ఆ కుటుంబాలది ఫ్యామిలీ ప్యాకేజీ!
- DV RAMANA

- Apr 18, 2024
- 4 min read

అధినేతల కుటుంబాల నుంచే బహుళ సంఖ్యలో అభ్యర్థులు
ప్రధాన పార్టీల్లో కొనసాగుతున్న వారసత్వ రాజకీయం
కొన్ని చోట్ల అవసరాల కోసం.. ఇంకొన్ని చోట్ల ఒత్తిళ్లతో టికెట్లు
వేర్వేరు పార్టీల నుంచి ఒకే కుటుంబీకుల పోటీ.. రాజకీయ వైచిత్రి
(ఎన్నికల రచ్చబండ ` డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థం, ప్రజలే కుటుంబం అన్నవి గతంలో రాజకీయ అర్హతలుగా ఉండేవి. ఆ సుగుణాలు ఉన్నవారే రాజకీయాలు చేసేవారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లేవారు. వారసుల కంటే ప్రజాసేవ కోసం తపించేవారినే ప్రోత్సహిస్తూ, రాజకీయంగా ఎదిగేందుకు సహకరించేవారు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల అర్థం, పరమార్థం మారిపోయింది. రాజకీయం కుటుంబ ఆస్తిగా మారిపోయింది. తమ తర్వాత రాజకీయ వారసత్వం, పెత్తనం తమ కుటుంబంలోని వారికే అందాలి. తమ కుటుంబమే తరతరాలుగా పెత్తనం చెలాయించాలన్న వికృత ధోరణి పెరిగిపోయింది. ఫలితంగా తాత, తండ్రి, కొడుకు, మనవడు.. ఇలా ఒకరు పోతే ఇంకొకరు అన్నట్లు వరుసగా ఒకే కుటుంబానికి చెందిన వారు రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీ, డబ్బు సహకారంతో ప్రజాప్రతినిధులుగా చెలామణీ అవుతున్నారు. పార్టీలు కూడా ఈ సంస్కృతిని యథాశక్తి పెంచి పోషిస్తున్నాయి. పార్టీని నడిపే నేతలు ఇటువంటి వాటి విషయంలో ఆదర్శంగా ఉండాలి. అన్ని అర్హతలు ఉన్న వారితే ఫర్వాలేదు.. కానీ మిగతా సందర్భాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలకు అవకాశం ఇవ్వాలి. కానీ అది పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఈ విషయంలో పార్టీల అధినేతలు కూడా అడ్డుచెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే.. నాయకుడన్నవాడు తాను ముందు ఆచరిస్తేనే.. మిగతా వారికి ఆదర్శంగా ఉంటుంది, వారసత్వ నాయకత్వాన్ని కట్టడి చేయడానికి వీలవుతుంది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి అలా లేదు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న తెలుగుదేశం, వైకాపా అధినేతల కుటుంబాల్లోనే చాలామంది వారి పేరు చెప్పుకొని రాజకీయాల్లో కొనసాగిపోతున్నారు. దాంతో ఇతర నేతలను ఆ విషయంలో అడ్డుకోలేకపోతున్నారు. దాంతోపాటు ఆయా ప్రాంతాల్లో పార్టీ రాజకీయ అవసరాల దృష్ట్యా కొన్ని రాజకీయ కుటుంబాలను ప్రోత్సహించాల్సి వస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజ్ మాదిరిగా పోటీ చేస్తున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇందులో కొన్ని కుటుంబాలకు చెందినవారు వేర్వేరు పార్టీల నుంచి కూడా పోటీ చేస్తుండటం విశేషం.

వైఎస్ కుటుంబం నుంచి..సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వైఎస్ వారసుడిగా కొనసాగుతుంటే ఆ కుటుంబం నుంచి మరికొందరు కూడా నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. జగన్ పులివెందుల నుంచి మరోసారి పోటీ చేస్తుండగా, ఆయన చిన్నాన్న కొడుకు అవినాష్‌రెడ్డి కడప ఎంపీగా బరిలో నిలిచారు. అలాగే మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి కమలాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరో కుటుంబ సభ్యుడు బాలినేని శ్రీనివాసరావు ఒంగోలు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పోటీ చేస్తున్నారు. కాగా జగన్ సొంత సోదరి, వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ బరిలో నిలిచి సోదరుడు అవినాష్‌ను సవాల్ చేస్తుండటం విశేషం.
నారా-నందమూరి కుటుంబంలో ఐదుగురుమరో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశాన్ని నడిపిస్తున్న నారా`నందమూరి కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మామ ఎన్టీఆర్ సహకారంతో రాజకీయంగా ఎదిగి, టీడీపీనే సొంతం చేసుకున్న నారా చంద్రబాబునాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన కుమారుడు నారా లోకేష్ మంగళగిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక చంద్రబాబు బావమరిది, లోకేష్ మామ అయిన నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానంలో పాగా వేయాలని చూస్తున్నారు. ఇక చంద్రబాబు వదిన, బాలకృష్ణ సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.
బొత్స కుటుంబానికి నాలుగు టికెట్లువైకాపాలో అధినేత కుటుంబం తర్వాత అత్యధికంగా మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి నాలుగు టికెట్లు దక్కాయి. బొత్స స్వయంగా చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా ఆయన భార్య బొత్స రaాన్సీ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి, సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి, తమ్ముడు వరసైన బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
కింజరాపు, యనమల కుటుంబాలకు మూడేసి టికెట్లుతెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్న కింజరాపు, యనమల కుటుంబాల నుంచి చెరో ముగ్గురు చొప్పున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి మరోసారి పోటీ చేస్తుండగా, ఆయన అన్న ఎర్రన్నాయుడి కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇక ఎర్రన్నాయుడి కుమార్తె, రామ్మోహన్‌నాయుడి సోదరి ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా ఆయన కుటుంబం నుంచి కూడా ముగ్గురు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నుంచి అసెంబ్లీకి, అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.
పెద్దిరెడ్డి కుటుంబానికి మూడువైఎస్ కుటుంబానికి అతి సన్నిహితుడు, వైకాపా అగ్రనేతల్లో ఒకరిగా వెలిగిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో ముగ్గురు బరిలోకి దిగారు. మంత్రి పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి అదే జిల్లాలోని తంబళ్లపల్లి నుంచి అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు, సిటింగ్ ఎంపీ మిథున్‌రెడ్డి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు.
వేమిరెడ్డి దంపతులునిన్నమొన్నటి వరకు వైకాపాలో ఉండి, ఈమధ్యే తెలుగుదేశంలో చేరిన నెల్లూరు జిల్లా రాజకీయ ప్రముఖుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులిద్దరూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి స్వయంగా నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి అదే జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాగా ఇక్కడ ఆమె ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమెకు సన్నిహిత బంధువు కావడం విశేషం.
ఇక్కడ సోదరులు.. అక్కడ వియ్యంకులునెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి పొంగూరి నారాయణ పోటీ చేస్తుండగా ఆయన వియ్యంకుడు మరో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి అదే పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ప్రత్యర్థులుగా అన్నదమ్ములువిజయవాడలో సొంత అన్నదమ్ముల మధ్యే రసవత్తర పోరు జరుగుతోంది. విజయవాడ సిటింగ్ ఎంపీ కేశినాని నాని చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడి వైకాపాలో చేరిపోయారు. ఆయనే ప్రస్తుతం వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన సోదరుడు కేశినేని శివనాథ్(చిన్ని) ఇప్పుడు అన్నకు ప్రత్యర్థిగా నిలిచారు. టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నానీని సవాల్ చేస్తున్నారు.
`ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి కొలుసు పార్ధసారధి టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా, ఆయన వియ్యంకుడు బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
`మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది. ఈమె ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కావడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం విశేషం.
`శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి పోటీ చేస్తున్నారు.
ఆ కుటుంబాలన్నింటికీ చెరో రెండుకర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శిల్పా, చిత్తూరులో చెవిరెడ్డి, నెల్లూరులో మేకపాటి, గుంటూరు జిల్లాలో అంబటి కుటుంబాలకు రెండేసి టికెట్లు లభించాయి.
`శిల్పా కుటుంబానికి చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైలం నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా ఆయన సోదరుడి కుమారుడు శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి అదే పార్టీ తరఫున బరిలో ఉన్నారు.
`చంద్రగిరి సిటింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు నుంచి వైకాపా అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చంద్రగిరి నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు.
`మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి, ఆయన కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి అసెంబ్లీకి వైకాపా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
`మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థిగా ఆయన సోదరుడు అంబటి మురళీ పోటీ చేస్తున్నారు.










Comments