top of page

ఆ గ్రామం ఓటేసిందోచ్‌!

Writer: DV RAMANADV RAMANA
  • `75 ఏళ్లుగా ఎన్నికలంటే ఏమిటో తెలియని గిరిజనాపురం

  • `తొలిసారి ఈ ఎన్నికల్లోనే ఓటు వేసిన 19మంది గ్రామస్తులు

  • `మీడియా కథనాలతో గ్రామానికి క్యూ కట్టిన నేతలు, అధికారులు

  • `ఓటు వేశాం.. సౌకర్యాలు కల్పించాలంటున్న స్థానికులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

అదేమిటి ఒక గ్రామంవారు ఓట్లేస్తే అదొక వింతా?.. దానికో వార్తా!.. అని తీసిపారేయవద్దు. ఎందుకంటే.. ఇప్పుడు మనం చెప్పుకొనే గ్రామం జీవితంలో తొలిసారి ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి అయ్యింది. అదే ఇక్కడి విశేషం. దేశానికి స్వాతంత్య్రం లభించి 77 ఏళ్లయ్యింది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా ప్రజాప్రభుత్వాలను ఎన్నుకునే విధానం 1951`52లో మొదలైంది. అప్పటినుంచీ ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓటు ప్రాధాన్యతను, ఓటు వేయాల్సిన బాధ్యతను వివరిస్తూ ప్రభుత్వాలు ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ అవే ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం ప్రధాన జనస్రవంతికి దూరంగా మారుమూల అటవీ గ్రామాలను ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకొచ్చే విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికీ దేశంలో అనేక గ్రామాలు ఓటు వేయడం సంగతి ఎలా ఉన్నా.. కనీసం ఎన్నికలు అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఉన్నాయి. అటువంటి గ్రామాల్లో ఒకటైన గిరిజనాపురం ఎట్టకేలకు ఎన్నికల వ్యవస్థ మొదలైన 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలో తనవంతు బాధ్యత నిర్వర్తించింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మీడియా ఈ గ్రామంలో ఎవరికీ ఓట్లు లేని విషయం బయట ప్రపంచానికి వెల్లడిరచడం, ఎన్నికల అధికారులు సత్వరం స్పందించడం వల్లే ఇది సాధ్యమైంది.

50 మందే ఉన్న చిన్న గ్రామం

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుని వార్తల్లో నిలిచిన గిరిజనాపురం కాకులు దూరని కారడవుల్లోనో.. చీమలు దూరని చిట్టడవుల్లోనో లేదు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని గోకవరం పంచాయతీ పరిధిలో ఉన్న చిన్న గిరిజన గ్రామం ఇది. చెన్నై`కోల్‌కతా జాతీయ రహదారి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉన్న ఈ గ్రామంలో మొత్తం అంతా కలిపి 50 మందికి మించని జనాభా. తూర్పు కనుమల్లో ఉన్న అనేక కుగ్రామాల్లో ఇదొకటి. రెండున్నర నెలల క్రితం మార్చిలో ఈ గ్రామాన్ని బీబీసీ తెలుగు ప్రతినిధి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారికి ఓటుహక్కు లేదని, ఎన్నికలంటే ఏమిటో కూడా తెలియదన్న విషయం బయటపడిరది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయం కూడా వారికి తెలియకపోవడం చూస్తే ప్రధాన జీవన స్రవంతికి వారెంత దూరంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఆదివాసీలందరూ కొండ దొర తెగకు చెందినవారే. పైగా మాతే, ఉల్లి అనే ఇంటి పేర్లతో ఉన్నవారే. పోడు వ్యవసాయం, అడవిలో కట్టెలు కొట్టడం, బొగ్గులు అమ్ముకోవడం వీరి ప్రధాన జీవనాధారం. రాష్ట్రంలోని చాలా గిరిజన ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నవారికి ప్రభుత్వం పోడు పట్టాలు ఇచ్చి, వారు సాగు చేసుకుంటున్న భూములను అనుభవించే హక్కు కల్పించినా గిరిజనాపురం గ్రామాస్తులకు మాత్రం పోడు పట్టాలు అందలేదు. ఉపాధి హామీ పథకం కూడా అమలు కావడం లేదు. అంగన్‌వాడీ కేంద్రం వంటివి కూడా అందుబాటులో లేవు. రోడ్డు సౌకర్యం అసలే లేదు. అయితే రేషన్‌ బియ్యం మాత్రం అందుతున్నాయి. గ్రామంలో ఆరుగురికి వృద్ధాప్య పింఛన్లు, ముగ్గురికి వికలాంగ పింఛన్లు అందుతున్నాయి. అయితే వాటి కోసం ప్రతినెలా కొండ దిగి కిందికి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల నానా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇద్దరు వివాహిత మహిళలు మాత్రమే కాస్త అక్షర జ్ఞానం కలిగి ఉండగా, మిగిలిన వారందరూ నిరక్షరాస్యులే. వారిద్దరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి గిరిజనాపురానికి కోడళ్లుగా వచ్చినవారే. గ్రామంలో బడి లేకపోవడంతో గ్రామస్తులకు చదువుకునే ఆవకాశం లభించడంలేదు. విద్యుత్‌ సౌకర్యం ఉన్నా కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి.

పార్టీలూ, అధికారులూ వచ్చారు

గిరిజనాపురం వాసులకు ఓటుహక్కు లభించని విషయం మీడియా ద్వారా తెలుసుకున్న కాకినాడ జిల్లా యంత్రాంగం హుటాహుటిన గ్రామానికి తరలివెళ్లి ఎన్మూరేషన్‌ చేసింది. అర్హులైన 19 మందిని ఓటర్ల జాబితాలో చేర్చి, గుర్తింపు కార్డులు అందజేసింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీలు కూడా తొలిసారి ఆ గ్రామంలో అడుగు పెట్టాయి. తమకు ఓటు వేయాలంటూ ప్రధాన పార్టీల నాయకులు గ్రామంలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో కొన్ని గుడిసెలపై పార్టీల జెండాలు కనిపిస్తున్నాయి. కానీ ఇన్నేళ్లపాటు ఆ గ్రామ ప్రజలకు ఎందుకు ఓటుహక్కు కల్పించలేకపోయారన్న దానికి అటు అధికారులు, ఇటు పార్టీల నాయకులు సమాధానం చెప్పలేకపోయారు. ఇక మీదట గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌ ముందురోజు అధికారులు వచ్చి గ్రామంలోని ఓటర్లకు ఓటరు స్లిప్పులు కూడా పంచిపెట్టి ఎలా ఓటు వేయాలో చెప్పారు. పలు స్వచ్ఛంద సంస్థలవారు కూడా గ్రామాన్ని సందర్శించి, సౌకర్యాల కల్పనకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాయి.

 4 కిలోమీటర్లు వెళ్లి ఓటు

మొత్తానికి ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో గిరిజనాపురం ఓటర్లు 19 మంది తరలివెళ్లి ఓట్లు వేశారు. దాని కోసం వారంతా కొండ దిగి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములపాలెం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు అంటే ఏమిటో తెలియని తాము మొదటిసారి ఓటు వేశామని వారు ఆనందంగా చెప్పారు. అయితే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంలో ఓటు వేయడం ఎలాగో తెలియక ఇబ్బంది పడిన వారికి పోలింగ్‌ కేంద్రంలోని సిబ్బంది దగ్గరుండి ఓటు వేయించారు. ఓటరు కార్డులు అందించడానికి అధికారులు వచ్చారు. ఓట్ల కోసం నాయకులు వచ్చారు. మేమూ ఓట్లు వేశాం. కాబట్టి ఇక నుంచి అధికారులు, నాయకులు తమ గ్రామానికి తరచూ వస్తుంటారని, సమస్యలు కూడా పరిష్కారమవుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం కల్పించి, పోడు పట్టాలు, పక్కా ఇళ్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. తాగునీటి సౌకర్యం లేక చెలమల నీరే వాడుతున్నామని, అందువల్ల నీటి పథకం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సబ్‌ ప్లాన్‌ ఏరియాలో ఉన్న ఈ గిరిజన గ్రామానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని అధికారులు చెప్పారు. ఓటుహక్కు ఆ గిరిజన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందో లేదో చూడాలి.

Kommentarer


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page