top of page

ఆంక్ష తొలగింది.. ఆస్తి దక్కింది!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 20, 2024
  • 3 min read
  • `నిషేధిత జాబితా నుంచి పీఎన్‌ కాలనీ 4`10 లైన్లకు మోక్షం

  • `అధికారుల పొరపాటుతో 22`ఏలో చేరిపోయిన ఆస్తులు

  • `ఎనిమిదేళ్ల క్రితం జరిగిన తప్పు.. ప్రైవేట్‌ ఆస్తులకు ముప్పు

  • `రెండు నెలల క్రితమే దీనిపై ‘సత్యం’లో సమగ్ర కథనం

  • `సుదీర్ఘ పోరాటం తర్వాత వాటికి నిషేధం నుంచి మినహాయింపు

హమ్మయ్యా.. నిషేధం తొలగింది. మా ఆస్తులకు మోక్షం లభించింది.. అని వాటి యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తమ ఆస్తిపై తమకు హక్కు, అధికారం లభించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పీఎన్‌ కాలనీలో నాలుగో లైన్‌ నుంచి పదో లైన్‌ వరకు ఉన్న ఇళ్లు, స్థలాలు అధికారుల నిర్వాకం కారణంగా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోవడంతో వాటి అసలు యజమానాలు హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడిరది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వారంతా తమ హక్కు, అధికారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ నానా అగచాట్లు పడ్డారు. దీనిపై మార్చి ఆరో తేదీన ‘వారి పొరపాటు.. వీరికి నిషేధం పోటు’ శీర్షికతో సాయంకాల పత్రిక ‘సత్యం’ కథనం కూడా ప్రచురించింది. దాంతో అధికారవర్గాల్లో కదలిక వచ్చింది. అదే సమయంలో యజమానుల పోరాటం, ఆరాటం ఫలించాయి. అధికారులు తాము చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు. దాంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పొరపాటున నిషేధిత ఆస్తుల జాబితా(22`ఏ)లోకి వెళ్లిపోయిన ఫాజుల్‌బాగ్‌పేట రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 100/5లో ఉన్న 25.78 ఎకరాల భూమిని ఆ జాబితా నుంచి దేవదాయ శాఖ అధికారులు తప్పించారు. ఆ మేరకు ఈ సర్వే నెంబర్‌ పరిధిలోని పీఎన్‌ కాలనీ నాలుగు నుంచి పదో లైన్‌ వరకు ఉన్న భూములను మినహాయించాలని ఈ నెల 17న ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని ఫాజుల్‌బాగ్‌పేట రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్‌ 100/5బి లో 94 సెంట్లు మాత్రమే నారాయణ తిరుమల దేవాలయానికి చెందుతుందని నోటిఫై చేస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలోని ఎస్టేట్స్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవదాయ భూములుగా నమోదైన ఈ ప్రాంతంలోని మిగిలిన ప్రైవేట్‌ ఆస్తులకు మోక్షం లభించింది. ఈ వివాదం నేపథ్యంలో నారాయణ తిరుమల ట్రస్టీగా వ్యవహరిస్తున్న యతిరాజులు సర్వే నెంబర్‌ 100/5లో తమకు 1.74 ఎకరాల భూమి ఉన్నట్టు ఇంతకుముందే దేవదాయ శాఖకు వివరణ ఇచ్చారు. అలాగే ఆర్డీవో, తహసీల్దార్లు రెవెన్యూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అనంతరం సర్వే నెంబర్‌ 100/5బి లోని 94 సెంట్ల భూమిలోనే నారాయణ తిరుమల ఆలయం ఉన్నట్టు నిర్థారించి నివేదిక ఇచ్చారు.

పొరపాటు సరిదిద్దారు ఇలా..

ఈ వివాదంపై 2015 డిసెంబర్‌ 23న దాఖలైన రిట్‌ పిటిషన్‌ నెం.343/2015పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దేవదాయ శాఖ శ్రీకాకుళం సహాయ కమిషనర్‌ 2020 జనవరి 30న, ఈ ఏడాది మార్చి 11న కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికను అనుసరించి నిషేధిత ఆస్తుల జాబితా సవరించాలని దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ఉత్తర్వులు జారీచేశారు. అంతకు ముందు ఫాజుల్‌బాగ్‌పేటలోని సర్వే నెంబర్‌ 100/5లోని భూమిని ఎండోమెంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో ఆ సర్వే నెంబర్‌లో ఉన్న పీఎన్‌ కాలనీలోని నాలుగు నుంచి పదో లైన్‌ వరకు మొత్తం 25.74 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరిపోయింది. ఆ మేరకు దాన్ని అడంగల్‌లో దాన్ని దేవదాయ శాఖ భూమిగా నమోదు చేశారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సర్వే నెంబరులో ఉన్న స్థలాలు, ఇళ్ల విక్రయానికి పలువురు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితేగానీ తమ ఆస్తులు నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయాయన్న విషయం తెలుసుకోలేకపోయారు. దాంతో ఆందోళనకు గురై తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలు పట్టుకొని ఉన్నతాధిóకారుల చుట్టూ తిరగడం ప్రారంభించారు. కుటుంబ అవసరాల కోసం ఆస్తిని విక్రయించలేక, ఉన్న కొద్దిపాటి స్థలంలో కొత్తగా ఇళ్లు కట్టుకునే అవకాశం లేక నానా తిప్పలు పడ్డారు. ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో నారాయణ తిరుమల ఆలయ ప్రహరీ పరిధిలో 1.72 ఎకరాల భూమి ఉన్న సర్వే నెంబర్‌ 100/5లో సబ్‌ డివిజన్‌ చేసి మిగతా 24.02 ఎకరాలను మినహాయించాలని నిర్ణయించారు.

ఎఫ్‌ఎంబీ ప్రకారం నారాయణ తిరుమల దేవాలయం ఉన్న రాళ్లగుట్ట, దానికి ఆనుకొని కోనేరు సర్కారీ పుంజగానే రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 2015`16 మధ్య జరిగిన పొరపాటు రెండేళ్ల క్రితం వరకు గుర్తించలేక, గుర్తించినా దాన్ని సరిచేయలేక రెవెన్యూ, దేవదాయశాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. తహసీల్దార్‌ ఎండార్స్‌మెంట్‌ ఇస్తున్నందున నగరపాలక సంస్థ వీటికి ప్లాన్‌ అప్రూవల్‌ ఇస్తున్నా బ్యాంకులు మాత్రం రుణాలు ఇవ్వడం లేదు. క్రయవిక్రయాలు, నూతన గృహ నిర్మాణాలు జరగడం లేదు. జరిగినా వాటికీ అనుమతులు ఉండటం లేదు. దీనిపై రెవెన్యూ, దేవదాయ, సర్వే శాఖల అధికారులతో జేసీ నవీన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ రెండు శాఖల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. అడంగల్‌లో మినహా ఇరు శాఖల రికార్డుల్లో ఎక్కడా ఆ భూమి దేవదాయశాఖకు చెందినదిగా నమోదు కాలేదని గుర్తించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనే ఇప్పుడు ఎండోమెంట్‌ నుంచి మిగిలిన భూములకు విముక్తి లభించింది. నిషేధిత జాబితా నుంచి మిగతా భూమిని తప్పించడంతో రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలకు అవకాశం లభించింది. దేవదాయ కమిషనర్‌ ఆదేశాలపై స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్‌ శాఖ డైరెక్టరేట్‌కు, జిల్లా రిజిస్ట్రార్‌కు నోట్‌ఫైల్‌ పెట్టి నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్‌ 100/5ను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దీంతో పీఎన్‌ కాలనీవాసుల ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page