top of page

ఆ కుటుంబాల రాజకీయ నిష్క్రమణం!

Writer: DV RAMANADV RAMANA
  • ఈ ఎన్నికలకు దూరంగా పలు ప్రముఖులు

  • ఒకనాడు దివ్యంగా వెలిగిన వారికి నేడు తిరస్కారం

  • కొందరు స్వచ్ఛందంగా, మరికొందరు బలవంతంగా దూరం

  • వారి రాజకీయ భవిష్యత్తు ఇక డోలాయమానమే

రాజకీయ రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి


కొత్తనీరు వచ్చినప్పుడల్లా పాతనీరు పోవడం కామన్‌. రాజకీయాల్లోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. దేశ, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో ప్రముఖ కుటుంబాలు తెరమరుగై కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి స్థానంలో కొత్త కుటుంబాలు తెరపైకి వచ్చి రాజకీయాలను శాసిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పటి నుంచి రాజకీయాలను పరిశీలిస్తే పలు కుటుంబాలు దశాబ్దాల తరబడి పెత్తనం చెలాయించాయి. ఆ కుటుంబాల సభ్యులు లేకుండా ఎన్నికలను ఊహించే పరిస్థితే ఉండేది కాదు. కాంగ్రెస్‌ హవా కొనసాగిన కాలంలో.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు పార్టీల తరఫున ప్రాంతాలవారీగా కొన్ని ప్రముఖ కుటుంబాలే రాజకీయాలు చేశాయి. తమ నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించి, అక్కడి అభ్యర్థుల ఎంపికలోనూ తమ మాటే చెల్లుబాటయ్యేలా చేసుకునేవి. అయితే ప్రతి ఎన్నికల్లోనూ కొన్ని కుటుంబాలు తెరమరుగు కావడం సహజంగా జరిగే పరిణామమే అయినా.. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ప్రముఖ కుటుంబాలు రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ పరిస్థితి తెలుగుదేశంలో ఒకింత ఎక్కువగా ఉండగా, వైకాపాలోనూ కొన్ని కుటుంబాలు టికెట్లకు నోచుకోక తెరమరుగు కావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తెలుగుదేశం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మళ్లీ అధికారం సాధించడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా బరిలో దించింది. ఆ క్రమంలో పాతకాలం రాజకీయాలనే ఇప్పటికే కొనసాగిస్తున్న, విజయం అందుకోలేరన్న అభిప్రాయం ఉన్న కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నిర్మొహమాటంగా పక్కన పెట్టేసి, వేరే అభ్యర్థులను తెరపైకి తెచ్చారు. అదే సమయంలో వైకాపా కూడా తన అధికారాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతూ విజయావకాశాలు ఉన్న వారినే బరిలోకి దించి, పాతవారిని పక్కన పెట్టింది. కాగా మరికొన్ని కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో వేరే వారికి అవకాశం లభించింది. ఫలితంగా ఈ ఎన్నికల రంగం నుంచి పెద్దసంఖ్యలోనే రాజకీయ కుటుంబాలు నిష్క్రమించాయి. దాంతో ఆయా కుటుంబాల రాజకీయం దాదాపు ముగిసినట్లే. ఎందుకంటే.. ఒకసారి అవకాశం కోల్పోతే మళ్లీ దాన్ని అందుకోగలగడం రాజకీయాల్లో చాలా అరుదుగా జరుగుతుంటుంది.

రాయపాటికి రిక్తహస్తం

ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఏపీలో ప్రముఖ రాజకీయ కుటుంబాల గురించి ప్రస్తావించాల్సి వస్తే వాటిలో గుంటూరుకు చెందిన రాయపాటి కుటుంబం తప్పనిసరిగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాం నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ కుటుంబా గుంటూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన సాంబశివరావు మొదట రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత ఐదుసార్లు గుంటూరు, నర్సారావుపేటల నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. ఈయన రాయపాటి శ్రీనివాస్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా కూడా చేశారు. సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలపాటు ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూ ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న ఈ కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సాంబశివరావు, ఈ ఎన్నికల్లో తనకు ఎంపీ, తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి లేదా మరో అసెంబ్లీ సీటు కావాలని పట్టుబట్టారు. కానీ పార్టీ ఒక్క సీటైనా ఇవ్వకుండా ఈ కుటుంబాన్ని పక్కన పెట్టడంతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాయపాటి కుటుంబం తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

కోడెల కుటుంబానిదీ అదే పరిస్థితి

ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశంలో కీలకపాత్ర పోషించింది కోడెల కుటుంబం. పల్నాడు ప్రాంత ముఖద్వారమైన నర్సారావుపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు 1983లో ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్పీకర్‌గా పనిచేసిన ఆయన నర్సారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2019లో ఓటమి అనంతరం అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాద్‌ వారసుడిగా ఆయన కుమారుడు శివరాం టీడీపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు నుంచే తండ్రికి బాసటగా రాజకీయాలు చేసిన ఆయన ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్‌ ఆశించారు. కానీ చంద్రబాబు ఆ స్థానంలో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వడంతో శివరాం రాజకీయ జీవితం డోలాయమానంలో పడిరది. తనకు టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన శివరాం, ఇప్పుడు వెనక్కి తగ్గి పార్టీ నిర్ణయానికి తలొగ్గి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు.

గల్లా స్వచ్ఛంద విరమణ

మొదట కాంగ్రెస్‌లో, తర్వాత తెలుగుదేశంలో ప్రముఖ పాత్ర పోషించిన మరో కుటుంబం.. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్‌ది. ఈయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త. అమరరాజా గ్రూప్‌ సంస్థలు ఈ కుటుంబానివే. ఈయన సతీమణి గల్లా అరుణకుమార్‌ కాంగ్రెస్‌లో కొన్ని దశాబ్దాలపాటు క్రియాశీల పాత్ర పోషించారు. ఉమ్మడి ఏపీలో 1989 నుంచి 2014 మధ్య కాలంలో నాలుగుసార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీ అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన ఆమె కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మూడుసార్లు మంత్రిగా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె వారసుడిగా తెరపైకి వచ్చిన కుమారుడు గల్లా జయదేవ్‌ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సిటింగ్‌ ఎంపీగా ఉన్న ఆయన తన కుటుంబ వ్యాపారాల్లో బిజీగా ఉన్నందున రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. దాంతో గల్లా కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే.

మూసుకుపోయిన మాగంటి అవకాశాలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మాగంటి కుటుంబం. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ హవా ఉన్నన్నాళ్లు ఈ కుటుంబం నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఈ కుటుంబానికి చెందిన మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి దెందులూరు నియోజకవర్గం కేంద్రంగా సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. 1989కి ముందు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు. 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికై చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు. ఆయన తదనంతరం వారసుడిగా ఆయన కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) రాజకీయాల్లోకి వచ్చి జిల్లా టీడీపీలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒకసారి, 2014లో మరోసారి ఏలూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి వైఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన మళ్లీ ఏలూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నించినా చంద్రబాబు అవకాశం ఇవ్వకుండా మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడికి సీటు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు మొత్తానికి రాజకీయాలకు దూరమైనట్లే.

ప్రచారానికే ముద్రగడ పరిమితం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖంగా పేరొందిన ముద్రగడ కుటుంబం కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. వాస్తవానికి ముద్రగడ గత పదేళ్లుగా ఎన్నికలకు దూరమైనా కాపు రాజకీయాల్లో మాత్రం చురుగ్గా ఉండేవారు. ఈ ఎన్నికల్లో కాపు ఓటర్ల మద్దతు కోసం ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేందుకు వైకాపా, జనసేనలు తీవ్రంగా ప్రయత్నించాయి. దాంతో ఆయన మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనుకున్నారు. కానీ జనసేన తప్పుకోవడంతో చివరికి ఆయన వైకాపాలో చేరారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితమయ్యారు. ఆయన కుమారుడు పుల్లారావు పోటీ చేస్తారనుకున్నా అది కూడా జరగలేదు. ఎన్నికల అనంతరం రాజ్యసభ పదవి ఇస్తామని వైకాపా అధినేత జగన్‌ ముద్రగడకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా వైకాపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని ముద్రగడ ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, పరిస్థితి ఎలా ఉంటుందో గానీ ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయాలకు ఆయన దూరమయ్యారు.

దేవినేని దూరం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం. విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ, రూరల్‌ ప్రాంతాల్లో దేవినని వెంకటరమణ కుటుంబం కీలకపాత్ర పోషించేవి. రూరల్‌ జిల్లాకు చెందిన దేవినేని వెంకటరమణ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పెదనాన్న కుమారులైన దేవినేని నెహ్రూ, మురళీలతో కలసి ఆ పార్టీలో చేరిన దేవినేని వెంకటరమణ 1994లో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ అనతికాలంలోనే రైలు ప్రమాదంలో మరణించడంతో ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమామహేశ్వరరావు నందిగామ నుంచి రెండుసార్లు, మైలవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో దశాబ్ద కాలానికిపైగా నిర్ణయాత్మక పాత్ర పోషించిన ఆయన గత ఎన్నికల్లో ఓటమితో వెనుకబడ్డారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీకి ప్రయత్నించినా పార్టీ అతనికి కాకుండా వైకాపా నుంచి వచ్చి చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్‌ ఇవ్వడంతో దేవిననే ఉమా రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడిరది.



 
 
 

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page