రంగబాబు, లల్లూ ఉన్నారు. అంటే.. 2004లో రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ తరఫున లల్లూ వచ్చారన్నమాట. 2014 తర్వాత కాంగ్రెస్ వేరు, వైకాపా వేరు కాదు కాబట్టి వైకాపాకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ వైకాపా మూడుసార్లు పోటీ చేసి, మూడుసార్లూ ఓడిపోయింది. కారణం స్థిరత్వం లేకపోవడమే. ఒకసారి సాయిరాజ్, ఒకసారి నర్తు రామారావు, ఒకసారి పిరియా విజయ.. ఇలా అభ్యర్థులను మార్చినా ఫలితం దక్కలేదు. పోనీ 2029కైనా ఫలితంలో మార్పు ఉంటుందా? అంటే.. ఇప్పటికీ అక్కడ బహునాయకత్వం నడుస్తుంది. రెడ్డిక కోటాలో టిక్కెట్ కోసం సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే, ఎమ్మెల్సీగా ఉన్నా ఆత్మతృప్తి లేని నర్తు రామారావు, కాంగ్రెస్ నుంచి వచ్చిన నర్తు నరేంద్ర.. ఇలా చాలామంది ఇక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిరియా విజయకు పోటీగా కార్యక్రమాలు నడుపుతున్నారు. ఇచ్ఛాపురం సీటును 2024 ఎన్నికల్లో గెలిపిస్తే.. ఎమ్మెల్సీ ఇస్తానని నర్తు రామారావుకు మాటిచ్చిన జగన్మోహన్‌రెడ్డి మధ్యలోనే ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు. తీరా 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ దీనికి నర్తు రామారావు మాత్రం బాధ్యత వహింలేదు సరికదా.. 2029లో తనకు టిక్కెట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ బహునాయకత్వం వల్ల పార్టీ వద్దకు ఎవరి పేరు వెళ్తుందో తెలీక ఎవరికివారే పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలకు దన్నెట్టేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లో వైకాపా రెండే రెండు కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఒకటి రైతులకు సంబంధించి జిల్లా కేంద్రంలో నిరసనలు చేస్తే, రెండోది నియోజకవర్గాల్లో విద్యుత్ ధరల పెంపుపై చేశారు. వాస్తవానికి ఇక్కడ ఇన్‌ఛార్జి విజయ నేతృత్వంలో కార్యక్రమాలు జరగాలి. కానీ 2029 ఎన్నికలకు ఆమెను ఉంచుతారో, తీసేస్తారో తెలియని వాతావరణం ఉండటం వల్ల ఇచ్ఛాపురంలో వైకాపా తేలిపోతుంది. అలాగని నర్తు రామారావును ఎమ్మెల్సీ చేయడం వల్ల పార్టీకి అదనంగా ఒనగూరిన ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే అణాపైసా లేదు. కేవలం యాదవులకు ఎమ్మెల్సీ చేశామని చెప్పుకోవడం తప్ప ఇచ్ఛాపురంలో బావుకున్నది లేదు. ప్రస్తుతం పిరియా విజయ జిల్లాపరిషత్ చైర్మన్‌గా ఉన్నా, అధికారంలో లేకపోవడం వల్ల ఆమె భవిష్యత్తు అర్థం కావడంలేదు. అసలు ఇచ్ఛాపురంలో ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ ఓడిపోవడానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎమ్మెల్సీగా గౌరవ మర్యాదలు, జీతభత్యాలు పొందుతున్న నాయకులు పార్టీ కోసం ఏం చేయాలి? వీటి మీద ఇంతవరకు చర్చించిన దాఖలాలు లేవు.

పలాస: ఇక్కడ ఇన్‌ఛార్జిగా మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా ఆయనకు తలనొప్పులు లేకపోయినా, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సృష్టించుకున్న సమస్యలే ఇప్పుడాయనకు తలనొప్పిగా మారాయి. అసలే వైకాపా అధికారంలో లేదు. దానికి తోడు అప్పలరాజు పద్ధతిలో మార్పు లేకపోవడంతో వైకాపా నాయకులు రాబోయే నాలుగేళ్లలో ఇక్కడ పార్టీని ఖాళీ చేసినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీకాంత్ వెళ్లిపోయినట్లే, మున్సిపల్ ఎన్నికల తర్వాత చాలామేరకు వైకాపా ఖాళీ అవుతుందనడంలో సందేహం లేదు. డాక్టర్‌గా సక్సెస్ అయిన అప్పలరాజు ప్రజాప్రతినిధిగా మాత్రం సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తన చుట్టూ ఉన్న ఆ నలుగురితో మాత్రమే ఉండటం వల్ల పలాసలో సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు లాంటి నేతలు డాక్టర్ మీద అసంతృప్తితో పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

టెక్కలి: ప్రస్తుతం ఇక్కడ వైకాపా ఇన్‌ఛార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. వైకాపాను నమ్ముకుని మూడుసార్లు ఆయన నష్టపోయారు. జిల్లాపరిషత్, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసి, ఆయన కునారిల్లిపోయారు. దువ్వాడ శ్రీను కుటుంబ సమస్యల వల్ల పేరాడ తిలక్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు తప్ప మళ్లీ ఎన్నికలంటూ వస్తే దువ్వాడనే చేరదీస్తారనే ప్రచారానికి పార్టీ అడ్డుకట్ట వేయలేకపోతోంది. తాను ఎన్ని చేసినా జగన్ తనకే టిక్కెట్ ఇస్తారన్న కోణంలో ఒకవైపు దువ్వాడ ప్రచారం చేస్తుండగా, ఆయనతో పాటు అడల్ట్రీ రిలేషన్‌షిప్ అంటూ ఈమధ్య తెర మీదకు వచ్చిన దివ్వెల మాధురి ఆమధ్య దమ్ముంటే తెచ్చుకోరా టిక్కెట్, తెచ్చుకుంటే వదిలేస్తా పాలిటిక్స్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. దీనిమీదే మీడియా ప్రశ్నిస్తే.. దువ్వాడ శ్రీనుకే మళ్లీ టిక్కెట్ వస్తుందని ఆమె కుండబద్దలుకొట్టారు. మూడు ఎన్నికల తర్వాత కూడా పేరాడ తిలక్‌కు పార్టీ భరోసా ఇవ్వకపోతే టెక్కలిలో అచ్చెన్నాయుడు లాంటి పర్సనాలిటీ మీద వైకాపా ఎప్పుడు గెలుస్తుంది? ఇంతవరకు నాబొందో అంటూ తిలక్ పార్టీ కోసం తిరుగుతుంటే.. దువ్వాడ శ్రీను చీరల షాపుల కోసం తెలంగాణలో తిరుగుతున్నారు. మొన్న జగన్మోహన్‌రెడ్డి పాలకొండ వస్తే, శ్రీను ఫొటోలే కనిపించాయి తప్ప, జగన్ పక్కన తిలక్ ఉన్నారని, పార్టీ ఆయనతో ఉందని సంకేతాలు మాత్రం పంపించలేకపోయారు.

నరసన్నపేట: ఇక్కడ ఇన్‌ఛార్జే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా. పార్టీలో ఆయనకు తలనొప్పులు లేవు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందర్నీ సమన్వయం చేయడంలో కృష్ణదాస్ దూకుడు కనపడదు. నియోజకవర్గం వరకు రాజకీయాలను అనుకూలంగా మలచుకోవడం కోసం ఆయన కుమారుడు కృష్ణచైతన్య పని చేస్తున్నా, జిల్లాలో తానే పార్టీ, పార్టీయే తానని సంకేతాలు పంపలేకపోయారు. దీనివల్ల ప్రతీ నియోజకవర్గంలోనూ సమాంతర వ్యవస్థ ఒకటి నడుస్తుంది. కృష్ణదాస్ కఠినంగా ఉంటేనే జిల్లాలో సరళమైన ఫలితాలు వస్తాయి. ఆయన మారనంత వరకు రీజనల్ కోఆర్డినేటర్లు ఎంతమంది వచ్చినా పరిస్థితిలో మార్పు రాదు.

శ్రీకాకుళం: ఇక్కడ ఇన్‌ఛార్జిగా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆ మేరకు యాక్టివ్‌గా ఉన్నారా? లేరా? అన్నది వేరేగా చెప్పనక్కర్లేదు.
ఆయనే బలంగా ఉంటే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ సమన్వయ లోపం ఉండేదికాదు. 2019`24 మధ్యకాలంలో ధర్మానను పక్కన పెట్టి వైకాపా జిల్లా రాజకీయాలు నడిపిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. ధర్మానే ముందడుగు వేస్తే.. రీజనల్ కోఆర్డినేటర్ జిల్లాకు వచ్చే పరిస్థితే ఉండేదికాదు. జిల్లాలో ధర్మానను కాదని దువ్వాడ శ్రీనును ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్టు కనిపించకపోవడంతో ధర్మాన ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు. పేరుకే ఆయన ఇన్‌ఛార్జి కానీ, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడంలేదు.

ఎచ్చెర్ల: 2014 నుంచి ఇక్కడ గొర్లె కిరణ్‌కుమార్‌ను నమ్ముకొని పార్టీ వెళుతోంది. 2019లో ఆయన గెలిచిన తర్వాత పూర్తిగా డబ్బుమనిషి అయిపోయారన్న ఫిర్యాదులు పార్టీ వద్దే ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా అన్ని మండలాల్లోనూ నాయకులు అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కొందరు జనసేన, మరికొందరు బీజేపీకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు కష్టపడి చేస్తున్నా, గతంలో చేతులు కాల్చుకున్న గాయాలు ఆయన్ను వీడటంలేదు. ఒకవైపు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన్నశ్రీను, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మేనల్లుడు పిన్నింటి సాయి ఇక్కడ సమాంతరంగా పార్టీని నడుపుతున్నారు. కారణం.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ గొర్లె కిరణ్‌కుమార్ నాయకులను దూరం చేసుకోవడమే. ఇక్కడ కూడా సమన్వయ లోపం సుస్పష్టం.

ఆమదాలవలస: స్పీకర్‌గా పనిచేసిన సీతారామ్‌ను పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించినా ఇక్కడ ఆయన అసమ్మతి నేతలను ఎగదోస్తున్నారు. చింతాడ రవికుమార్‌కు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినా ఆయనతో సమన్వయం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరం. రవికుమార్ పేరు ప్రకటించిన తర్వాత కూడా కిల్లి సత్యనారాయణ, దుంపల లక్ష్మణరావు, తమ్మినేని చిరంజీవి నాగ్ లాంటివారు 2029కి టిక్కెట్ ఆశిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే రవికుమార్‌కు సహాయనిరాకరణ చేస్తున్నారు.

పాతపట్నం: 2014లో అనూహ్యంగా వైకాపాలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి శాంతిది మరో కథ. ఈమెకు సొంతింటి నుంచే సొంత పార్టీలో తలనొప్పి ఎదురవుతోంది. జిల్లాలో ఐదు మండలాలు ఉండే పెద్ద నియోజకవర్గం పాతపట్నమే. భర్త లేకపోయినా, ఢల్లీి లైఫ్‌స్టైల్‌కు అలవాటుపడినా పాతపట్నంలో ఒక ఇల్లు తీసుకొని 2014లో అప్పటి ఎమ్మెల్యే కలమట రమణ కుమార్తె వివాహం తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో పాతపట్నానికి పరిమితమైన రెడ్డి శాంతికి స్వయంగా ఆమె దగ్గరి బంధువు మామిడి శ్రీకాంత్ రూపంలో పోటీ ఎదురైంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా రెడ్డి శాంతి ఉన్నా మామిడి శ్రీకాంత్ ఆమెకు పోటీగా అక్కడ వైకాపా రాజకీయాలు నెరుపుతున్నారు. రెడ్డి శాంతి గతంలో చేసిన తప్పిదాల వల్ల కేడర్ ఆమెకు కొంత దూరమైన మాట వాస్తవం. కానీ వాటిని ప్యాచప్ చేసుకొనే అవకాశం పార్టీ ఇచ్చినా, పార్టీ నాయకులు మాత్రం పేర్లల్ రాజకీయాలు చేయడం వల్ల పాతపట్నం టీడీపీలో రెండు గ్రూపులున్నా 2029కి వైకాపా పైచేయి సాధిస్తుందన్న నమ్మకం కుదరడంలేదు.
ప్రస్తుతం వైకాపా ఇన్‌ఛార్జిలుగా ఉన్నవారు సమర్థులు అనుకుంటే వారితోనే చావైనా, బతుకైనా అని పార్టీ స్పష్టం చేయాలి. లేదూ ఇప్పుడున్న ఇన్‌ఛార్జిల్లో కొందరు పనికిరారు అనుకుంటే వారిని ఇప్పుడే మార్చేయాలి. అలా కాకుండా ఇన్‌ఛార్జిలను ప్రకటించి, వారితో డబ్బులు ఖర్చు చేయించి, 2029 ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చన్న సంకేతాలు పంపితే, ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురేసి అభ్యర్థులు పుట్టుకొస్తారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆ మేరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడే అటువంటి వారిని కట్టడి చేయడమో, లేదా ఇన్‌ఛార్జిలను మార్చడమో చేయకపోతే కన్నబాబు కాదుకదా.. వారి కన్నవారొచ్చినా జిల్లాలో వైకాపా బాగుపడదు.
Comentários