కూన రవి నిర్ణయం వెనుక ఆంతర్యం అదేనా?
తొలుత మంత్రుల జాబితాలో మాజీ విప్ పేరు..
చివరి నిమిషంలో తప్పించడంపైనే కాళింగుల అనుమానాలు
దానికి తగినట్లే సెక్యూరిటీ సిబ్బందిని తిరస్కరించడంతో దుమారం

తనకు గన్‌మెన్‌ల అవసరం లేదని వెనక్కు పంపడం ద్వారా ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ప్రస్తుత ప్రభుత్వం మీద గన్ ఎక్కుపెట్టారు. తనకు శత్రువులెవరూ లేరని, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగడానికి గన్‌మెన్‌లు అడ్డుగా ఉంటారని భావించే తాను వారిని వద్దనుకున్నట్లు ఆయన పేర్కొన్నా, ఆయన ఆంతర్యం మాత్రం అది కాదని అంటున్నారు. కూన రవికుమార్‌కు గతంలో ఆమదాలవలస నుంచి ఎన్నికైన ఏ ఎమ్మెల్యేకూ రానంత మెజారిటీ ఈసారి వచ్చిన మాట వాస్తవం. అంతమాత్రాన ఆయనకు త్రెట్ లేదని చెప్పలేం. ఎందుకంటే.. రాష్ట్రంలో పౌర సమాజం వైకాపా పుణ్యమా అని రెండుగా చీలిపోయింది. కాబట్టి ఇంతవరకు గన్‌మెన్ అనే వ్యవస్థ రాజకీయ నాయకులకు హోదాలో భాగమే అయివుండొచ్చు కానీ, ఈసారి మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులకు త్రెట్ ఉంటుందనేదే ఇంటెలిజెన్స్ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో కూన రవికుమార్ తనకు గన్‌మెన్‌లు అవసరం లేదంటూ వెనక్కు పంపడం రాజకీయ దుమారాన్ని రేపింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూన రవికుమార్ గెలుపు ఖాయమని ముందుగానే ఎలా అంచనా వేశారో.. ఆయనకు మంత్రి పదవి ఖాయమని కూడా అలాగే భావించారు. కానీ ఆ పదవి దక్కకపోవడంతో జిల్లాలోని ఆయన సామాజికవర్గానికి చెందిన అనేకమంది బహిరంగంగానే కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే రవికుమార్ మాత్రం ఎక్కడా తన అసంతృప్తిని బయటపెట్టలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి జిల్లాలో అడుగుపెట్టినప్పుడు రవికుమార్‌ను రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కాళింగులు, ఆయన నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. ఒక విధంగా చెప్పాలంటే కూన రవికుమార్ తరఫున జరిగిన బలప్రదర్శనే ఇది. వాస్తవానికి ఈ జిల్లాలో కీలకమైన కాళింగ సామాజికవర్గానికి ఏ ప్రభుత్వంలోనైనా ఒక మంత్రి పదవి వస్తుందనేది గతం చెబుతున్న వాస్తవం. 2014లో కూన రవికుమార్ మొదటిసారి గెలవడం వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కకపోయినా విప్ పదవి ఇచ్చి టీడీపీ గౌరవించింది. ఆ తర్వాత జిల్లా పార్టీ బాధ్యతలు మోసి ఎన్నికల వరకు అన్నీ తానే అయి వ్యవహరించినందున ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో అది మిస్సయింది. తెల్లవారితే మంత్రుల జాబితా ప్రకటిస్తారని భావించకముందే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటూ, విజయవాడలో అందుబాటులో ఉండాలంటూ రవికుమార్‌కు కబురొచ్చినట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు. కానీ ఉదయానికి సీన్ మారిపోయింది. అప్పటికే రవికుమార్ మంత్రవుతారని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ఆమదాలవలస క్యాడర్ విజయవాడకు తరలివెళ్లారు. అందరికీ భోజనం, వసతి సదుపాయాలు రవికుమార్ ఏర్పాటు చేస్తుండగానే కాబోయే మంత్రికి ప్రొటెక్షన్ అంటూ గన్‌మెన్లు కూడా వచ్చారని ఆమదాలవలసలో చెబుతున్నారు. కానీ తుదిజాబితాలో ఆయన పేరు లేదు.
వారి పదవులతో లింకు లేదు
జిల్లా నుంచి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడానికే కూన రవికుమార్‌ను బలి తీసుకున్నారన్న కోణంలో ఆయన సామాజికవర్గానికి చెందిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దాంతో పాటు వైకాపా ప్రభుత్వంలో కాళింగులకు ఇచ్చిన ప్రాధాన్యతపై ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఉదాహరణలు చెప్పుకొచ్చారు. జిల్లాలో కాళింగులంతా టీడీపీ మీద కోపంతో ఉన్నారని, కూన రవికి చీఫ్ విప్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా ఆ పదవి తీసుకోవడానికి ఆయన అంగీకరించలేదని మరికొందరు చెబుతున్నారు. వాస్తవానికి కూన రవికి మంత్రి పదవి దక్కకపోవడానికి అచ్చెన్నాయుడుకు వరించిన మంత్రి పదవి కారణం కాదు. పార్టీ తలచుకుంటే జిల్లాలో కాళింగుల తరఫున రవికుమార్‌కు మంత్రి పదవి ఇవ్వొచ్చు. కాకపోతే ఇక్కడ హ్యాట్రిక్ విజయం సాధించిన డాక్టర్ బెందాళం అశోక్‌కు ఇవ్వాలా, లేక డైనమిక్ లీడర్ కూన రవికి ఇవ్వాలా అనే అంశాన్ని తేల్చుకోలేక ఇద్దర్నీ పక్కన పెట్టింది. పక్క జిల్లా విజయనగరంలో ఇద్దరు మంత్రులు కూడా జూనియర్లే. ఇద్దరూ తొలిసారి గెలిచినవారే. కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిల కంటే తల పండిపోయిన నేతలున్నా అక్కడ వీరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇక కేంద్రంలో అబ్బాయ్, రాష్ట్రంలో బాబాయ్ ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారన్న వాదన బహుశా సరికాకపోవచ్చు. ఎందుకంటే ఎన్డీయేతో 2014లో పొత్తు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీ 2018లో బయటకు రాకపోతే 2019లో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలోనే రాము మంత్రి అయ్యుండేవారు. అది ఇప్పుడు కుదిరింది. ఇక జిల్లాకు సంబంధించి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి లేకపోవడమనేది ఊహించలేని అంశం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ఇప్పుడు చంద్రబాబు తర్వాత రాష్ట్రస్థాయి నాయకుల్లో టాప్`5లో ఒకరు. కాబట్టి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడం కోసమే కూన రవికుమార్‌కు పదవి ఇవ్వలేదని భావించడం సరికాదని చాలామంది చెబుతున్నారు. అయితే కూన రవి లాంటి దూకుడు ప్రదర్శించే నేతకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో అధికారులను మరింత వేగంగా పరుగులు పెట్టించగలరు. కాకపోతే అచ్చెన్నాయుడిది కూడా ఇదే శైలి. ప్రస్తుతం కూన రవికుమార్ విజయవాడలో ఉన్నారు. బహుశా ఈ విషయంపై ఆయనతో పార్టీ పెద్దలు మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని రవి చెబుతున్నా, గన్‌మెన్‌లను వెనక్కు పంపడం ద్వారా తన అసంతృప్తిని పరోక్షంగా ప్రకటించినట్లే. మొన్నటికి మొన్న పొందూరు మండలంలో రవి భార్య ప్రచారానికి వెళ్లినప్పుడు కొందరు దాడికి ప్రయత్నించారు. 2014 ఎన్నికల్లో స్వయంగా రవికుమార్ మీదే దాడి చేయగా, ఆయన చెయ్యి విరిగింది. కాబట్టి ఆయనకు త్రెట్ లేదని చెప్పడం అసంబద్ధం. కేవలం తన అలకను బయటపెట్టేందుకే రవికుమార్ గన్‌మెన్‌లను వెనక్కు పంపారని భావించవచ్చు.
Comments